Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశంలో ఎన్నడూ నిర్ణయాత్మక ప్రభుత్వం లేదని వ్యాఖ్య
న్యూఢిల్లీ : దేశంలో ఎన్నడూ నిర్ణయాత్మక ప్రభుత్వం లేదని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. దేశ రోదసీ రంగం తన వాణిని వినిపించేందుకు పారిశ్రామిక సంస్థ ఇండియన్ స్పేస్ అసోసియేషన్ (ఐఎస్‌పీఏ)ను ప్రధాని సోమవారం ప్రారంభించారు. నష్టాలతో నడుస్తున్న ఎయిర్ ఇండియాను ప్రయివేటీకరిం చడంలో ప్రభుత్వం విజయం సాధించిందని, తమ నిబద్ధత, సీరియస్‌నెస్‌ను ఇది తెలియచేస్తోందని వ్యాఖ్యానించారు. అవసరం లేని రంగాల్లో ప్రయివేటు సంస్థలకు అవకాశం కల్పించాలనీ, అదే ప్రభుత్వ విధానమని అన్నారు. రోదసీ నుంచి రక్షణ వరకు పలు రంగాల్లో ప్రయివేటు రంగానికి ద్వారాలు తెరవడాన్ని ప్రధాని ఈ సందర్భంగా ప్రస్తావించారు. జాతీయ ప్రయోజనాలను అలాగే వివిధ పక్షాల అవసరాలను కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుంటుందన్నారు. గత ఏడేండ్లలో సగటున 5.35 రోదసీ మిషన్లు పూర్తయ్యాయని చెప్పారు. సంస్కరణలపై తమ దృక్పథం చాలా స్పష్టంగా వుందనీ, అందుకే ఇంత విస్తృతస్థాయిలో సంస్కరణలను తెస్తున్నామని చెప్పారు. రోదసీ రంగంలో పూర్తి స్థాయి సాంకేతికత కలిగిన కొద్ది దేశాల్లో భారత్ ఒకటని అన్నారు. పరిశ్రమలకు, యువ ఆవిష్కర్తలకు, స్టార్టప్‌లకు భాగస్వామిగా ప్రభుత్వం సాయపడుతోందని, ఇది కొనసాగుతోందని చెప్పారు. ఆత్మనిర్భర్ భారత్ పట్ల ప్రధాని దార్శనికతను వెల్లడిస్తూ, భారత్ స్వావలంబనతో, సాంకేతికంగా ముందుకెళ్ళేలా, రోదసీ రంగంలో నాయకత్వ పాత్ర పోషించేలా ఐఎస్పిఎ చర్యలు తీసుకుంటుందని తెలిపింది.
రోదసీ రంగంలో ప్రయివేటు పెట్టుబడులు
జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మాట్లాడుతూ, ఆర్థికాభివృద్ధి, సాంకేతికాభివృద్ధి అనేవి జాతీయ శక్తి సామర్ధ్యాలకు అత్యంత కీలకమైన అంశాలుగా వుంటాయన్నారు. జాతీయ భద్రత, అభివృద్ధికి రూపొందించే విధానాల్లో ఇక ప్రభుత్వాలొక్కటే వాటాదారులుగా వుండలేవని అన్నారు. జాతి నిర్మాణంలో సమాన వాటాదారుగా ప్రయివేటు రంగం కూడా సమాన పాత్ర పోషించాల్సి వుందన్నారు. ఇప్పటివరకు ప్రభుత్వ రంగం ఆధిపత్యం ఎక్కువగా వుండే రోదసీ రంగంలో నెమ్మదిగా ప్రయివేటు రంగానికి ద్వారాలు తెరవాల్సిన అవసరం వుందన్నారు. రోదసీ రంగంలో ప్రయివేటు పెట్టుబడుల వల్ల అత్యంత సాంకేతికమైన ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయన్నారు. జాయింట్ వెంచర్ల ద్వారా విదేశీ భాగస్వాముల ప్రమేయం పెంచాలన్నారు. ఈ చర్యలతో రోదసీ రంగ ఆస్తులకు భారత్ కేంద్రంగా తయారవుతుందని అన్నారు.