Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐదేండ్లలో పెట్రోల్, డీజిల్ ధరలు రెట్టింపయ్యాయి
- ఎక్సైజ్ డ్యూటీ నిరంతరం పెంపుతో ధరల పెరుగుదల
- అంతర్జాతీయంగా ధరలు తగ్గినా వినియోగదారులకు ఉపశమనం లేదు
- వ్యాక్సిన్ సేకరణ పెంచాలి
- కేంద్ర మంత్రి కుమారుడు ఆశిష్ మిశ్రాపై కఠిన చర్యలు తీసుకోవాలి
- బొగ్గు ఉత్పత్తి తగ్గించడంపై కేంద్రం సమాధానం ఇవ్వాలి
- పార్టీ మహాసభ రాజకీయ తీర్మానం అవుట్లైన్పై చర్చ : విలేకరుల సమావేశంలో సీతారాం ఏచూరి
న్యూఢిల్లీ : ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో బీజేపీని ఒంటరి చేయడం, ఓడించడమే తమ ప్రాథమిక కర్తవ్యమని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తెలిపారు. బీజేపీ వ్యతిరేక ఓటును పెంచేం దుకు రాష్ట్రాల వారీగా నిర్ణయం తీసుకుంటామని తెలి పారు. ఇప్పటికే రాష్ట్రాల వారీగా నిర్ణయాలను తీసుకు న్నామనీ, దాని మీద ఆధారపడే తమిళనాడు, అసోం వంటి రాష్ట్రాల్లో పొత్తులు పెట్టుకున్నామని వివరిం చారు. అయితే, రాజకీయ పొత్తులకు సంబంధించి తుది నిర్ణయం అఖిల భారత మహాసభ తీసుకుంటుం దని స్పష్టం చేశారు. సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సమా వేశం ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో శని, ఆదివారాల్లో రెండు రోజుల పాటు జరిగింది. అనంతరం సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీతారాం ఏచూరి మాట్లాడారు. ఎన్నికలు వచ్చినప్పుడు కూటములు గురించి చర్చ వస్తున్నదనీ, కానీ ఎన్నికల తరువాత ప్రభుత్వాలు ఏర్పాటు చేశామనే గుర్తుకు తెచ్చుకోవాలని అన్నారు. అందుకు చారిత్రిక అనుభవమూ ఉందని, ఎమర్జెన్సీ ఓడించిన తరువాత జనతా ప్రభుత్వం (1977), యునైటెడ్ ప్రభుత్వం (1996), యూపీఏ ప్రభుత్వం (2004) వంటివి ఎన్నికల తరువాతే ఏర్పాడ్డాయని తెలిపారు. తమ పార్టీని స్వతంత్రంగా బలోపేతం చేసుకోవడంతోనే, తమ రాజకీయ జోక్యం పెరుగుతుందని అన్నారు. ఎయిర్ ఇండియాను టాటాకు అమ్మేశారనీ, రూ.60 వేల కోట్లకుపైగా అప్పులు ఉన్నాయని తెలిపారు. అయితే టాటా రూ.15 వేల కోట్లకు కొనుగోలు చేసిందనీ, మిగిలిన రూ.46 వేల కోట్లు కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని వివరించారు. అలాగే జాతీయ ఆస్తులను ఇలాగే కట్టబెడుతున్నారనీ, దీన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దీనికి వ్యతిరేకంగా కార్మిక సంఘాలు పిలుపు ఇచ్చిన ఆందోళనల్లో తమ పార్టీ భాగస్వామ్యం అవుతుందని తెలిపారు.
సెంట్రల్ ఎక్సెజ్ డ్యూటీ పెంపే కారణం..
గత ఐదేండ్లలో పెట్రోల్, డీజిల్ ధరలు రెట్టింపు అయ్యాయని సీతారాం ఏచూరి విమర్శించారు. అలాగే అంతర్జాతీయంగా పెట్రో ఉత్పత్తుల ధరలు తగ్గాయని తెలిపారు. 2016 నుంచి అంతర్జాతీయంగా ధరలు తగ్గిన సమయంలోనూ దేశంలో వినియోగదారులకు ఉపశమనం లభించలేదని విమర్శించారు. అందుకు కారణం సెంట్రల్ ఎక్సెజ్ డ్యూటీ నిరంతరం పెంచుకుంటూ పోతున్నారనీ, అందులో పెట్రోల్ పన్నులు, లెవీల వల్లనే 70 శాతం వస్తుందని అన్నారు. ధరలు పెరుగుదల ప్రజలపై మాత్రమే దాడి కాదనీ, దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా దాడి అవుతుందని పేర్కొన్నారు. పెట్రోల్ ఉత్పత్తుల ధరలను నియంత్రించాలని, ఎక్సెజ్ డ్యూటీ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
బొగ్గు ఉత్పత్తి తగ్గించేందుకు కారణం ఏమిటి?
కోల్ ఇండియా బొగ్గు ఉత్పత్తిని ఎందుకు తగ్గించిందో కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని సీతారాం ఏచూరి డిమాండ్ చేశారు. అటవీ హక్కుల చట్టాన్ని తుంగలో తొక్కి విచక్షణా రహితంగా బొగ్గు గనులు తవ్విందని అన్నారు. కానీ ఇప్పుడు బొగ్గు కొరతలేదని, అవసరమైన బొగ్గు ఉందని కోల్ ఇండియా చెబుతుందనీ, అయితే దేశంలో బొగ్గు కొరత ఉందని అన్నారు. విదేశీ సంస్థలను ఆహ్వానించి బొగ్గు గనులు దోచిపట్టేందుకే బొగ్గు కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారని విమర్శించారు. అలాగే దేశంలోని ప్రజల వద్ద ప్రతి యూనిట్ విద్యుత్‌కు అదనపు ఛార్జీలు వసూల్ చేసేందుకు ఈ పరిస్థితిని తెచ్చారని విమర్శించారు.
వ్యాక్సిన్ సేకరణ పెంచాలి
కోవిడ్ నిర్వహణలో విఫలమైన ప్రభుత్వం, వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ఆశించినంత స్థాయిలో నిర్వహించలేదని విమర్శించారు. ఇప్పటి వరకు దేశంలో 20 శాతం కంటే తక్కువ వ్యాక్సినేషన్ జరిగిందని అన్నారు. ప్రధాని మోడీ పుట్టిన రోజున వ్యాక్సిన్ అందించినట్టు, మిగతా రోజులు ఎందుకు అందించటం లేదని ప్రశ్నించారు. దేశంలో 18 ఏండ్లుపైబడిన పౌరులందరికీ డిసెంబర్ 31 నాటికి వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామని మోడీ సర్కార్ అత్యున్నత న్యాయస్థానికి అఫిడవిట్ ద్వారా తెలిపిందనీ, కానీ ప్రస్తుత వ్యాక్సినేషన్ పరిస్థితి చూస్తుంటే అది సాధ్యం కాదని అన్నారు. వ్యాక్సిన్ సేకరణ వేగవంతం చేయాలనీ, దేశీయంగా ఉత్పత్తిని పెంచాలని డిమాండ్ చేశారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తే, దాన్ని కూడా వేగవంతం చేయాలని సూచించారు.
ఆశిష్ మిశ్రాపై చర్యలు తీసుకోవాలి
లఖింపూర్ ఖేరీ ఘటనలో నలుగురు రైతులు, ఒక జర్నలిస్టు హత్యకు కారణమైన కేంద్ర హౌం సహాయ మంత్రి అజరు మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాను అరెస్టు చేశారనీ, అయితే ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు వ్యతిరేకంగా కేంద్ర మంత్రి కూడా తన ప్రసంగాలతో రెచ్చగొట్టారని, దాని ఫలితమే లఖింపూర్ ఘటన అని పేర్కొన్నారు. ఆ క్రూరమైన ఘటనలో ఆయన చాలా కీలక పాత్ర పోషించారని, ఆ సందర్భంలో శాంతి భద్రతలు ఆమోదయోగ్యంగా లేవని అన్నారు.
కాశ్మీర్లో ఉగ్రదాడులు..
కాశ్మీర్ ప్రజలు అభద్రతాభావంలో ఉన్నారనీ, ఉగ్రవాద దాడులు జరుగుతున్నాయని తెలిపారు. ఇటీవలే జరిగిన ఉగ్రదాడులను ఏచూరి ఖండించారు. అక్కడ బీజేపీ ప్రమాదకర ఆట ఆడుతున్నదనీ, దానివల్ల పరిస్థితులు క్లిష్టంగా మారాయని విమర్శించారు. అక్కడ క్రూరమైన చర్యలతో కాకుండా, ప్రజలతో సంబంధాలు నెరపడంతోనే సాధారణ పరిస్థితులు నెలకొల్పవచ్చని తెలిపారు. రాజకీయ జోక్యం అవసరమనీ, అక్కడి ప్రజలతో కలిసి పని చేయాలని అన్నారు.
రాజకీయ తీర్మానం అవుట్లైన్పై చర్చ
23వ పార్టీ అఖిల భారత మహాసభల రాజకీయ తీర్మానం సారాంశం (అవుట్‌లైన్) గురించి పొలిట్ బ్యూరో సమావేశంలో చర్చించామని తెలిపారు. కేరళ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అసోం ఎన్నికలు, మరోవైపు కరోనా వైరస్ వల్ల మహాసభలు ఆలస్యం అయ్యాయని అన్నారు. ఏప్రిల్ 2022లో కేరళలోని కర్నూర్లో మహాసభలు నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిపారు. రాజకీయ తీర్మానం అవుట్‌లైన్ పొలిట్ బ్యూరోలో చర్చించామని అన్నారు. దాన్ని ఈ నెల 20 నుంచి 22 వరకు జరిగే పార్టీ కేంద్ర కమిటీ సమావేశాల్లో ప్రవేశపెడతామని అన్నారు. కేంద్ర కమిటీలో చర్చించి, ఆమోదం పొందిన తరువాత రాజకీయ ముసాయిదా తయారుచేస్తామని వివరించారు. దేశంలో సీపీఐ(ఎం) మాత్రమే పార్టీ మహాసభల్లో ప్రవేశపెట్టే రాజకీయ తీర్మానాన్ని రెండు నెలల ముందే విడుదల చేస్తుందనీ, పార్టీ అన్ని శాఖల్లో కార్యకర్తలందరూ చర్చిస్తారనీ, అదే తమ రాజ్యాంగ నిబంధన అని తెలిపారు. అన్ని భాషల్లో అనువదించి పంపిస్తామనీ, పార్టీ సభ్యులెవ్వరైనా తమ సవరణలు పార్టీ కేంద్ర కమిటీకి నేరుగా పంపించొచ్చని అన్నారు. ఆయా సవరణలు పరిగణలోకి తీసుకొని, పార్టీ మహాసభల్లో సమాధానం ఇస్తామని తెలిపారు. ఇది తమ పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యంలో భాగమని తెలిపారు. ఫిబ్రవరిలో రాజకీయ ముసాయిదా విడుదల చేస్తామని చెప్పారు. అఖిల భారత మహాసభల ప్రతినిధులను రాష్ట్ర మహాసభల్లో ఎన్నుకుంటారని తెలిపారు.
ప్రజలను తప్పుదోవ పట్టించడం బీజేపీకి అలవాటు
ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు అవాస్తవాలు మాట్లాడి, అసత్యాలను ప్రచారం చేయడం బీజేపీ ప్రభుత్వం, మంత్రులకు అలవాటని సీతారాం ఏచూరి విమర్శించారు. ప్రపంచ బ్యాంక్ నివేదిక ప్రకారం 34 ఏండ్ల వామపక్ష ప్రభుత్వం పశ్చిమ బెంగాల్లో వేగంగా పేదరికాన్ని నిర్మూలన చేసిన రాష్ట్రంగా నిలిచిందన్నారు. గుజరాత్ ఇప్పటి నుంచి కాదని శతాబ్దాలుగా ధనిక రాష్ట్రమనీ, దాన్ని వీరేదో గొప్పగా చేశామని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాజకీయ దాడి చేయడంలో భాగమే కేంద్ర హౌం మంత్రి అమిత్ షా కమ్యూనిస్టులపై వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. మోడీ సర్కార్ దేశాన్ని లూటీ చేస్తుంటే, దానికి వ్యతిరేకంగా ప్రజలను సమీకరించి, ఉద్యమాలు నడుతున్న వామపక్షాలు, ప్రధానంగా సీపీఐ(ఎం)పై దాడికి బీజేపీ పూనుకుందన్నారు. బీజేపీ మతోన్మాదాన్ని వ్యతిరేకిస్తున్నందువల్లే సీపీఐ(ఎం)ను టార్గెట్ చేస్తున్నారని అన్నారు. అంతేతప్ప వారి వ్యాఖ్యలు నిరాధారమైనవని, అసత్యమని అన్నారు.