Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రం కసరత్తు
- బొగ్గు కొరత, విద్యుత్ ఉత్పత్తిపై
- పీఎంఓ సమీక్ష
- కేటాయించని విద్యుత్‌ను రాష్ట్రాలు వాడుకోవచ్చు..
న్యూఢిల్లీ : దేశంలో ఒకపక్క బొగ్గు కొరత తీవ్రతరం అవుతుంటే, మరోవైపు బొగ్గు గనుల అమ్మకాలకు కేంద్ర ప్రభుత్వం తెరలేపింది. బొగ్గు గనుల అమ్మకాల కోసం బొగ్గు గనుల వేలంకు తదుపరి మార్గాన్ని కేంద్ర ప్రభుత్వం కసరత్తు షురూ చేసింది. ఇప్పటికే 28 బొగ్గు గనుల బ్లాకులను అమ్మకం చేసిన కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వశాఖ, మరో 40 బొగ్గుగనుల బ్లాకుల అమ్మకాన్ని మంగళవారం ప్రారంభించింది. అందులో సీఎం(ఎస్పీ) చట్టం ప్రకారం 21 నూతన గనులు, ఎంఎం డీఆర్ చట్టం ప్రకారం మరో 19 నూతన గనులు అమ్మకానికి పెట్టింది. మొత్తం 88 బొగ్గు గనులు విక్రయించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ 88 గనుల నుంచి సుమారు 55 బిలియన్ టన్నుల బొగ్గు వనరులు ఉన్నాయి. వీటిలో 57 పూర్తిగా అన్వేషించిన గనులు కాగా, 31 పాక్షికంగా అన్వేషించిన గనులు, నాలుగు ఐరన్, స్టీల్ పరిశ్రమల్లో ఉపయోగించే (కోకింగ్ కోల్) గనులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఒరిస్సా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, అరుణాచల్ ప్రదేశ్, అసోం వంటి 10 బొగ్గు బేరింగ్ రాష్ట్రాలలో గనులు విస్తరించి ఉన్నాయి.
పీఎంఓ సమీక్ష : వివిధ రాష్ట్రాల్లో బొగ్గు కొరతతో విద్యుత్ కష్టాలు వచ్చిన నేప థ్యంలో ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ) మంగళవారం బొగ్గు సరఫరా, విద్యుత్ ఉత్పత్తిని సమీక్షించింది. అనేక రాష్ట్రాలు ఎదుర్కొంటున్న ఇంధన సంక్షో భాన్ని తగ్గించడానికి ప్రభుత్వం మార్గాలను అన్వేషిస్తోంది. విద్యుత్ ప్లాంట్లలో బొగ్గు కొరతపై జరిగిన సమావేశంలో కొన్ని రాష్ట్రాలలో విద్యుత్ కోత గురించి చర్చించారు. విద్యుత్ శాఖ కార్యదర్శి అలోక్ కుమార్, బొగ్గు శాఖ కార్యదర్శి ఎ.కె. జైన్ బొగ్గు, విద్యుత్ లభ్యతపై ప్రజెంటేషన్ ఇచ్చారు. బొగ్గు రవాణాను పెంచే మార్గాల గురించి కూడా చర్చించారని సమాచారం. బొగ్గు సరఫరాను వేగవంతం చేయాలని బొగ్గు మంత్రిత్వ శాఖను కోరారు. విద్యుత్ ప్లాంట్లకు ఇంధనాన్ని రవాణా చేయడానికి రేక్‌లను అందుబాటులో ఉంచాలని రైల్వేలను కోరినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.
కేటాయించని విద్యుత్‌ను వాడుకోండి
విద్యుత్ అవసరాలను తీర్చేందుకు సెంట్రల్ జనరేటింగ్ స్టేషన్లు (సీజీఓఎస్)కు కేటాయించని విద్యుత్‌ను వినియోగించుకోవాలని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఈమేరకు మంగళవారం రాష్ట్రాలకు లేఖ రాసింది. కొన్ని రాష్ట్రాలు తమ వినియో గదారులకు విద్యుత్ సరఫరా చేయడం లేదని, కోత విధిస్తున్నాయని విద్యుత్ మంత్రిత్వ శాఖ దృష్టికి వచ్చింది. అదే సమయంలో వారు పవర్ ఎక్స్ఛేంజ్ల వద్ద అధిక ధరకు విద్యుత్‌ను విక్రయిస్తున్నారు. విద్యుత్ కేటాయింపు మార్గదర్శకాల ప్రకారం సీజీఎస్ నుండి 15 శాతం కేటాయించని విద్యుత్ ఉంటుంది. అవసరమైన రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తుంది. అవసరమైన వినియోగదారులకు విద్యుత్ సరఫరా చేయాల్సిన బాధ్యత పంపిణీ సంస్థలది. అంతే తప్ప పంపిణీ సంస్థలు పవర్ ఎక్స్ఛేంజీలో విద్యుత్‌ను విక్రయించకూడదు. వారి స్వంత వినియోగదారులను అవసరానికి వాడాలి. అందువల్ల కేటాయించని విద్యుత్‌ను ఉపయోగించాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. మిగులు విద్యుత్ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలని తెలిపింది.
కేంద్రం నిజాలు దాస్తోంది : ఏచూరి
దేశంలో విద్యుత్ సంక్షోభం, బొగ్గు కొరత గురించి కేంద్రం నిజాలను దాచిపెడతుందని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ థర్మల్ యూనిట్ల మూసివేతకు సంబందించి వివిధ రాష్ట్రాల నుంచి ఫిర్యాదులు రావడంతో కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సంక్షోభం, బొగ్గు కొరతపై నిజాలను దాచిపెడుతోందని విమర్శించారు. '' కేంద్ర మంత్రి బొగ్గు కొరత లేదని అంటున్నారు. కానీ ప్రతి రాష్ట్రం నుంచి థర్మల్ యూనిట్లు మూసివేసినట్టు, బొగ్గు లేనందున విద్యుదుత్పత్తి జరగడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి'' అని అన్నారు. కరోనా రెండో దశ సమయంలో కూడా ఆక్సిజన్ కొరత గురించి నిజాలను ప్రభుత్వం దాచిపెట్టిందని, ఇప్పుడు కూడా బొగ్గు కొరత గురించి వాస్తవాలను దాచిపెడుతోందని విమర్శించారు. దేశ ప్రజలకు నిజాలు చెప్పాలని మోడీ సర్కార్‌ను డిమాండ్ చేశారు. ప్రజలను తప్పుదోప పట్టిస్తూ మీరు ఎంతకాలం ప్రభుత్వాన్ని నడుపుతారని ప్రశ్నించారు.