Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూపీలోని టికునియాలో వేలాది మంది నివాళి
- దేశవ్యాప్తంగా కొవ్వొత్తుల ప్రదర్శనలు
- 15న బీజేపీ నేతల దిష్టిబొమ్మల దహనం
- 18న రైల్‌రోకోకు ఎస్కేఎం పిలుపు
న్యూఢిల్లీ: లఖింపూర్ ఖేరీ రైతు అమరవీరులకు దేశవ్యాప్తంగా జోహార్లు అర్పించారు. అక్టోబర్ 3న లఖింపూర్ ఖేరీలో కేంద్ర మంత్రి అజయ్ కుమార్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా రైతులపై మారణకాండకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ దారుణ ఘటనలో రైతులు నచ్చుట్టర్ సింగ్, లవ్‌ప్రీత్ సింగ్, గుర్వీందర్ సింగ్, దల్జీత్ సింగ్, జర్నలిస్టు రమణ్ కశ్యప్ అమరవీరులయ్యారు. ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ జిల్లా టికూనియాలో మంగళవారం జరిగిన సంస్మరణ సభలో ఆ ఐదుగురు అమర వీరులకు వేలాది మంది రైతులు నివాళులర్పించారు. యూపీ రైతులతోపాటు.. పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, ఇతర రాష్ట్రాల నుంచి వేలాదిమంది రైతులు సభలో పాల్గొన్నారు. యూపీ పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినప్పటికీ.. భారీ సంఖ్యలో రైతులు టికూ నియాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎస్కేఎం నేతలు మాట్లాడుతూ.. బీజేపీ-ఆర్ఎస్ఎస్ రైతు ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్నదనీ, ఎన్ని అడ్డంకులు సృష్టించినా రైతు చట్టాలను రద్దుచేసేవరకూ తమ ఉద్యమం ఆగబోదని స్పష్టం చేశారు. 'శక్తివంతమైన, శాంతియుత ప్రజాస్వామ్య ఉద్యమాన్ని అణిచివేసేందుకు బీజేపీ చేసిన హత్యా ప్రయత్నాలను దేశం మొత్తం ఇప్పుడు చూసింది. అయితే, ఉద్యమాన్ని అణచివేసేందుకు, పట్టాలు తప్పించేందుకు చేస్తున్న కుటిల యత్నాలను తిప్పికొడతాం. మేం మరింత బలోపేతమయ్యాం' అని ఎస్కేఎం నేతలు తెలిపారు. లఖింపూర్ ఖేరీ మారణహౌమంలో అమరవీరుల త్యాగాన్ని, రైతు ఉద్యమంలో ఇప్పటివరకు 631 మందికి పైగా రైతులు చేసిన త్యాగాన్ని వృథా కానివ్వబోమని స్పష్టంచేశారు. ఎస్కేఎం ఇప్పటికే ప్రకటించిన కార్యాచరణ ప్రణాళిక కొనసాగుతుందనీ, యూపీలోని అన్ని జిల్లాల్లో, అన్ని రాష్ట్రాల్లో అమరవీరుల అస్థిక యాత్రలు జరుగుతాయనీ, ఈ నెల 15న దసరా సందర్భంగా బీజేపీ నాయకుల దిష్టిబొమ్మలను దహనం చేస్తామని తెలిపారు. దేశవ్యాప్తంగా ఈ నెల 18న రైల్‌రోకో జరుగుతుందని తెలిపారు.
దేశవ్యాప్తంగా కొవ్వొత్తుల ప్రదర్శన
అమరవీరుల సంస్మరణ సభ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లో జరిగింది. రైతులు, వ్యవసాయ కార్మికులు, ఇతర ప్రజా సంఘాల నేతలు అమరవీరులకు నివాళులర్పించారు. అలాగే సాయంత్రం కొవ్వొత్తుల ప్రదర్శనలు జరిగింది. వివిధ పట్టణాల్లో ప్రధాన కూడళ్ల వద్ద ప్రదర్శనలు జరిగాయి. రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఏఐకేఎస్ ప్రధాన కార్యదర్శి హన్నన్ మొల్లా కొవ్వొత్తుల ప్రదర్శనలో పాల్గొన్నారు. ఐదుగురు అమరవీరులు జ్ఞాపకంగా ఇండ్ల వద్ద ఐదు కొవ్వొత్తులు వెలిగించారు. జమ్మూకాశ్మీర్ ఉగ్రదాడిలో మరణించిన సైనికులకు, పౌరులకు ఎస్కేఎం సంతాపం జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిలో దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఐదుగురు సైనికులకు ఎస్కేఎం నివాళి అర్పించింది. జస్వీందర్ సింగ్, సరాజ్ సింగ్, గజ్జన్ సింగ్, మన్ దీప్ సింగ్, హెచ్‌కె వైశాఖ్, గజ్జన్ సింగ్ వంటి సైనికులు ఉగ్రదాడుల్లో అమరవీరుల అయ్యారు. వారికి ఎస్కేఎం ప్రగాఢ సంతాపం తెలిపింది. అలాగే గత పది రోజుల్లో జమ్ముకాశ్మీర్‌లో ఉగ్రవాద దాడుల్లో మరణించిన అమాయక పౌరులకు కూడా నివాళి అర్పించింది.
బెనారస్ యూనివర్శిటీ విద్యార్థులపై కేసులు
లఖింపూర్ ఖేరీ మారణకాండకు వ్యతిరేకంగా ఆందోళన చేసిన బెనారస్ హిందూ యూనివర్సిటీ విద్యార్థులపై ఎఫ్ఐఆర్లను నమోదు చేశారు. విద్యార్థులపై కేసులు నమోదు చేయడాన్ని ఎస్కెేఎం ఖండించింది. ఢిల్లీలోని హౌం మంత్రి అమిత్ షా నివాసం ఎదుట లఖింపూర్ ఖేరీ మారణకాండకు వ్యతిరేకంగా ఆందోళన చేసిన మహిళా విద్యార్థులను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. అందులో ఇద్దరు విద్యార్థినుల పట్ల పోలీసులు లైంగిక వేధింపులకు పాల్పడటాన్ని ఎస్కేఎం తీవ్రంగా ఖండించింది. చాణక్యపురి ఏసీపీని సస్పెండ్ చేయాలనీ, దాడికి పాల్పడిన పోలీసు సిబ్బందిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసింది.