Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెట్రోల్ ధరలు పెరుగుతున్నరు ! : కేంద్ర మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: దేశంలో గత కొంత కాలంగా రికార్డు స్థాయిలో పెట్రోల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. పెట్రోల్‌తో పాటు డీజిల్ ధరలు సైతం లీటరుకు రూ.100కు పైగా పెరిగి వాహనదారుల నడ్డివిరుస్తున్నాయి. అయితే, ఇలా పెట్రోల్ ధరలు పెరగడానికి కారణం ఉచితంగా అందిస్తున్న కరోనా వ్యాక్సిన్లేనంటూ కేంద్ర పెట్రోలియం, సహజవనరుల శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తేలి చెప్పడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ''అసలు కోవిడ్ టీకాలకు మీరెవరూ డబ్బులివ్వట్లేదు కదా.. అందుకే పెట్రోల్?, డీజిల్? ధరల నుంచి డబ్బులు రాబడుతున్నాం. ఒక లీటరు పెట్రోల్ కంటే ఒక లీటరు హిమాలయ నీరు ఖరీదైనదంటూ'' మంత్రి తేలి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వివరా ల్లోకెళ్తే.. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. పెట్రోల్ అంత ఖరీదైనదేమీ కాదనీ, కేంద్ర, రాష్ట్రాలు పన్నులు విధించడం వల్ల ఖరీదైందని చెప్పారు. ప్రజలందరికీ కరోనా టీకా ఉచితంగా ఇస్తున్నా రనీ, ఇందుకు నిధులు ఎక్కడి నుంచి వస్తాయని ప్రశ్నించారు. ప్రభుత్వాలు విధించే పన్నులతోనే టీకాలు కొంటున్నామంటూ చెప్పుకొచ్చారు. 130 కోట్ల మందికి ఉచితంగా టీకాలివ్వాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందనీ, ఒక్కో టీకా సుమారు రూ.1,200 అవుతుందని గుర్తు చేశారు. లీటరు పెట్రోలు ఖరీదు సుమారు రూ.40 ఉండొచ్చనీ, దీనిపై వ్యాట్ తదితర పన్నులు వేస్తారని వివరించారు. ఒక లీటర్ హిమాలయన్ బాటిల్ ఖరీదు రూ.100 ఉంటోందని గుర్తు చేశారు. అంతేకాకుండా క్రూడాయిల్ ధరలు అంతర్జాతీయ మార్కెట్‌ను బట్టి మారుతుంటాయని తెలిపారు. చమురు ధరలను తమ శాఖ నిర్ణయించదనీ, అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా దేశీయ ధరలు మారేలా గతంలో వాణిజ్య శాఖ నిర్ణయం తీసుకుందని చెప్పారు. రాష్ట్రాలు వ్యాట్ తగ్గించాలనీ, కానీ విపక్షపాలిత రాష్ట్రాలు పన్ను తగ్గించకుండా తమపై నిందమోపాలని చూస్తున్నాయంటూ చెప్పుకొచ్చారు. ఇటీవలే తమ శాఖ నిధులను ఆరోగ్య శాఖకు కోవిడ్ కోసం మరలించామన్నారు.
ఇక అసోం బీజేపీ అధ్యక్షుడు భాబేశ్ కలిత మాట్లాడుతూ.. ముగ్గురు కలిసి మోటార్‌సైకిల్‌లో ప్రయాణించాలనీ, అలాగే ప్రజలు నడక సాధన చేయాలని సూచించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో ఉల్లి ధరలు పెరిగినప్పుడు కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ తాను ఉల్లిపాయలు తినని పేర్కొనడం, ఆవు పేడ శరీరానికి రుద్దుకోవడం, గో మూత్రం తాగడం వల్ల కరోనా రాదంటూ బీజేపీ నేతలు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కేంద్రమంత్రి తేలి ఉచిత టీకాలు-పెట్రోల్ ధరలకు ముడిపెట్టి మాట్లాడటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.