Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మౌలిక సదుపాయాల అభివృద్ధే లక్ష్యం
న్యూఢిల్లీ : రోడ్లు, రైల్వేలు, పౌర విమానయానం నుంటి వ్యవసాయం వరకు వివిధ ప్రాజెక్టులు, వివిధ విభాగాలు సమన్వ యంతో పనిచేసేందుకు గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ను ప్రారంభించినట్టు ప్రధాని మోడీ చెప్పారు. బహుముఖ అనుసంధానం కోసం వంద లక్షల కోట్ల రూపాయలతో జాతీయ మాస్టర్ ప్రణాళిక ''గతిశక్తి''ని ప్రధాని బుధవారం ప్రారంభించారు. రవాణా వ్యయాలను తగ్గించేందుకు, ఆర్థిక వ్యవస్థకు ప్రోత్సాహమిచ్చేందుకు మౌలిక సదుపాయాలను అభివృద్ధిపరచడం ఈ ప్రణాళిక లక్ష్యంగా వుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మోడీ మాట్లాడుతూ, సరుకు రవాణా నిర్వహణా సామర్ధ్యాన్ని పెంచడం, రవాణాకు పట్టే సమయాన్ని తగ్గించడం లక్ష్యంగా నిర్ణయించామని తెలిపారు. ఒకే వేదికపైకి అన్ని విభాగాలను అనుసంధానించడం ద్వారా మరింత శక్తి సామర్ధ్యాలను సమకూర్చుకోవడం, వేగంగా ప్రాజెక్టులను పరిపూర్తి చేయడం ఈ ప్రణాళిక లక్ష్యంగా వుందని అన్నారు. వివిధ మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాల మౌలిక సదుపాయాల పథకాలను రూపొందించి, ఉమ్మడి దార్శనికతతో అమలు చేయాల్సి వుంటుందన్నారు. అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఉదాసీన వైఖరి అవలంబించడం ద్వారా పన్ను చెల్లింపుదారుల సొమ్మును గతంలో అవమానరిచారని మోడీ వ్యాఖ్యానించారు. ఏ విభాగాలకు ఆ విభాగాలు విడివిడిగా పనిచేసేవనీ, ప్రాజెక్టుల్లో సమన్వయం వుండేది కాదని అన్నారు. నాణ్యత కలిగిన మౌలిక సదుపాయాలు లేకపోతే అభివృద్ధి సాధ్యం కాదని అన్నారు. అభివృద్ధిని పరిపూర్ణ పద్ధతిలో అమలు చేయాలని ఈ ప్రభుత్వం సంకల్పించిందని అన్నారు. గత 70 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా తమ ప్రభుత్వం శీఘ్రగతిన పనిచేస్తోందని అన్నారు. ఇందుకు ఉదాహరణ చెబుతూ, 1987లో మొదటి అంతర్రాష్ట్ర సహజవాయు పైప్లైన్ ప్రారంభమైందన్నారు. అప్పటి నుండి 2014 వరకు 15వేల కిలోమీటర్ల పైప్లైన్ నిర్మించారని చెప్పారు. ప్రస్తుతం 16వేల కిలోమీటర్లకు పైగా పైప్లైన్ నిర్మించబడుతోందన్నారు. గత ఏడేండ్లలో 9వేల కిలోమీటర్ల లైను డబ్లింగ్ జరిగిందన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు, స్థానిక తయారీదారులు అంతర్జాతీయంగా పోటీ పడేలా సాయపడేందుకు, సంపూర్ణ మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం వంద లక్షల కోట్ల రూపాయలతో ''గతిశక్తి''ని చేపడుతున్నట్టు ప్రధాని మోడీ ఆగస్టు 15న ప్రకటించారు.