Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గవర్నర్, ముఖ్యమంత్రి శుభాకాంక్షలు
అమరావతి: ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో మధ్యాహ్నం ఒంటి గంటకు జస్టిస్ మిశ్రాతో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణస్వీకారం చేయించారు. వేదికపై వారిద్దరితోపాటు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశీనులయ్యారు. జస్టిస్ మిశ్రా ఇంగ్లీషులో దైవసాక్షిగా ప్రమాణం చేశారు. రాగద్వేషాలకు అతీతంగా, రాజ్యాంగానికి లోబడి, చట్టబద్ధంగా విధులు నిర్వహిస్తాననీ, దేశ సమగ్రత, సమైక్యతలను కాపాడుతానని ప్రమాణం చేశారు. అనంతరం గవర్నర్, సీఎంలు జస్టిస్ పికె శర్మకు పుష్పగుచ్ఛాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. శాలువాలు కప్పి సత్కరించారు. కార్యక్రమాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు న్యాయమూర్తులు, మంత్రులు బొత్స సత్యనారాయణ, వెలంపల్లి శ్రీనివాస్, పలువురు ఉన్నతాధికారులు, సీజే కుటుంబసభ్యులు పాల్గొన్నారు.
ఛత్తీస్‌గఢ్ న్యాయమూర్తిగా చేస్తున్న జస్టిస్ మిశ్రా పదోన్నతిపై ఎపి హైకోర్టుకు వచ్చారు. జస్టిస్ మిశ్రా 1964 ఆగస్టు 29వ తేదీన ఛత్తీస్‌గఢ్‌లోని రారుగడ్లో జన్మించారు. బిలాస్‌పూర్‌లోని గురు ఘాసిదాస్ వర్సిటీలో బీఎస్సీ, ఎల్ఎల్బి చేశారు. 1987, సెప్టెంబర్ 4న న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యాక రారుగఢ్‌లోని జిల్లా కోర్టు, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ హైకోర్టుల్లో కేసులు వాదించారు. ఛత్తీస్‌గఢ్ బార్ కౌన్సిల్ చైర్మన్‌గా చేశారు. ఆ రాష్ట్ర అదనపు ఏజీగా, అడ్వొకేట్ జనరల్‌గా సేవలందించారు. 2009, డిసెంబర్ 10న ఛత్తీస్‌గఢ్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.