Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమరవీరుల అస్తికలతో యాత్రలు
- కేరళలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల వద్ద పికెటింగ్
- అటవీ పరిరక్షణ చట్ట సవరణలు ఉపసంహరించుకోండి : ఎస్కేఎం
న్యూఢిల్లీ : హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌కు మరోసారి రైతు సెగ తగిలింది. పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేసినప్పటికీ బుధవారం సోనిపట్‌లో జరపాల్సిన పర్యటనను ఆయన రద్దు చేసుకున్నారు. ఆయన రాక సందర్భంగా నిరసనలు తెలుపుతామని రైతులు ప్రకటించడంతో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. సిటీ అంతటా పోలీసు బారికేడ్లు, చెక్ పోస్ట్‌లు ఏర్పాటు చేశారు. సీఎం రాక కోసం దేవిలాల్ స్టేడియం వద్ద తాత్కాలిక హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. స్టేడియానికి వెలుపల రైతులు నల్ల జెండాలతో ఆందోళనలకు దిగారు. పోలీసులు వారిని శాంతింపజేసేందుకు ప్రయత్నాలు చేశారు. గత ఆగస్టులో హర్యానాలోని కర్నల్ ప్రాంతంలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఒక రైతు మరణించాడు. రైతు ప్రదర్శకులపై పోలీసులను ఉసిగొలుపుతూ 'లాఠీలతో తలలు పగలగొట్టండి...' వివాదాస్పద ఆదేశాలిచ్చిన సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ ఆయుష్ సిన్హా కెమెరాకు చిక్కారు. దీనిపై దర్యాపు అనంతరం సిన్హాను నెలరోజుల సెలవుపై పంపారు. అనంతరం లఖింపూర్ ఖేర్‌లో కేంద్ర మంత్రి వాహనాలు రైతులను తొక్కించేసిన ఘటనలో నలుగురు రైతులు, ఒక జర్నలిస్టు ప్రాణాలు కోల్పోయారు.
అమరవీరుల అస్తికలతో యాత్రలు ప్రారంభం
టికునియా నుంచి అమరవీరుల అస్తికలతో దేశంలోని వివిధ ప్రాంతాలకు, ఉత్తరప్రదేశ్‌లోని వివిధ జిల్లాలకు యాత్రలు ప్రారంభమయ్యాయి. లఖింపూర్ ఖేరీ రైతుల హత్యలో కీలక పాత్ర పోషించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజరు మిశ్రా టెనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కేరళలో రైతులు రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల వద్ద పికెటింగ్ చేపట్టారు. తమిళనాడుకు చెందిన సీఐటీయూ అనుబంధ రవాణా కార్మికులు సుమారు 500 మంది రైతు ఉద్యమంలో పాల్గొనడానికి సింఘు సరిహద్దుకు చేరుకున్నారు. అటవీ హక్కుల చట్టాన్ని (2006) నిర్వీర్యం చేసేందుకు అటవీ పరిరక్షణ చట్టం-1980 చట్టానికి కేంద్ర ప్రభుత్వం సవరణలు తీసుకురావడాన్ని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కే ఎం) ఖండించింది. ఇది అడవిని, సహజ వనరులను కార్పొరేట్లకు అప్పగించ డానికి మార్గాన్ని సృష్టించడమేనని పేర్కొంది. రాజ్యాంగ విరుద్ధమైన మోడీ సర్కార్ ప్రతిపాదిత సవరణలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది.