Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతుల ఆందోళనలకు మద్దతు తెలిపినందుకు..
- యోగి సర్కార్ ఉక్కుపాదం.. వేడెక్కిన వారణాసి
వారణాసి : మోడీ ప్రాతినిథ్యం వహించే పార్లమెంట్ నియోజకవర్గంలోనూ రైతు నిరసనసెగ తాకింది.లఖింపూర్ ఘటనకు రైతు సంఘాలిచ్చిన పిలుపుమేరకు వారణాసిలో ఆందోళనలు జరగకుండా యోగి సర్కార్ నియంత్రించింది. ఆంక్షలు పెట్టింది. రైతు నాయకులను అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టింది. అయినా అన్నదాతలు, విద్యార్థులు వెనక్కితగ్గలేదు.తొలుత వర్సిటీ గేటు వద్ద రైతులు పెద్ద సంఖ్యలో గుమిగూడారు, కొవ్వొత్తులు వెలిగించి అమరులైన అన్నదాతల్ని గుర్తు చేసుకున్నారు. రైతులపై తప్పుడు కేసులు బనాయిస్తూ వేధింపులకు గురిచేస్తున్న యోగిసర్కార్పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. రైతులకు సంఘీభావం తెలుపుతూ బనారస్ హిందూ యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు భారీ సంఖ్యలో లంకా గేట్ వద్దకు చేరుకున్నారు. రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న మోడీ సర్కార్‌కు వ్యతిరేకంగా విద్యార్థులు నినాదాలు చేస్తూ..ఆందోళనకు దిగారు. భారీ దిగ్బంధనం ఉన్నా..విద్యార్థులు శాంతియుత నిరసన ప్రదర్శన నిర్వహించారు. క్యాండిల్ మార్చ్‌లో విద్యార్థులు పాల్గొన్నారు.రెండు నిమిషాల సేపు మౌనం పాటించారు. కేంద్రహౌం శాఖ సహాయమంత్రి అజరు మిశ్రా టెనిని తొలగించాలని డిమాండ్ చేశారు. పోలీసులు భారీగా మొహరించినా...రైతులు, విద్యార్థులు కలిసి ఆందోళనకు దిగారు. ''మోడీ ప్రభుత్వం నల్ల వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకునే వరకు ఆందోళనను కొనసాగిస్తాం. రైతులు , యువత ముందు బీజేపీ ప్రభుత్వాలు తలవంచక తప్పదని హెచ్చరిక చేశారు. మరోవైపు ఉద్యమాల్లో పాల్గొన్న విద్యార్థులను వదిలిపెట్టవద్దని యోగి సర్కార్ హుకుం జారీచేసింది. ఇప్పటికే రైతులపై కేసులు నమోదు చేస్తున్న, యూపీలోని బీజేపీ ప్రభుత్వం తాజాగా..బనారస్ విద్యార్థులపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయించింది.ఆందోళనకు దిగిన విద్యార్థులను పట్టుకోవటానికి పోలీసులు పలుప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీలో రైతులను తొక్కిపెట్టిన అమానవీయ సంఘటనపై నిరసన తెలిపిన విద్యార్థులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంపై ఉద్యమ మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.