Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టాటా, అదానీల లాభార్జనే మోడీ సర్కార్‌కు కీలకం
న్యూఢిల్లీ : దేశంలో కృత్రిమంగా బొగ్గు కొరతను, విద్యుత్ రంగ సంక్షోభాన్ని సృష్టించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాస్తవానికి ఈ త్రైమాసికం (ఏప్రిల్-సెప్టెంబరు)లో రికార్డు స్థాయిలో బొగ్గు ఉత్పత్తి జరిగింది. కోల్ ఇండియా రికార్డు స్థాయిలో ఉత్పత్తి పెంచింది. కొన్ని స్వార్ధపర శక్తులు బీజేపీ ప్రభుత్వంతో పూర్తిగా కుమ్మక్కై విద్యుత్ సంక్షోభాన్ని సృష్టించాయి. కనీసం 20రోజుల పాటు నిల్వలు వుండేలా చూసుకోవాలని మార్గదర్శకాలు ఉన్నాయి. అయినా కేంద్రం పట్టించుకోలేదు. విద్యుత్ సంస్థలకు అవసరమైన బొగ్గు పరిమాణం కన్నా తక్కువ మొత్తాన్ని ఎందుకు విధించాల్సి వచ్చింది? ఇది కచ్చితంగా విధానపరమైన, పర్యవేక్షణా స్థాయిలో జరిగిన వైఫల్యమే. దీనికి కేంద్ర ప్రభుత్వాన్నే జవాబుదారీగా చేయాల్సి వుంటుంది. బొగ్గుకు తగ్గిన డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని, బొగ్గు ఉత్పత్తి స్థాయిని తగ్గించేందుకు సిఐఎల్ అనుబంధ సంస్థలపై ఒత్తిడి వచ్చిందని కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్) చైర్మన్ ప్రమోద్ అగర్వాల్ చెప్పారు. ఈ మేరకు ఆయన స్టేట్మెంట్ను కూడా నమోదు చేశారు. పెద్ద మొత్తంలో బొగ్గు నిల్వలు కొద్ది కాలం పాటు పేరుకుపోయినట్లైతే, కాలక్రమంలో అవి బూడిదగా మారిపోతాయి, నిరుపయోగమవుతాయని ఆయన పేర్కొన్నారు. దీన్నిబట్టే కృత్రిమ సంక్షోభాన్ని ఎలా సృష్టించారో అర్ధమవుతోంది. సీిఐఎల్, ఎస్సీసీఎల్, ఇతర ప్రయివేటు గనులు 18.4 లక్షల టన్నుల చొప్పున విద్యుత్ ప్లాంట్ల రోజువారీ మొత్తం బొగ్గు అవసరాలను తీరుస్తున్నాయి. ప్రస్తుతం, ప్లాంట్ స్థాయిలో చూసినట్లైతే బొగ్గు నిల్వలు మూడు నుంచి ఐదు రోజులకు సరిపడా వున్నాయి. గుజరాత్ తీర ప్రాంతాల్లోని అదానీ, టాటా విద్యుత్ స్టేషన్లు, మరికొన్ని ఇతర ప్లాంట్లు దిగుమతి చేసుకున్న బొగ్గుపై ఆధారపడేవే. గతంలో కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాల ప్రకారం రేట్లను పెంచాలంటూ టాటా, అదానీలు డిమాండ్ చేశారు. అంతర్జాతీయంగా బొగ్గు ధర పెరిగిన నేపథ్యంలో తమకు నష్టాలు వస్తున్నాయని పేర్కొంటూ సెప్టెంబరు మూడవ వారం నుండి పూర్తిగా ఉత్పత్తిని నిలిపివేశారు. జాతీయ టారిఫ్ విధానం కింద విద్యుత్ యూనిట్ ధరను రూ.9 నుంచి రూ.21కి పెంచేందుకు భారత ప్రభుత్వం ఈ ప్రైవేటు సంస్థలను ఇప్పటికే అనుమతించినట్లు తెలుస్తోంది. ఈ విద్యుత్ సంక్షోభాన్ని సాకుగా చూపి ఈ ధరలు మరింత పెరిగే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇదంతా చూస్తుంటే, ప్రస్తుతమున్న బొగ్గు సంక్షోభం కార్పొరేట్లు కృత్రిమంగా సృష్టించిన సంక్షోభం తప్ప మరొకటి కాదని స్పష్టమవుతోంది. కార్పొరేట్లు తమ దీర్ఘ, స్వల్ప కాల లాభాల కోసమే ఈ కొరతను సృష్టించినట్లు అర్ధమవుతోంది. దీన్ని వ్యతిరేకిస్తూ ప్రజలు తక్షణమే పోరాటాలు చేపట్టని పక్షంలో, ఈ కార్పొరేట్లకు అనుగుణంగా వుండేందుకు విద్యుత్ రంగ ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయించే క్రమాన్ని వేగిరపరిచే పరిస్థితి కూడా ఉత్పన్నమవచ్చు. బొగ్గు ఉత్పత్తిలో కొరతకు నిందిస్తూ సీఐఎల్‌ను విక్రయించడానికి కుట్ర పన్నొచ్చు.
రికార్డు స్థాయి ఉత్పత్తి జరిగినా కొరత ఎందుకు ? : సీఐటీయూ
ప్రస్తుత త్రైమాసికంలో రికార్డు స్థాయిలో బొగ్గు ఉత్పత్తి జరిగినా బొగ్గు కొరత ఎందుకు ఏర్పడిందని సీఐటీయూ ప్రశ్నించింది. దీనిపై వెంటనే వాస్తవాలను వెల్లడించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. కార్పొరేట్ల చేతుల్లో బందీ అయి వారి చెప్పినట్లల్లా ఆడడాన్ని ఆపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. కార్పొరేట్లు, ప్రభుత్వం మధ్య గల సంబంధాలను బట్టబయలు చేయాలంటూ కార్మిక లోకానికి, అనుబంధ సంఘాలకు సీఐటీయూ పిలుపునిచ్చింది. జాతీయ మానిటైజేషన్ ప్రణాళిక మాదిరిగా ఇటువంటి నీచపు ప్రయివేటీకరణ ఎత్తుగడలకు వ్యతిరేకంగా పోరాటాలను ఉధృతం చేయడానికి సిద్ధంగా వుండాలని సీఐటీయూ ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్ ఒక ప్రకటనలో కోరారు.