Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైకోర్టులో ఆయనపై ఇప్పటికే పెండింగ్‌లో హత్య కేసు
- లఖింపూర్ ఘటనపై స్వతంత్ర న్యాయ విచారణకు ఆదేశించాలి : రాష్ట్రప్రతి రామ్‌నాథ్ కోవింద్‌కు కాంగ్రెస్ బృందం వినతి
న్యూఢిల్లీ : కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రాను వెంటనే తొలగించాలనీ, లఖింపూర్ ఖేరీ ఘటనపై ఇద్దరు సుప్రీంకోర్టు, లేదా హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తులతో స్వతంత్ర న్యాయవిచారణ జరపాలని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కాంగ్రెస్ బృందం కోరింది. ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, మాజీ కేంద్ర మంత్రులు ఎకె ఆంటోనీ, గులాం నబీ ఆజాద్‌లతో కూడిన బృందం బుధవారం కలిసింది. ఈ సందర్భంగా లఖింపూర్ ఘటనపై మూడు పేజీల వినతిపత్రం అందజేసింది. అనంతరం రాష్ట్రపతి భవన్ వెలుపల రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. లఖింపూర్ హింసాత్మక ఘటనకు సంబంధించిన అన్ని వివరాలను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు అందజేసినట్టు తెలిపారు. ఈ ఘటనలో నిందితుడి తండ్రి హౌం శాఖ సహాయ మంత్రి అయినందున ఆయన పదవిలో ఉంటే, నిష్పాక్షిక దర్యాప్తు సాధ్యం కాదనీ, అందువల్ల ఆయనను పదవి నుంచి తొలగించాలని రాష్ట్రపతికి విజ్ఞప్తిచేసినట్టు తెలిపారు. సుప్రీంకోర్టుకు చెందిన ఇద్దరు సిట్టింగ్ న్యాయమూర్తులతో విచారణ జరిపించాలనే మరో డిమాండ్‌ను కూడా రాష్ట్రపతి ముందు ఉంచినట్టు చెప్పారు. కేంద్ర మంత్రి అజరు మిశ్రాను పదవి నుంచి తప్పించినప్పుడు మాత్రమే లఖింపూర్ హింసాత్మక ఘటనలో న్యాయం జరుగుతుందని రాహుల్ పేర్కొన్నారు. లఖింపూర్ ఘటనపై ప్రభుత్వంతో మాట్లాడతానని ఈ సందర్భంగా రాష్ట్రపతి హామీ ఇచ్చినట్టు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా తెలిపారు.
'మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా లక్ష లాది మంది రైతులు ఏడాదిగా దేశ రాజధాని ఢిల్లీకు దగ్గరగా ఆందోళన చేస్తున్నారు. తీవ్రమైన వర్షం, విపరీతమైన వేడి, చలి వంటి తీవ్రమైన వాతావరణ మార్పులు ఉన్నప్పటికీ రైతులు ధైర్యంగా పోరాడుతు న్నారు. వారి సంకల్పం ఎక్కడా తగ్గలేదు. దాదాపు వెయ్యి మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. అయనప్పటికీ వారు గాంధీ మార్గంలో న్యాయం కోసం దృఢ సంకల్పంతో ఆందోళన చేస్తున్నారు. వారితో అర్థవంతమైన చర్చలకు మోడీ ప్రభుత్వం నిరాకరించింది. అన్నదాతలు అలసిపోయేలా చేయడం వారి విధానం' అని వినతిపత్రంలో పేర్కొన్నారు. 'మిశ్రా పాత్ర ఇంకా విచారణ జరగాల్సి ఉంది. అతను పదవిలో కొనసాగుతుంటే ఇది అసంభవం. పోలీసు అధికారిపై ప్రభావం చూసే అవకాశం ఉంది. అధికారులు న్యాయంగా విచారణ జరిపేందుకు ధైర్యం చేస్తారా? ఈ క్లిష్ట పరిస్థితుల్లో రాజ్యాంగ సంరక్షకుడిగా ఈ ఘటనపై జోక్యం చేసుకోవాలి. అందుకోసం కేంద్ర మంత్రిని తన పదవి నుంచి తొలగించాలి. సుప్రీంకోర్టు లేదా, హైకోర్టుకు చెందిన ఇద్దరు న్యాయమూర్తులతో స్వతంత్ర విచారణ జరపాలి. ఈ విషయాన్ని పరిగణించి తగిన చర్యలు తీసుకుంటారని మేం ఆశిస్తున్నాం' అని వినతి పత్రంలో పేర్కొన్నారు.