Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కంటైనర్ కార్పొరేషన్‌తో కార్గో ఒప్పందం
విశాఖ : వాల్తేరు రైల్వే డివిజన్ కార్గో హేండ్లింగ్ (సరకు రవాణా)లో మరో మైలురాయిని దాటింది. వాల్తేరు రైల్వేలో కార్గో అభివృద్ధి కోసం ఏర్పాటైన బిజినెస్ డెవలప్మెంట్ యూనిట్ (బిడియు) వింగ్, కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (కాంకర్)తో కలిసి మార్కెటింగ్ విస్తరణ కోసం చేసుకున్న ఒప్పందాలు ఒక్కొక్కటిగా ఆచరణలోకి వస్తున్నాయి. దీనికి సంబంధించిన తొలి కార్గో కంటైనర్ గురువారం విశాఖ నుంచి ప్రారంభమైంది. శ్రీకాకుళం జిల్లా కాకరాపల్లిలో థర్మల్ పవర్ ప్లాంట్ స్థాపన కోసం తీసుకొచ్చిన మెటీరియల్ ముఖ్యంగా హెవీ మెల్టింగ్ స్టీల్ (హెచ్ఎంఎస్) స్క్రాప్ అంతటినీ అక్కడ నుంచీ వాల్తేరు రైల్వే ద్వారా కార్గో చేసేందుకు కాంకర్తో ఒప్పందం చేసుకున్నాయి. మధ్యప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలకు ఈ స్క్రాప్ మొత్తం కంటైనర్లలోనే వెళ్లాల్సి ఉంది. దీనిలో భాగంగా గురువారం తొలి రేక్ (గూడ్స్ బోగీలు)ను వాల్తేరు డిఆర్ఎం అనూప్ సేతుపతి పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఒక రేక్ తరలించినందుకు గానూ వాల్తేరు రైల్వేకు రూ.38,77,644 ఆదాయం సమకూరనుంది. ఒక నెలలో ఈ హెవీ మెల్ట్ స్టీల్ రెండు రేక్‌లు మాత్రమే ఇలా వెళ్లాల్సి ఉంది. మొత్తంగా పది రేకుల్లో స్క్రాప్‌ను తరలించనున్నారు. శ్రీకాకుళం జిల్లా దండుగోపాలపురం నుంచి దప్పర్, అహ్మద్గర్, పంజాబ్, ఇండోర్ (మధ్యప్రదేశ్), గుజరాత్‌లోని కరంబెల్లి తదితర ప్రాంతాలకు దీన్ని తరలించనున్నారు. భద్రత, వేగం కోసం రైల్ కార్గోను కాంకర్ (మల్టీ మోడల్ లాజిస్టిక్ హబ్) ఎంచుకున్నట్లు ఈ సందర్భంగా వాల్తేరు రైల్వే ఉన్నతాధికారులు వెల్లడించారు. మొత్తంగా రెండు వేల కిలో మీటర్ల మేర ఈ ప్రయాణం ఉంటుందని పేర్కొన్నారు. రైల్ కార్గో సిబ్బందిని డిఆర్ఎం సేత్పతి ఈ సందర్భంగా అభినందించారు.