Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోర్టుకు 32 మంది సాక్షుల జాబితాను సమర్పించిన సిబిఐ
న్యూఢిల్లీ : ప్రముఖ హేతువాది దభోల్కర్ హత్య కేసుతో సంబంధమున్న 32 మంది సాక్షుల జాబితాను కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ).. ప్రత్యేకకోర్టుకు సమర్పించింది. '' అడిషనల్స్ సెషన్స్ జడ్జి (ప్రత్యేక కోర్టు జడ్జి) ఎస్.ఆర్. నవందర్ ముందు 32 మంది సాక్షుల జాబితాను సమర్పించాం. దీనిపై తదుపరి విచారణ ఈనెల 29న జరగనున్నది'' అని ఈ కేసులో సిబిఐ తరఫు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రకాశ్ సూర్యవంశీ తెలిపారు. మహారాష్ట్రలోని పూణేలో 2013, ఆగష్టు 20న హిందూత్వ గ్రూపునకు చెందిన వ్యక్తులు దభోల్కర్‌ను కాల్చి చంపిన విషయం విదితమే. ఈ కేసు దర్యాప్తును తొలుత పూణే పోలీసులు జరిపినప్పటికీ ఆ తర్వాత సిబిఐ రంగ ప్రవేశం చేసి దానిని కొనసాగిస్తున్నది. వీరేంద్ర సింగ్ తవ్డే, సచిన్ అందురే, శరద్ కలాస్కర్, సంజీవ్ పునలేకర్, విక్రమ్ భవే ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. న్యాయస్థానం వీరిపై ఇప్పటికే హత్య, నేరపూరిత కుట్ర, యుఎపిఎతో పాటు పలు సెక్షన్ల కింద కేసులను మోపింది.