Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రయోజనం పొందే వ్యక్తి (ఇంటరెస్టెడ్ పర్సన్)కు ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసే అర్హత లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. కర్నాటక హైకోర్టు జారీ చేసిన ఆదేశాలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను తోసిపుచ్చింది. రాష్ట్ర సమాచార కమిషనర్లకు పెన్షన్ ఇవ్వడానికి సంబంధించిన అంశంపై పిటిషన్‌ను కర్నాటక హైకోర్టు తిరస్కరించింది. ప్రభుత్వం జారీ చేసిన 2013 జనవరి నాటి ఆఫీస్ మెమోరాండాన్ని సవాలు చేస్తూ, పిటిషనర్ హైకోర్టును ఆశ్రయించారని సుప్రీం కోర్టు పేర్కొంది. చీఫ్ సెక్రటరీకి చెల్లించే పెన్షన్‌కు సమానంగా రాష్ట్ర సమాచార కమిషనర్లకు కూడా పెన్షన్ మంజూరు చేయాలనే నిబంధన ఆ మెమోరాండంలో వుంది. ఇక్కడ పిటిషనర్ కూడా ఆ పోస్టుకు పోటీ పడ్డారు. రాష్ట్ర సమాచార కమిషనర్ పదవికి అభ్యర్థి కూడా అయినందున పిటిషనర్ ఈ రిట్ పిటిషన్ దాఖలు చేయడానికి అర్హుడు కాడని జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ జెకె మహేశ్వరిలతో కూడిన బెంచ్ పేర్కొంది. అందువల్లే స్పెషల్ లీవ్పిటిషన్ను తోసిపుచ్చినట్లు బెంచ్ తెలిపింది.