Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి బ్రజేష్ పాఠక్ సందర్శన
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులపైకి కేంద్ర మంత్రి ఆజరు మిశ్రాకు చెందిన వాహనం దూసుకుపోవడంతో 8 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. చనిపోయిన వారిలో నలుగురు రైతులు, ఓ జర్నలిస్టు, ఇద్దరు బీజేపీ కార్యకర్తలు కూడా ఉన్నారు. అయితే, లఖింపూర్ ఖేరి హింసలో చనిపోయిన బీజేపీ కార్యకర్త శుభమ్ మిశ్రా, కేంద్ర మంత్రి అజరు మిశ్రా కాన్వారులో కారు డ్రైవర్ హరిఓం మిశ్రా కుటుంబాలను రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి బ్రజేష్ పాఠక్ కలిశారు. ఆయన బాధిత కుటుంబాలను పరామర్శించి.. వారిని ఓదార్చడంతో పాటు ఈ కేసులో న్యాయమైన విచారణ జరుతున్నదని హామీ ఇచ్చారు. భద్రతా విషయంలో వారిలో భయాందోళనలు ఉన్నాయనీ, వారికి రక్షణ కల్పించడంతో పాటు ఆయా కుటుంబాలు వెలిబుచ్చిన డిమాండ్లను నెరవేర్చడానికి తాను హామీ ఇచ్చానని పాఠక్ తెలిపారు. ఇదిలావుండగా, లఖింపూర్ ఖేరీ ఘటనలో పై తెలిపిన ఇద్దరితో పాటు రైతులు గుర్వీందర్ సింగ్, లవ్‌ప్రీత్ సింగ్, దల్జిత్‌సింగ్, నక్షత్ర సింగ్, జర్నలిస్టు రామన్ కశ్యప్, మరొక బీజేపీ కార్యకర్త శ్యామ్ సుందర్ నిషాద్‌లు కూడా ప్రాణాలు కోల్పోయారు. అయితే, రాష్ట్ర మంత్రి పాఠక్ మాత్రం బాధిత రైతు కుటుంబాలను, జర్నలిస్టు కుటుంబాన్ని మాత్రం కలవలేదు. దీనిపై స్పందించిన బాధిత కుటుంబాలు రైతులంటే వారికి ప్రేమ లేదనీ, అందుకే తమను కలవలేదని పేర్కొన్నారు. చనిపోయిన రైతు గుర్వీందర్ సింగ్ సోదరుడు గురుసేవక్ మాట్లాడుతూ.. లఖిపూర్ఖేరీ ఘటన బాధిత కుటుంబాలను సందర్శించి వారి బాధను పంచుకోవాలి కానీ రాజకీయాలు కోసం కాదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పాఠక్ తమను కలవాలనుకుంటే పార్టీ జెండాను పక్కన బెట్టి రావాలని పేర్కొన్నారు. ఇంత ఆలస్యంగా బాధిత కుటుంబాలను కలవడం.. అందులోనూ రైతు కుటుంబాలను కలవకపోవడంపై ప్రతిపక్షాల బీజేపీ సర్కారు తీరుపై విమర్శలు గుప్పిస్తున్నాయి. ఘటన జరిగిన 10 రోజుల తర్వాత ఇలాంటి సందర్శనలు చేయడం.. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలనే ఉద్దేశం యూపీలోని బీజేపీ ప్రభుత్వానికి లేదనే సంకేతాలిస్తున్నాయంటూ కాంగ్రెస్ నేత అజరు కుమార్ లల్లూ ఆరోపించారు. కాగా, లఖింపూర్ ఖేరి ఘటనలో కేంద్ర మంత్రి అజరు కుమార్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై న్యాయమైన విచారణకు జరగాలంటే మంత్రి తన పదవికి రాజీనామా చేయాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అధికార పార్టీ బీజేపీ నిందితులకు రక్షణ కల్పిస్తోందనీ, విచారణ సక్రమంగా జరగకుండా చూస్తోందంటూ ఆరోపిస్తున్నాయి.