Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యుత్ కోతలతో రైతులపై అదనపు భారం
రాజమహేంద్రవరం :తూర్పుగోదావరి జిల్లాలో ప్రధాన రంగాల్లో ఒకటైన ఆక్వా చెరువులకు విద్యుత్ కోతలు విధిస్తున్నారు. దీంతో, చేపల, రొయ్యల పిల్లలను రక్షించుకోవడానికి రైతులపై అదనపు భారం పడుతోంది. బొగ్గు కొరతను నివారించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం కావడంతో రాష్ట్రంలో థర్మల్ విద్యుదుత్పత్తి తగ్గిపోయింది. దీంతో, రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్లకు అప్రకటిత విద్యుత్ కోత విధిస్తున్న సంగతి తెలిసిందే. తూర్పుగోదావరి జిల్లాలో ఆక్వాకు కూడా విద్యుత్ కోత అమలులోకి వచ్చింది. జిల్లాలో 65 వేల ఎకరాలకుపైగా భూముల్లో ఆక్వా సాగు జరుగు తోంది. చేపలు, రొయ్య పిల్లలకు ఆక్సిజన్ అందించేం దుకు చెరువుల్లో ఏరియేటర్లు తప్పనిసరి. ఒక్కో ఎకరాకు మూడు నుంచి నాలుగు చొప్పున ఏరియేటర్ల ను వినియోగించాలి. ఇవి రన్ కావడానికి నిరంతర విద్యుత్ అవసరం. ఈ నెల తొమ్మిదో తేదీ వరకూ జిల్లాలో ఆక్వా చెరువులకు 24 గంటలపాటు నిరంతర విద్యుత్ సరఫరా జరిగేది. పదో తేదీ నుంచి 12వ తేదీ వరకూ రోజుకు రెండు నుంచి మూడు గంటల చొప్పున అప్రకటిత విద్యుత్ కోత విధించారు. బుధవారం నుంచి అధికారికంగా రోజుకు నాలుగు గంటల పాటు విద్యుత్ కోతలు విధిస్తున్నట్టు అధికారులు ప్రకటిం చారు. దీనికి అదనంగా మరో రెండు నుంచి మూడు గంటల పాటు అప్రకటిత కోతలు ఉంటున్నాయని ఆక్వా రైతులు తెలిపారు. ప్రస్తుతం కోతల నేపథ్యంలో ఏరియేటర్లను రన్ చేయడానికి జనరేటర్లను రైతులు అద్దెకు తెచ్చుకుంటున్నారు. ఇందుకు రోజుకు రూ.650 నుంచి రూ.700 వరకూ, నెలకైతే రూ.20 వేల వరకూ అద్దె చెల్లిస్తున్నారు. ఐదెకరాల పరిధిలో చెరువుకు జనరేటర్‌ను రన్ చేయాలంటే గంటకు ఐదు లీటర్ల డీజిల్ వినియోగమవుతుంది. నాలుగు గంటలకు 20 లీటర్ల వినియోగించాల్సి ఉంటుంది. ఐదెకరాల చెరువులో ఆక్వాను సాగు చేస్తున్న రైతులపై రోజుకు రూ.3 వేల వరకూ భారం పడుతోంది. ప్రస్తుతం అత్యధిక చెరువుల్లో రొయ్యలు పిల్ల దశలో ఉన్నాయి. ఏరియేటర్లను వినియోగించకపోతే వాతావరణ పరిస్థితుల రీత్యా వైరస్ సోకే లేదా ఆక్సిజన్ అందక మృతి చెందే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో రైతులంతా జనరేటర్లు, మోటార్ ఇంజిన్లను ఆశ్రయిస్తున్నారు.