Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిషేధిత భూములపై సీఎం ఆదేశం
అమరావతి : రాష్ట్రంలో నిషేధిత భూముల వ్యవహారాలకు (22ఎ) చెక్ పెట్టాల్సిందేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకంపై క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వ హయంలో వీటికి సంబంధించి రికార్డుల్లో చోటుచేసుకున్న వ్యవహరాలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. దీనిపై చర్చించి ఒక విధానాన్ని రూపొందించాలని చెప్పారు. భూములు క్రయ విక్రయాలు జరిగినపుడే రికార్డులనూ అప్డేట్ చెయ్యాలని అన్నారు. అప్పుడే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయినట్టు భావించాలని చెప్పారు. దీని కోసం ల్యాండ్ రికార్డుల్లో నిపుణులైన వారిని, న్యాయపరమైన అంశాల్లో అనుభవం ఉన్న వారితో ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేయాలని, తగిన విధానాన్ని రూపొందించాలని సూచించారు. గ్రామ సచివాలయాల్లోనే ఈ ప్రక్రియ పూర్తయ్యేలా ఉండాలని, వీటి కోసం ఆఫీసులు చుట్టూ తిరగకుండా చూడాలన్నారు. ల్యాండ్ సర్వేను అనుకున్న లక్ష్యంలోగా పూర్తి చేయాలని దీనికోసం అవసరమైన డ్రోన్లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా అధికారులు సమగ్ర భూ సర్వే పనుల్లో ప్రగతిని, లక్ష్యాలను సిఎంకు వివరించారు. పైలట్ ప్రాజెక్టు కింద 51 గ్రామాల్లో సర్వే పూర్తి చేశామని డిసెంబరు 21 నాటికి మండలానికి ఒక గ్రామం చొప్పున మరో 650 గ్రామాల్లో సర్వే పూర్తి చేస్తామని వివరించారు. 2022 ఆగస్టు నాటికి రాష్ట్రంలో 5,500 గ్రామాల్లో సర్వే పూర్తవుతుందని వెల్లడించారు. 2023 జూన్ నాటికి రాష్ట్రవ్యాప్తంగా సర్వే పూర్తిచేయనున్నట్లు తెలిపారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా 51 గ్రామాల్లో 30,679 కమతాలను సర్వే చేశామని 3,549 పట్టాదారుల వివరాలను అప్డేట్ చేశామని వివరించారు. సర్వే పూర్తయిన తరువాత పూర్తి వివరాలు, మ్యాపులతో కూడిన పట్టాదారు పుస్తకాన్ని రైతులకు అందిస్తున్నామని సిఎంకు వివరించారు.
కావాల్సిన బొగ్గు కొనుగోలు చేయండి
రాష్ట్రంలో నిధులు కొరత లేదని కావాల్సినంత బొగ్గు కొనుగోలు చేయాలని సిఎం జగన్మోహన్రెడ్డి విద్యుత్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో కరెంటు పరిస్థితులపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ థర్మల్ కేంద్రాలను పూర్తిస్థాయి సామర్థ్యంతో నడిపించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. దేశంలో బొగ్గు నిల్వలు ఎక్కడున్నా వాటిని తెప్పించుకోవడానికి అన్ని రకాలుగా చర్యలు తీసుకోవాలని కావాల్సిన బొగ్గును కొనుగోలు చేయాలని సూచించారు. కృష్ణపట్నం, విటిపిఎస్ల్లో ఉన్న కొత్త యూనిట్లలో వెంటనే ఉత్పత్తి ప్రారంభించాలని తద్వారా 1600 మొగావాట్ల విద్యుత్తును అందుబాటులోకి తీసుకురావాని ఆదేశించారు. సింగరేణి సంస్థతో సమన్వయం చేసుకుని అవసరాల మేరకు బొగ్గును తెప్పించుకోవాలన్నారు. కేంద్రంలోని సంబంధిత మంత్రిత్వ శాఖలు, ఏజెన్సీలతో సమన్వయం చేసుకుని రాష్ట్రంలో కరెంటు కోతలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.