Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోవిడ్ మృతుల కుటుంబాలకు నెలకు రూ. 5 వేలు : రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం
తిరువనంతపురం : రాష్ట్రంలో కరోనా మృతుల కుటుంబాలకు ఆర్థికంగా బాసటగా నిలిచేందుకు కేరళ సర్కారు కృషి చేస్తున్నది. ఇందులో భాగంగా దారిద్య్ర రేఖకు దిగువన (బీపీఎల్) ఉన్న బాధిత కుటుంబాలకు నెలకు రూ.5 వేలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఆర్థిక సహాయం మూడేండ్ల వరకు అందనున్నది. ''ప్రత్యేక ఆర్థిక సహాయం కింద కోవిడ్ మహమ్మారి బాధిత కుటుంబాలు నెలకు రూ.5000 చొప్పున మూడేండ్ల వరకు స్వీకరించనున్నాయి' అని కేరళ ఆర్థికశాఖ మాజీ మంత్రి థామస్ ఐజాక్ ట్వీట్ చేశారు. ''బాధిత బీపీఎల్ కుటుంబాలకు ఆర్థిక సహాయం అందుతుంది. సోషల్ వెల్ఫేర్, వెల్ఫేర్ ఫండ్, ఇతర పెన్షన్లు వారిని అనర్హులను చేయవు.
కరోనాతో ఒక వ్యక్తి రాష్ట్రంలో లేదా దేశంలో లేదా విదేశాల్లో మరణించినా.. రాష్ట్రంలో స్థిరపడిన మృతుడి కుటుంబీకులకు ఈ ప్రయోజనం అందుతుంది'' అని కేరళ సీఎంఓ ఒక అధికారిక ఉత్తర్వును కూడా వెలువరించింది. అయితే ఆదాయపు పన్ను చెల్లించే వారు, ప్రభుత్వ ఉద్యోగులు.. ఈ సహాయానికి అనర్హులని కేరళ ప్రభుత్వం తెలిపింది. కరోనాతో మరణించిన వారి పిల్లలు జిల్లా కలెక్టర్లకు దరఖాస్తు చేయాలి. పరిశీలన అనంతరం అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆర్థిక సాయం అందిస్తామని కేరళ ప్రభుత్వం తెలిపింది.