Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆయా రాష్ట్రాల్లో బీజేపీ పాలిత సీఎంల దిష్టి బొమ్మలు కూడా... : ఎస్కేఎం పిలుపు
- రైతులకు అందని పరిహారం
న్యూఢిల్లీ :చెడుపై మంచి విజయం సాధించడానికి గుర్తుగా రైతు వ్యతిరేక బీజేపీ నేతల దిష్టి బొమ్మలను దహనం చేయాలనీ, ఆయా రాష్ట్రాల్లో స్థానిక పరిస్థితుల బట్టి 15, 16 తేదీల్లో నిర్వహించొచ్చని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) పేర్కొంది. దసరా పండుగ రోజున ప్రధాని మోడీ, కేంద్ర హౌం మంత్రి అమిత్ షా, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, కేంద్ర హౌం సహాయ మంత్రి అజరు మిశ్రా తో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల దిష్టి బొమ్మలను ఆయా రాష్ట్రాల్లో దహనం చేయాలని ఎస్కేఎం పిలుపు ఇచ్చింది. అయితే బీజేపీ, ఆరెస్సెస్ శక్తులు సున్నితమైన ప్రాంతాల్లో మత ఉద్రిక్తతలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుందని తెలుసుకున్న ఎస్కేఎం షెడ్యూల్‌ను స్థానిక పరిస్థితులను బట్టీ దిష్టిబొమ్మల దహన కార్యక్రమాన్ని రెండు రోజులపాటు (అక్టోబర్ 15, 16 తేదీల్లో )నిర్వహించాలని మార్పు చేసింది.
కేంద్రమంత్రిని తొలగించాల్సిందే...
కేంద్ర మంత్రి అజరు మిశ్రా తొలగించాలనీ, వెంటనే అరెస్టు చేయాలని ఎస్కేఎం మరోసారి తన డిమాండ్‌ను పునరుద్ఘాటించింది. లేకుంటే, లఖింపూర్ ఖేరి రైతుల ఊచకోతలో న్యాయం కచ్చితంగా రాజీపడే అవకాశం ఉందని పేర్కొంది. అక్టోబర్ 18న దేశవ్యాప్తంగా రైల్‌రోకో అమలు జరుగుతుందని తెలిపింది. అలాగే లఖింపూర్ ఖేరీ ఘటనలో మరణించిన, గాయాలు పాలైన రైతులకు పరిహారం ఇంకా అందలేదని పేర్కొంది. ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరి నుంచి ప్రారంభమైన షహీద్ ఆస్తిక యాత్రలు వివిధ ప్రదేశాలకు వెళ్లాయి. పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ జిల్లాలోని జిరాలో శుక్రవారం ఒక భారీ కిసాన్ మహాపంచాయత్ జరుగుతుంది.
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా రైతులు ఆందోళన
ఉత్తరాఖండ్‌లో బీజేపీ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తన జిల్లా ఉద్ధమ్ సింగ్ నగర్లో స్థానిక రైతుల నుంచి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. నిరసన తెలిపిన రైతులు మొదట్లో మండి వద్ద గుమిగూడారు. కాని తరువాత సీఎం ఉపయోగిస్తున్న హెలిప్యాడ్‌కు చేరుకున్నారు. అక్కడ నల్ల జెండాలతో ఆందోళన చేపట్టారు. రాబోయే రోజుల్లో ఇటువంటి నిరసనలను తీవ్రతరం చేస్తామని రైతు నాయకులు ప్రకటించారు. రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్‌లో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు కైలాశ్ మేఘ్వాల్కు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేపట్టారు. అక్కడ వృద్ధ రైతుపై లాఠీ వర్షం కురిపించిన పోలీసు అధికారి నరేష్ గెహారాను సస్పెండ్ చేయాలని కోరుతూ రైతులు కలెక్టరేట్ వెలుపల నిరవధిక నిరసన చేపడుతున్నారు. హర్యానాలోని హిసార్‌లో ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఓం ప్రకాష్ ధంకర్‌కు వ్యతిరేకిస్తూ రైతులు జీజే యూనివర్సిటీ వెలుపల నల్ల జెండాలతో నిరసన తెలిపారు.
ఘటనా స్థలానికి నిందితులు..తీసుకెళ్లిన సిట్
లఖింపూర్ ఖేరీ హింసాకాండపై దర్యాప్తు చేస్తున్న సిట్ కేంద్ర మంత్రి అజరు మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా, ఈ కేసులో అరెస్టయిన మరో ముగ్గురిని ఉత్తరప్రదేశ్‌లోని టికోనియా గ్రామంలో సంఘటన జరిగిన ప్రాంతానికి తీసుకెళ్లింది. గురువారం కట్టుదిట్టమైన భద్రత మధ్య నిందితులను టికోనియా-బన్బీర్పూర్ రహదారిపై జరిగిన సంఘటన స్థలానికి తీసుకెళ్లారు. జిల్లా కేంద్రం లఖింపూర్ నగరానికి 60 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన స్థలం ఉంది. మరోవైపు ఆశిష్ మిశ్రాకు బెయిల్ నిరాకరించారు. అలాగే ఈ కేసులో మరో ఇద్దరని అరెస్టు చేశారు.
రైతులకు మద్దతుగా వాజ్‌పేయి ప్రసంగం క్లిప్‌ను ట్విట్ చేసిన వరుణ్ గాంధీ
బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ గురువారం ట్విట్టర్లో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రసంగానికి సంబంధించిన వీడియో క్లిప్‌ను పోస్ట్ చేశారు. దీనిలో రైతులను అణచివేతకు వ్యతిరేకంగా అప్పటి ఇందిరా గాంధీ ప్రభుత్వాన్ని వాజ్‌పేయి హెచ్చరించారు. రైతులకు తన మద్దతును వాజ్‌పేయి అందించారు. ''ఒక పెద్ద మనసున్న నాయకుడి నుండి తెలివైన మాటలు ...'' అని ట్విట్టర్లో పేర్కొన్నారు. మోడీ ప్రభుత్వం అమలు చేసిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేస్తున్నప్పుడు, వాజ్‌పేయి ప్రసంగాన్ని పోస్టు చేయడంతో కేంద్ర ప్రభుత్వానికి ఆయన సందేశం పంపినట్టు అయింది. వీడియో క్లిప్‌లో రైతులు భయపడరని వాజ్‌పేయి చెప్పడం ఉంటుంది. ''రైతులను ప్రభుత్వం అణచివేస్తే, చట్టాలను దుర్వినియోగం చేసి, శాంతియుత ఆందోళనను అణచివేస్తే, రైతుల పోరాటంలో పాల్గొనడానికి, వారితో నిలబడటానికి మేం వెనుకాడం'' అని వాజ్‌పేయి ఆ వీడియోలో పేర్కొన్నారు.
దర్యాప్తుపై రాకేశ్ తికాయత్ అసంతృప్తి
లఖింపూర్ హింస కేసుపై కొనసాగుతున్న దర్యాప్తుపై రైతు నేత రాకేశ్ తికాయత్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర హౌం సహాయ మంత్రి అజరు మిశ్రా కుమారుడు ఆశిష్‌ని ''రెడ్ కార్పెట్ అరెస్ట్'' చేయడం నిరసన వ్యక్తం చేస్తున్న రైతుల్లో ఆగ్రహాన్ని పెంచిందని అన్నారు. అజరు మిశ్రాను తొలగించాలని డిమాండ్ చేశారు. నిందితుడి తండ్రి ఆ కుర్చీలో కొనసాగితే కేసులో న్యాయమైన దర్యాప్తు జరగదని ఆయన అన్నారు. న్యాయం జరగదని ప్రపంచం మొత్తం అర్థం చేసుకుంటుందని తెలిపారు. సిట్ దర్యాప్తుపై మంత్రి ప్రభావం చూపుతున్నారని విమర్శించారు. అజరు మిశ్రాను తన పదవి నుంచి తొలగించకపోతే లఖింపూర్ హింసకు వ్యతిరేకంగా నిరసన తీవ్రతరం అవుతుందని ఆయన పునరుద్ఘాటించారు.
ఆదివాసీల పోరాటం..కలవని సీఎం
ఛత్తీస్‌గఢ్‌లో వందలాది మంది ఆదివాసీ రైతులు, పురుషులు, మహిళలు గత 10 రోజుల్లో ''హస్డియో బచావో యాత్ర''లో 300 కిలోమీటర్లకు పైగా నడిచిన తరువాత రాష్ట్ర రాజధాని రాయపూర్ చేరుకున్నారు. హస్డియో బచావో యాత్ర అనేది ఆదివాసీల సంస్కృతి, జీవనోపాధిలో అంతర్భాగమైన అడవులను కాపాడడం, పెద్ద మైనింగ్ కార్పొరేషన్ల దోపిడీ నుంచి వివిధ రాజ్యాంగ, చట్టపరమైన నిబంధనలను ఉల్లంఘించడానికి వ్యతిరేకంగా ఈ యాత్ర జరిగింది. 350 మంది కాలిబాటన గురువారం ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయపూర్ కు వచ్చి...ముఖ్యమంత్రి భూపేష్ భఘేల్ను కలవటానికి ప్రయత్నించారు. అందుబాటులోలేరని సీఎం పేషీ అధికారులు చెప్పారు. పాదయాత్రలో సీఎం గైర్హాజరైనా..గవర్నర్‌ను కలిసి తమ డిమాండ్లను వివరించాలని ఆదివాసీలు భావిస్తున్నారు.