Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రయివేటీకరణపై కేంద్రం దృష్టి
- ఎయిరిండియా తర్వాత టార్గెట్‌లో అరడజన్ పీఎస్‌యూలు
న్యూఢిల్లీ : ఎయిరిండియాను టాటా గ్రూపునకు కట్టబెట్టిన మోడీ సర్కార్.. తర్వాత భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్)ను ప్రయివేటీకరణ చేసేం దుకు కసరత్తు చేస్తున్నది. ఈ సంస్థతో పాటు మరో అరడజన్పైగా పీఎస్‌యూల్లో వాటాల విక్రయం లేదా ప్రయివేటీకరణ చేయడానికి కేంద్ర తీవ్ర కసరత్తు చేస్తున్నది. వచ్చే మార్చి ముగింపు నాటికి బీపీసీఎల్, ఎల్ఐసీ, ఐడీబీఐ బ్యాంక్. పవన్‌హాన్స్, నీలంచల్ ఇస్పాత్ నిగమ్, సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తదితర పీఎస్‌యూలు కీలక డిజిన్వెస్ట్‌మెంట్ జాబితాలో ఉన్నాయి. రెండు ప్రభుత్వరంగ బ్యాంకులు, ఒక బీమా సంస్థ కూడా ప్రయివేటీకరించే పనిలో ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22)లో పీఎస్‌యూల్లో డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా రూ.1.75 లక్షల కోట్లను సమీకరించాలని కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే యాక్సిస్ బ్యాంక్, ఎన్ఎండీసీ, హడ్కో మొదలైన వాటిలో వాటా విక్రయం ద్వారా ప్రభుత్వానికి రూ.8,369 కోట్లు సమకూరాయి. గత వారంలో ఎయిరిండియాను టాటా గ్రూపునకు కట్టబెట్టడం ద్వారా రూ.18వేల కోట్లు పొందింది. ఇప్పటి వరకు పలు సంస్థల్లో పెట్టు బడుల ఉపసంహరణ ద్వారా రూ.26,369 కోట్లు సేకరించింది. రూ.1.75 లక్షల కోట్ల డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యాన్ని చేరడానికి దీపమ్ వేగంగా కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. వచ్చే మార్చి కల్లా బీపీసీఎల్ విక్రయం పూర్తివుతుందని దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత్ పాండే ఇటీవల పేర్కొన్నారు. ఈ పీఎస్యూలో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ)కు అనుమతిస్తూ కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఇందులో ఆటోమెటిక్ పద్దతిలో ఎఫ్‌డీఐలను అనుమతించడానికి వీలుగా నిబంధనలు మార్చింది. దీంతో బీపీసీఎల్‌ను విదేశీ కార్పొరేట్ కంపెనీకి కట్టబెట్టడానికి అవకాశం ఉంది. దేశంలోనే రెండో అతిపెద్ద చమురు కంపెనీగా ఉన్న బీపీసీఎల్‌లోని ప్రభుత్వానికి ఉన్న 53 శాతం వాటాను విక్రయించనుంది. బీపీసీఎల్‌లోని వాటా విక్రయం ద్వారా రూ.52వేల కోట్ల నిధులు వస్తాయని అంచనా వేస్తోంది. దేశంలోనే అత్యధిక టర్నోవర్ కలిగిన కంపెనీల్లో 6వ స్థానంలో ఉంది. ఇలాంటి మహారత్న కంపెనీని మోడీ సర్కార్ కార్పొరేట్లకు కట్టబెట్టడంపై ఆ కంపెనీ ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే. ఇది అత్యంత చౌకబేరమని ప్రతిపక్షాలు, నిపుణులు ఆరోపిస్తున్నారు. అత్యంత విలువైన, భారీ లాభాలు, ఆదాయాన్ని గడిస్తున్న బీపీసీఎల్‌ను కార్పొరేట్లకు అత్యంత తక్కువ ధరకు కట్టబెట్టే యోచన అత్యంత దుర్మార్గమనే విమర్శలు పెరుగుతున్నాయి.