Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌లో 101వ స్థానం
- దిగజారిన ఇండియా ర్యాంక్
- పాక్, నేపాల్, బంగ్లాదేశ్ మనకంటే పైనే..
న్యూఢిల్లీ : దేశంలో ఆకలి ఘోష తీవ్ర స్థాయికి చేరుకుంది. ప్రజలపై విపరీతంగా భారాలు మోపుతూ, లక్షల కోట్లు కార్పొరేట్లకు కట్టబెట్టే మోడీ ప్రభుత్వ హయాంలో ఆకలి సూచీలో మనదేశ స్థానం దిగజారుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఆకలి సమస్య తీవ్రంగా ఉన్న 31 దేశాల్లో భారత్ ఒకటిగా ఉంది. ఆకలి ఘోష విషయంలో పాపువా న్యూ గినియా, ఆఫ్ఘనిస్తాన్, నైజీరియా వంటి దేశాల సరసన భారత్ నిలిచింది. గురువారం విడుదల చేసిన గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2021 జాబితాలో మొత్తం 116 దేశాలకు గానూ భారత్ 101వ స్థానంలో నిలిచింది. మన దేశం తరువాతి స్థానాల్లో పాపువా న్యూ గినియా (102), ఆఫ్ఘనిస్తాన్, నైజీరియా (103), కాంగో (105), మోజాంబిక్, సియార్రా లియోన్ (106), తిమోర్ లెస్తే (108), హైతీ (109), లిబియా (110), మడగాస్కర్ (111), డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (112), చాద్ (113), సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ (114), యెమన్ (115), సోమాలియా (116) దేశాలు ఉన్నాయి. ఈ జాబితాలో అట్టడుగున సోమాలియా ఉంది. భారత్ కన్నా పాకిస్తాన్ (92), నేపాల్, బంగ్లాదేశ్ (76)లకు ఉత్తమ ర్యాంక్‌లు లభించాయి. ఈ జాబితాలో గత ఏడాది కంటే ఈ ఏఢాది భారత్ మరింత దిగజారి పోవడం ఆందోళనకరం. గత ఏడాది మొత్తం 107 దేశాలకు గాను భారత్‌కు 94వ ర్యాంక్ లభించింది.జాతీయ, ప్రాంతీయ, ప్రపంచ స్థాయిలో 2030 నాటికి ఆకలి బాధలు లేని సమాజం (జీరో హంగర్) దిశగా పురోగతిని కొలవడానికి కీలక అంశాలను గుర్తించడానికి ఈ జాబితా తయారు చేస్తారు. ప్రస్తుత సూచీలను బట్టి 2030 నాటికి ఈ జాబితాలోని 47 దేశాలు ఆకలి లేని సమాజాన్ని సాధించడంలో వెనుకబడతాయని అంచనా వేశారు. పోషకాహార లోపం, చిన్నారుల్లో వయసుకు తగిన బరువు లేకపోడం, చిన్నారుల్లో వయసుకు తగిన ఎత్తు లేకపోవడం, చిన్నారుల మరణాలు.. అనే నాలుగు సూచికల ఆధారంగా ఈ జాబితా రూపొందిస్తారు. 100 పాయింట్లకు ఎన్ని పాయింట్లు వచ్చాయనే అంశంతో ర్యాంక్ కేటాయిస్తారు. 0 స్కోరు వస్తే ఆకలి లేదని అర్థం. 100 పాయింట్లు వస్తే ఆకలి సమస్య తీవ్రంగా ఉందని అర్థం. తీవ్రత ఆధారంగా ప్రతి దేశాన్ని తక్కువ నుంచి అత్యంత ఆందోళనకరం మధ్య వర్గీకరిస్తారు. ఈ ఏడాది జాబితా ప్రకారం సోమాలియా అత్యంత ఆందోళనకరం విభాగంలో ఉంది. సొమాలియాకు 50.8 పాయింట్ల స్కోరు వచ్చింది. సోమాలియాతో సహా సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, చాద్, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో, మడాగస్కర్, యెమన్ అత్యంత ఆందోళనకర దేశాలల్లో ఉన్నాయి. భారత్‌తో సహా 31 దేశాలు తీవ్ర స్థాయి ఆకలితో బాధపడుతున్నాయి.2000 నుంచి ప్రపంచవ్యాప్తం గా ఆకలి సమస్య పెరుగుతున్నట్టు నివేదిక పేర్కొం ది. సమస్య పెరుగుదలలో వేగం కనిపిస్తోందని తెలిపింది. 2006 నుంచి 2012 మధ్య కాలంలో ప్రపంచ పాయింట్లు 20.4 నుంచి 25.1 వరకు పడిపోయినట్లు నివేదిక చెప్పింది. 2012 నుంచి 2.5 పాయింట్లు తగ్గినట్లు తెలిపింది. ప్రధానంగా జాబితా రూపొందించడానికి నాలుగు సూచికల్లో ఒకటైన పోషకాహారలోపం ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా పెరుగుతోందని నివేదిక తెలిపింది. దీని ద్వారా మిగిలిన మూడు సూచికలు (చిన్నారుల్లో వయసుకు తగిన బరువు లేకపోవడం, వయసుకు తగిన ఎత్తు లేకపోవడం, మరణాలు) బాగా పెరుగుతున్నాయని నివేదిక స్పష్టం చేసింది.