Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఢిల్లీ కోర్టు వ్యాఖ్య
- నిందితులపై అభియోగాలు నమోదు
న్యూఢిల్లీ : గతేడాది ఫిబ్రవరిలో ఢిల్లీలో రేగిన అల్లర్ల కేసులో తొమ్మిది మంది నిందితులపై ఢిల్లీ కోర్టు అభియోగాలు మోపింది. పోలీసులు ఆలస్యంగా ప్రత్యక్ష సాక్షుల స్టేట్మెంట్లను నమోదు చేశారన్న కారణంతో మొత్తంగా ప్రాసిక్యూషన్ కథనాన్ని తోసిపుచ్చడం 'న్యాయాన్ని నిరాకరించడమే' కాగలదని ఢిల్లీ కోర్టు పేర్కొంది. పోలీసులు ప్రత్యక్ష సాక్షుల స్టేట్మెంట్లను రికార్డు చేయడలో ఉద్దేశపూర్వకంగా లేదా కుట్రపూరితంగా జాప్యం చేయలేదని అదనపు సెషన్స్ న్యాయమూర్తి వీరేందర్ భట్ పేర్కొన్నారు. అల్లర్లు జరిగిన తర్వాత వున్న పరిస్థితుల కారణంగానే అలా జరిగిందని అన్నారు. ప్రత్యక్ష సాక్షుల కథనాలు విశ్వసించదగ్గవి కాదని డిఫెన్స్ న్యాయవాది పేర్కొనడం పట్ల న్యాయమూర్తి అభ్యంతరం తెలిపారు. సంఘటన జరిగిన నెల రోజుల తర్వాత స్టేట్మెంట్ను నమోదు చేశారని అన్నారు. అల్లర్లు, గృహ దహనాలు జరిగిన తర్వాత అనేక రోజులపాటు భయానక వాతావరణం నెలకొందని న్యాయమూర్తి పేర్కొన్నారు. దీంతో భయపడిన ప్రత్యక్ష సాక్షులు సాక్ష్యమివ్వడానికి ముందుకు కూడా రాలేదని అన్నారు. ఈ పరిస్థితులన్నింటినీ దృష్టిలో వుంచుకోవాలని, ప్రాథమిక దశలోనే ఈ స్టేట్మెంట్లను విశ్వసించకపోతే న్యాయం నిరాకరించబడినట్లేనని వ్యాఖ్యానించారు. తొమ్మిది మంది నిందితులు కోట్లాది రూపాయల ఆస్తులను దోచుకున్నారని, గత ఏడాది ఫిబ్రవరి 25న పెద్ద సంఖ్యలో ఇళ్లు, దుకాణాలు, పాఠశాలలు, వాహనాలను తగలబెట్టారని పోలీసులు కోర్టుకు తెలిపారు. ఈ కేసుల ఛార్జిషీట్లో భాగంగా పేర్కొన్న సిసి టివి వీడియో పుటేజి గత ఏడాది ఫిబ్రవరి 24వ తేదీకి సంబంధించినదని, ఈ సంఘటన 25న జరిగిందని డిఫెన్స్ న్యాయవాదులు పేర్కొన్నారు. ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలంపై ఆధారపడి కేసు దర్యాప్తు చేసినట్లు ప్రాసిక్యూషన్ తెలిపింది.