Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'మీటూ ఉద్యమం'పై నివేదిక బుట్టదాఖలు!
న్యూఢిల్లీ : మూడేండ్ల క్రితం (అక్టోబర్, 2018లో) మనదేశంలో 'మీటూ ఉద్యమం' ఉవ్వెత్తున ఎగిసిపడింది. మోడీ సర్కార్‌లోని కేంద్ర మంత్రి ఎం.జె.అక్బర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. పనిప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులు పెరిగాయని సర్వత్రా ఆందోళన వ్యక్తమైంది. దేశవ్యాప్తంగా ఈ అంశం రాజకీయంగా, సామాజికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే దేశంలో పెల్లుబుకుతున్న నిరసన తాకిడిని అడ్డుకోవడానికి కేంద్రం 'గ్రూప్ ఆఫ్ మినిష్టర్స్' (మంత్రుల బృందం)తో ఒక కమిటీని ఏర్పాటుచేసింది. కమిటీ ఇచ్చే మార్గదర్శకాలను మూడు నెలల్లో అమలుజేస్తామని ప్రకటించింది. అయితే ఆ కమిటీ 10 ఫిబ్రవరి 2020లో నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. నివేదిక సమర్పించి ఏడాదిన్నర దాటుతున్నా..ఇందులో పేర్కొన్న విషయాల్ని మోడీ సర్కార్ బయటపెట్టడానికి విముఖత వ్యక్తం చేస్తోంది.కమిటీ ఎలాంటి మార్గదర్శకాలు సూచించింది? 'మీటూ ఉద్యమం'పై ఏం తేల్చారు? పనిప్రదేశాల్లో మహిళలకు భద్రతను పెంచే చర్యలేంటి? మొదలైన ప్రశ్నలు చర్చనీయాంశమయ్యాయి. ఆనాడు దేశవ్యాప్త ఉద్యమాన్ని చల్లార్చడానికి మోడీ సర్కార్ ఒక ఉన్నతస్థాయి కమిటీ నియమించి చేతులు దులుపుకుందని సామాజికవేత్తలు విమర్శిస్తున్నారు. మంత్రుల బృందం నివేదిక వివరాలు ఇవ్వాల్సిందిగా న్యూస్ వెబ్‌పోర్టల్ 'ద క్వింట్' ఆర్టీఐ దరఖాస్తు చేయగా, అడిగిన వివరాలు కేంద్రం బయటపెట్టడానికి నిరాకరిస్తోంది. కమిటీ సూచించిన మార్గదర్శకాల్ని మూడు నెలల్లో అమలుజేస్తామన్న మోడీ సర్కార్, మూడేండ్లయినా దానిపై స్పందించకపోవటం వివాదాస్పదమైంది.