Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పండుగ రోజుల్లో పెరిగిన ఇంధన ధరలు
- లీటర్ పెట్రోల్, డీజీల్‌లపై 35 పైసల చొప్పున పెంపు
- మోడీ సర్కారుపై ప్రజల ఆగ్రహం
న్యూఢిల్లీ : ప్రజలకు పండుగ రోజునా పెట్రో భారం తప్పడం లేదు. దేశంలో వరుసగా మూడో రోజూ ఇంధన ధరలను పెంచింది కేంద్రం. దేశరాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్, డీజీల్‌లపై 35 పైసల చొప్పున ధరలు పెరిగాయి. అలాగే, దేశంలోని పలు ప్రధాన నగరాలతో పాటు ప్రాంతాల్లో పెట్రోల్, డీజీల్ ధరలు ఆకాశాన్నంటాయి. ఫలితంగా నిత్యవసర ధరలూ సామాన్య జనానికి చుక్కలు చూపిస్తున్నాయి. కరోనా కష్టకాలం, పండుగ సీజన్లో ధరలను అదుపు చేయలేకపోతున్న మోడీ ప్రభుత్వంపై వాహనదారులు, సామాన్య ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.వరుసగా మూడో రోజు పెరిగిన ఇంధన ధరల ప్రకారం.. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 105.49 కు, డీజీల్ ధర రూ. 94.22 కు ఎగబాకింది. దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ. 111.43 కు, డీజీల్ ధర రూ. 102.15 కు పెరిగింది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 102.70గా , డీజీల్ ధర రూ. 98.59 గా నమోదైంది. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 106.10కు, డీజీల్ ధర రూ. 97.33కి చేరింది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ. 109.16 కి, డీజీల్ ధర రూ. 100 కి చేరి సామాన్యుల జేబులకు చిల్లులు పెడుతున్నాయి.ఇటు హైదరాబాద్‌లోనూ పెట్రో ధరల బాదుడు వాహనదారులు, ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇక్కడ, లీటర్ పెట్రోల్ ధర రూ. 109.73 కు (36 పైసల పెరుగుదల) ఎగబాకింది. డీజీల్ ధర రూ. 102.80 కి (38 పైసల పెరుగుదల) పెరిగింది.