Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొట్టాయంలో 12 మంది గల్లంతు
- ఐదు జిల్లాల్లో రెడ్ అలర్ట్, మరో ఏడు చోట్ల ఆరెంజ్ అలర్ట్
- ఐదుగురి మృతి, పలువురు గల్లంతు
తిరువనంతపురం : కేరళలో కురుస్తున్న భారీ వర్షాలు బీభత్సం సష్టిస్తున్నాయి. ఈ వరదల ధాటికి కొట్టాయం, ఇడుక్కిలలో కొండచరియలు విరిగిపడ్డాయి. వర్ష సంబంధిత ఘటనల్లో శనివారం ఐదుగురు మరణించారు. కొట్టాయం జిల్లాలోని కొట్టికల్ ప్రాంతంలో మూడు ఇళ్లు కొట్టుకుపోవడంతో పాటు 10 మంది గల్లంతయ్యారని రాష్ట్ర మంత్రి విఎన్.వాసవన్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. రహదారులన్నీ వరదనీటితో నిండిపోయాయి. భారీ వర్షాల నేపథ్యంలో వాతావరణ శాఖ ఐదు జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది. మరో ఏడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. రెండు జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించింది. కొండ చరియలు విరిగిపడటం, రహదారులు జలమయమైన నేపథ్యంలో కేరళ ప్రభుత్వం భారత వైమానిక దళం(ఐఎఎఫ్) సహకారం కోరింది. దీంతో ఆర్మీ, ఎయిర్ఫోర్స్ రంగంలోకి దిగాయి. సదరన్ ఎయిర్ కమాండ్ ఆధ్వర్యంలోని పలు హెలికాఫ్టర్లను అందుబాటులో ఉంచారు. మరోవైపు, వరద ప్రభావిత ప్రాంతాల్లో సైన్యం బలగాలను మోహరించింది. పతనంతిట్ట, కొట్టాయం, ఎర్నాకుళం, ఇడుక్కి, త్రిస్సూరు జిల్లాల్లో రెడ్అలర్ట్ జారీ చేయగా.. తిరువనంతపురం, కొల్లం, అలప్పుజ, పాలక్కడ్, మలప్పురం, కోలికోడ్, వాయనాడ్లలో ఆరంజ్ అలర్ట్ జారీచేశారు.