Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతు దీక్షాస్థలి వద్ద కలకలం
న్యూఢిల్లీ: ఢిల్లీ-హర్యానా సరిహద్దు ప్రాంతమైన సింఘూ రైతు దీక్షాస్థలి వద్ద ఒక వ్యక్తి దారుణ హత్య కలకలం రేపింది. శుక్రవారం తెల్లవారుజామున 35 ఏండ్ల లఖ్బీర్ సింగ్ అనే యువకుడి ఎడమ చేతిని నరికి వేయడంతో పాటు ఆయన శరీరాన్ని బారికేడ్లకు వేలాడతీశారు. ఈ ఘటనకు సంబంధించి సరబ్జిత్ సింగ్ అనే నిహంగ్ సిక్కు శనివారం పోలీసుల ఎదుట లొంగిపోయాడు. సిక్కుల పవిత్ర గ్రంథమైన గురు గ్రంథ్ సాహిబ్‌ను అపవిత్రం చేసినందుకే అతడ్ని శిక్షించానంటూ నిహాంగ్స్ నీలిరంగు వస్త్రాలు ధరించిన ఆయన మీడియాతో చెప్పిన అనంతరం పోలీసులకు లొంగిపోయాడు. హత్య ఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. నీలిరంగు తలపాగా, దుస్తులు ధరించిన కొందరు వ్యక్తులు ఆయనను చంపుతున్నట్టు ఆ వీడియోలో ఉంది. ఎక్కడ నుంచి వచ్చావు, తమ గ్రంథాన్ని అపవిత్రత చేయడానికి ఎవరు పంపించారని అడుగుతున్నట్టు ఆ వీడియోలో ఉంది. కాగా, ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేశామని డీఎస్పీ హన్స్‌రాజ్ తెలిపారు. బాధితుడు పంజాబ్‌లోని తార్న్ తరణ్ జిల్లాలోని చీమా ఖుర్ద్ గ్రామానికి చెందిన దళిత వ్యవసాయ కూలీగా గుర్తించారు.
నేరస్తులను శిక్షించండి : ఎస్కేఎం
ఈ ఘటనపై సంయుక్త కిసాన్ మోర్చా స్పందించింది. విచారణ చేసి నేరస్థులను శిక్షించాలని డిమాండ్ చేసింది. మరణించిన వ్యక్తి కొంతకాలంగా నిహాంగ్‌ల సమూహంతోనే ఉంటున్నారనీ, హత్యకు నిహాంగ్ గ్రూపే బాధ్యత వహించాలని పేర్కొంది. నిహాంగ్ సమూహానికి గానీ, మరణించిన వ్యక్తికి గానీ ఎస్కేఎంతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. విచారణలో పోలీసులకు సహకరిస్తామని.. శాంతియుత, ప్రజాస్వామ్య రైతాంగ ఉద్యమం హింసకు చోటులేదని ఎస్కేఎం పేర్కొంది.