Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏడాదిలో ఎల్పీజీ ధర రూ.300 అధికం
- చమురు ధరలు ఆల్టైమ్ రికార్డు స్థాయికి..
- పన్ను రూపంలో 3.73 లక్షల కోట్లు వసూల్ చేసిన మోడీ సర్కారు
న్యూఢిల్లీ: గత కొన్ని రోజులుగా దేశంలో పెట్రోల్ ధరలు వాహనదారుల నడ్డివిరుస్తున్నాయి.ఎల్పీజీ సిలిండర్ ధరలు సైతం పెరుగుతూ..ప్రజలపై గుదిబండలా మారా యి. ఇప్పటికే కరోనా కారణంగా ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలలను పెరుగుతున్న చమురు, ఎల్పీజీ ధరలతో కోట్లాది మంది తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక ఏడాది కాలంలో 14.2కిలోల ఎల్పీజీ సిలిండర్ ధర రూ.604.63 నుంచి రూ.906.38లకు పెరిగింది. నమ్మశక్యం కానీ రీతిలో ఒక్క ఏడాదిలోనే(2021-అక్టోబర్ వరకు)రూ.301.75 పెరిగిం ది. ఇదిలావుంటే ప్రధాని మోడీ పేద ప్రజలకు ఉచిత గ్యాస్ కనెక్షన్ పథకం తీసుకువస్తూ.. దీని గురించి పదేపదే ప్రస్తావిస్తున్నారు. అయితే, ఎల్పీజీపై సబ్సిడీ ఎత్తివేత, గ్యాస్ ధరలు రికార్డు స్థాయిలో గరిష్ట పెరుగుదలతో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లను పేద కుటుంబాలు ఉపయోగించుకోవడం కష్టతరం చేసింది. గతేడాదిలో ఎల్పీజీ పెరుగుదల ప్రజలను మరింతగా ఆర్థిక కూపంలోకి దించిందనే చెప్పాలి. ఎందుకంటే కరోనా కారణంగా లాక్డౌన్, ఉద్యోగాలు కోల్పోవడం, ఉపాధి కరువవడం వంటి కారణాలతో లక్షలాది మంది ఆకలి అంచుకు జారుకున్నారు. ఇలాంటి పరిస్థితులు కొనసాగుతు న్న వేళ పెట్రోల్, డీజిల్ ధరలు సైతం గతేడాదిలో వరుసగా 26, 31 శాతం పెరిగాయి.కేంద్రంలో మోడీ సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి(2014)నుంచి ఇప్పటివరకు పెట్రోల్,డీజిల్ ధరలు వరుసగా 79,101శాతం పెరిగాయి. ఈ ప్రభావం ఇతర నిత్యావసరాల ధరలపై కూడా ప్రభావం చూపింది. రవాణా ఖర్చులు పెరగడంతో కూరగాయాలు, ఇతర నిత్యావసరాల కోసం ప్రజలు అధిక మొత్తంలో రూపా యలు చెల్లించాల్సిన పరిస్థితులకు దారీ తీసింది. డీజిల్ ధలర పెరుగుదల రైతుల పంట ఉత్పత్తులపై ప్రభావం చూపి.. ఖర్చులను సైతం అధికం చేస్తోంది. ఇప్పటికే గిట్టుబాటు ధరలు అందక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న రైతాంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
అధిక ధరల కారణాలేంటి?
పెట్రోల్/డీజిల్, ఎల్పీజీ ధరలు అంతర్జాతీయంగా పెరిగితే.. దేశీయంగానూ పెంచాల్సి ఉంటుందనీ, దీని కారణంగానే ధరలు పెంచాల్సి వస్తున్నదనీ పదేపదే బీజేపీ నాయుకులు చెబుతున్నారు. అయితే, వాస్తవ విషయం ఏమిటంటే.. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతున్నా, తగ్గుతున్నా.. మోడీ ప్రభుత్వం పెట్రోలియం ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని నిర్విరామంగా పెంచుతోంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం పెట్రోలియం ఉత్పత్తుల నుండి రికార్డు స్థాయిలో రూ .3.73 లక్షల కోట్ల ఎక్సైజ్ సుంకం వసూలు చేసింది. ఇది మునుపటి సంవత్సరంతో పోలిస్తే రూ.1.5 లక్షల కోట్లు (67శాతం) అధికం. 2014లో మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి పెట్రోలియం ఉత్పత్తుల నుండి ఎక్సైజ్ సుంకం వసూళ్లు దాదాపు రూ.99,000 కోట్ల నుంచి రూ.3.73 లక్షల కోట్లకు పెరిగాయి. అంటే గత ఏడేండ్లలో దాదాపు 277 శాతం పెరుగుదల చోటుచేసుకుంది. 2020-21లో పెట్రోలియం ఉత్పత్తుల నుండి మొత్తం పన్ను వసూళ్లు రూ.4.2 లక్షల కోట్లు కాగా, అందులో రూ.3.73 లక్షల కోట్లు (90 శాతం) ఎక్సైజ్ సుంకం నుండి వచ్చింది. ఇక రాష్ట్ర ప్రభుత్వాలు సైతం అమ్మకపు పన్ను విలువను జోడించి పన్నులు విధిస్తాయి. 2020-21లో రాష్ట్ర ప్రభుత్వాల మొత్తం పన్ను వసూలు రూ.2.17 లక్షల కోట్లకు చేరింది. గతేడాది కరోనా, లాక్డౌన్ నేపథ్యంలో పెట్రోలియం ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గింది. అయినప్పటికీ మోడీ ప్రభుత్వం పదేపదే సుంకం రేట్లను పెంచడం ద్వారా ఎక్సైజ్ సేకరణల నుండి మరింత ఎక్కువ మొత్తాన్ని పొందగలిగింది.
ఈ పన్నులతో మోడీ ప్రభుత్వం ఏం చేస్తోంది?
పెట్రోలియం ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం వంటి పరోక్ష పన్నుల ద్వారా మోడీ ప్రభుత్వం ప్రజలను ఎందుకు ఎక్కువగా పీడిస్తోందని తరచుగా ఆశ్చర్యపోతున్నారు. అయితే, దీనికి ప్రధాన కారణాలు మోడీ సర్కారు ధనవంతులపై పన్నులు పెంచడానికి ఇష్టపడదు.. మరిన్ని రాయితీలు ఇవ్వాలనుకుంటుంది. కాబట్టి, వనరులను పెంచడానికి ఇది మొత్తం విధానాలను అమలు చేస్తోంది. వీటిలో ప్రజలపై పరోక్ష పన్నులు, వివిధ సామాజిక సంక్షేమ కార్యక్రమాల కోసం నిధులను తగ్గించడం, ప్రభుత్వ ఖాళీలను భర్తీ చేయకపోవడం, ప్రభుత్వ రంగ ఆస్తులను తక్కువ ధరకు విక్రయించడం, రోడ్లు, పోర్టులు, టెలికాం మౌలిక సదుపాయాలు, రైల్వే స్టేషన్లు, దేశంలోని మార్గాలు-ఇతర కీలక భౌతిక ఆస్తులు ప్రయివేట్పరం చేయడం వంటి చర్యలకు పాల్పడుతోంది. ప్రజల నుంచి సేకరించిన ఈ సోమ్మును వారి కోసం వినియోగించబడటం లేకపోవడంతో పాటు కార్పొరేట్ సంస్థలు తీసుకున్న బ్యాంకు రుణాలను మాఫీ చేయడం, పన్నుల నుండి మినహాయింపులు ఇవ్వడం, కార్పొరేట్ పన్ను తగ్గించడం ధనికుల అనూకూల చర్యలతో ముందుకు సాగుతోంది. మొత్తంగా చెప్పాలంటే పెట్రోలియం ఉత్పత్తులపై అధిక పన్నులు సాధారణ ప్రజల సేకరించి బడా బాబులకు అనుకూలంగా పాలన సాగించడానికి మోడీ సర్కారు ప్రణాళికబద్దమైన మరోక వ్యూహాన్ని అమలు చేస్తోందని నిపుణులు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.