Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కుల ప్రస్తావనపై ఒత్తిడి.. కేంద్రం ఉపసంహరణ
- పాత చెల్లింపు విధానం పునరుద్ధరణ
- రాష్ట్రాల అభ్యంతరంతో నిర్ణయం
న్యూఢిల్లీ : గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఉపాధి కల్పించే 'మహాత్మ గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ యాక్ట్ (ఎంజీఎన్ఆర్ఈజీఏ)' లో కులాలవారీ వేతనాల చెల్లింపుల నిర్ణయంపై మోడీ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. గతంలో ఉన్న చెల్లింపు విధానాన్నే పునరుద్ధరించింది. ఉపాధి వేతనాల చెల్లింపులు కులాలవారీగా జరపాలంటూ ఈ ఏడాది ప్రారంభంలో కేంద్రం వివాదాస్పద నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. ఉపాధి వేతనాల చెల్లింపులను ఎస్సీ, ఎస్టీ, ఇతరులు అనే మూడు కేటగిరిలుగా విభజించాలని ఈ ఏడాది మార్చి 2న కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ నుంచి దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే, దీనిపై తమిళనాడు, కర్నాటకతో పాటు పలు రాష్ట్రాలు అభ్యంతరం తెలిపాయి. కేంద్రం నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. కాగా, ఈ విషయంలో ఇటీవల జరిగిన సమావేశంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ లతో పాటు నిటి ఆయోగ్, కేంద్ర సామాజిక, న్యాయ మంత్రిత్వ శాఖ అధికారులు హాజరై వివాదాస్పద ఉత్తర్వును వెనక్కి తీసుకోవాలన్న నిర్ణయాన్ని సంయుక్తంగా తీసుకున్నారు. అలాగే, ఒక ఖాతా ద్వారా వేతనాలు చెల్లించే పాత విధానాన్నే పునరుద్ధరించారు. ఈ విషయాన్ని ఒక సీనియర్ అధికారి తెలిపారు.