Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాం
- నేను పూర్తి బాధ్యతల అధ్యక్షురాలినే : సీడబ్ల్యూసీ సమావేశంలో సోనియా గాంధీ
న్యూఢిల్లీ : ఆర్థిక పునరుద్ధరణ పేరుతో జాతీయ ఆస్తులను అమ్మేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ విమర్శించారు. ప్రభుత్వ రంగం కేవలం వ్యూహాత్మక, ఆర్థిక లక్ష్యాలను మాత్రమే కలిగి లేదనీ, అందులో సామాజిక లక్ష్యాలు దాగి ఉన్నాయని స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ వర్గాల సాధికారిత, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి ప్రభుత్వం సంస్థల లక్ష్యాల్లో దాగి ఉందని పేర్కొన్నారు. అన్ని అమ్మేయడమే బీజేపీ సింగిల్ పాయింట్ ఎజెండా అని తెలిపారు.శనివారం నాడిక్కడ ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ''మనం అనేక సవాళ్లను ఎదుర్కొన్నాం. అయినప్పటికీ ఐక్యంగానే ఉన్నాం'' అని సోనియా చెప్పారు. రైతు ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో సమావేశమయ్యమనీ, మూడు నల్ల రైతు వ్యతిరేక చట్టాలు బలవంతంగా రైతులపై రుద్దబడి ఏడాది అయిందని పేర్కొన్నారు. ఆ చట్టాలపై చట్టపరమైన పరిశీలనకు తమ వంతు ప్రయత్నం చేశామనీ, అయితే మోడీ సర్కార్ కొన్ని ప్రయివేట్ కంపెనీల ప్రయోజనాల కోసమే పార్లమెంట్లో చట్టాలను ఆమోదించుకుందని విమర్శించారు. రైతు ఉద్యమంలో అనేక మంది రైతులు మరణించారని వివరించారు. ఇటీవలి లఖింపూర్ ఖేరీలో జరిగిన ఘటన బీజేపీ మనస్తత్వాన్ని స్పష్టం చేసిందని పేర్కొన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు, ఆహారం, ఇంధన ధరలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయని అన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు రూ.100పైగా ఉన్నదనీ, వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.900, వంట నూనె లీటర్ రూ.200 చేరుకుందని అన్నారు. ఇలా ధరలు పెరగడం దేశంలో ఎవరైనా, ఎప్పుడైనా ఊహించారా? అని ప్రశ్నించారు. ధరల పెరుగుదల ప్రజల జీవితాన్ని భరించలేనిదిగా చేస్తున్నాయని వివరించారు. సహకార సమాఖ్య వ్యవస్థ కేవలం నినాదంగానే ఉందని, బీజేపీ యేతర రాష్ట్రాలకు అవకాశాలు ఇవ్వటం లేదని విమర్శించారు. ఇటీవలి జమ్మూ కాశ్మీర్లో హఠాత్తుగా హత్యలు జరుగుతున్నాయని, వీటిని తీవ్రంగా ఖండించాలని అన్నారు. జమ్మూకాశ్మీర్ రెండేండ్లుగా కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్నదనీ, ఈ అనాగరిక నేరాలకు పాల్పడినవారిని న్యాయస్థానానికి తీసుకువచ్చే పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. రాబోయే వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలు ప్రారంభమయ్యాయని అన్నారు. కాంగ్రెస్కు పూర్వవైభవం రావాలని పార్టీ నేతలంతా కోరుకుంటున్నారని, అయితే దీని కోసం ఐకమత్యం అవసరమనీ, పార్టీ ప్రయోజనాలకు పెద్ద పీట వేయడం ముఖ్యమని తెలిపారు. పార్టీకి పూర్తి కాలపు అధ్యక్షురాలిని తానేననీ, తాను చురుగ్గా పని చేస్తున్నానని చెప్పారు. తాను నిజాయితీని ఇష్టపడతానని, తనకు ఏదైనా చెప్పాలనుకుంటే, మీడియా ద్వారా తనతో మాట్లాడవలసిన అవసరం లేదని హితవు పలికారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు అశోక్ గెహ్లాట్ (రాజస్థాన్), భూపేష్ బాఘెల్ (ఛత్తీస్గఢ్), చరణ్జిత్ చన్ని (పంజాబ్), రాజ్యసభ ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే, లోక్సభ పక్షనేత అధిర్ రంజన్ చౌదరి, సీనియర్ నేతలు ఎకె అంటోని, అంబికా సోని, గులాం నబీ ఆజాద్, కెసి వేణుగోపాల్, చిదంబరం, హరీష్ రావత్, ఆనంద్ శర్మ, సల్మాన్ ఖుర్షీద్, జైరాం రమేష్ పాల్గొన్నారు. అదేవిధంగా గత ఏడాది సోనియా గాంధీకి లేఖ రాసిన 23 మంది కాంగ్రెస్ నేతల్లో గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. అనారోగ్యం కారణంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హాజరుకాలేదు.
2022 ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 20 వరకు ఏఐసీసీ అధ్యక్ష ఎన్నిక
2022 ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 20 వరకు ఏఐసీసీ అధ్యక్ష ఎన్నిక నిర్వహణ జరుగుతుంది. ఈ మేరకు సీడబ్ల్యూసీ సమావేశంలో తీర్మానం చేశారు. సమావేశ అనంతరం కెసి వేణుగోపాల్, రణదీప్ సింగ్ సుర్జేవాలా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. పార్టీ శిక్షణా కార్యక్రమాల్లో భాగంగా పార్టీ సిద్ధాంతాలు, విధానాలు, కాంగ్రెసు కార్యకర్తల నుంచి పార్టీ ఆశిస్తున్న అంచనాలు, ఎన్నికల నిర్వహణ, ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలు, ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన విధానంపై చర్చిస్తామని పేర్కొన్నారు. పార్టీ సంస్థాగత ఎన్నికల నిర్వహణ కార్యక్రమ వివరాలను తెలిపారు.