Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మన జీడీపీ లెక్కలు కరెక్టేనా?
- తప్పుడు 'మెథడాలజీ'తో తప్పుడు గణాంకాలు : ఆర్థిక నిపుణులు
- గత ఏడాది మొదటి త్రైమాసికంలో జీడీపీ 'మైనస్ 24.1శాతం'..
- ఈ ఏడాది క్యూ1లో జీడీపీ వృద్ధి 20.1శాతం సాధ్యమా?
- రకరకాల జిమ్మిక్కులతో గణాంకాల్ని మార్చుతోన్న కేంద్రం
లాక్డౌన్, కోవిడ్ పరిస్థితుల దెబ్బకు ఒక ప్రయివేటు ఉద్యోగి నెల ఆదాయం రూ.12 వేల నుంచి రూ.9వేలకు తగ్గింది. ఏడాది తర్వాత తిరిగి అతడు నెల ఆదాయం రూ.12వేలు పొందుతున్నాడు. నెల ఆదాయం రూ.3వేలు పెరిగిందని, వృద్ధి 25శాతముందని భావించవచ్చునా? మోడీ సర్కార్ లెక్క ప్రకారం ఇది వృద్ధే. దేశ జీడీపీ గణాంకాల్ని కూడా ఇలాంటి జిమ్మిక్కులతో విడుదల చేస్తోందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
న్యూఢిల్లీ : ఒక భీకరమైన సంక్షోభం 'కోవిడ్-19' రూపంలో దేశాన్ని కుదిపేసింది. ఈనేపథ్యంలో భారత్ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే మోడీ సర్కార్ విడుదల చేస్తున్న 'జీడీపీ'(స్థూల దేశీయోత్పత్తి) సమాచారంలో సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రం విడుదల చేస్తున్న జీడీపీ గణాంకాలు సందేహాస్పదంగా ఉన్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
గత ఆర్థిక సంవత్సరం (2020-21) మొదటి త్రైమాసికంలో జీడీపీ 24.1శాతం క్షీణించింది. ఉదాహరణకు స్థూల దేశియోత్పత్తి మొత్తం రూ.100లక్షల కోట్లు ఉందనుకుంటే..2020-21 (క్యూ1)లో 85.9లక్షల కోట్లుగా నమోదైందని అర్థం. రెండో వేవ్ అనంతరం ఆర్థిక కార్యకలాపాలు పుంజుకొని 2021-22(క్యూ1)లో తిరిగి రూ.94లక్షల కోట్లకు చేరుకుంటే..దానిని వృద్ధిగా భావిస్తామా? ఆర్థిక నిపుణుల లెక్క ప్రకారం దానిని వృద్ధిగా భావించలేం. కానీ మోడీ సర్కార్ మాత్రం జీడీపీ గణాంకాలు పెరిగినట్టుగా చూపుతోంది.
ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో జీడీపీలో వృద్ధి 20.1శాతంగా కేంద్రం లెక్కగట్టడం నమ్మశక్యంగా లేదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. కోవిడ్ నుంచి దేశం పూర్తిగా కోలుకోలేదన్న విషయం తెలిసిందే. అనేక రంగాలు ముఖ్యంగా అసంఘటిత రంగంలో వందలాది పరిశ్రమలు మూతపడ్డాయి. ఇంకా ఆ పరిస్థితి కొనసాగుతున్నా, 20.1శాతం వృద్ధి నమోదైందని అంచనా కట్టింది. ప్రస్తుతం దేశంలో నెలకొన్న ఆర్థిక పరిస్థితుల్ని తాజా జీడీపీ గణాంకం ఏమాత్రమూ ప్రతిబింబించటం లేదని, జీడీపీని లెక్కగట్టడంలో ఎంచుకున్న 'మెథడాలజీ' సరైంది కాదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
త్రైమాసిక జీడీపీ గణాంకాలు
సంఘటితరంగంలో కొన్ని ముఖ్యమైన రంగాల్ని పరిగణనలోకి తీసుకొని కేంద్రం గణాంకాల్ని రూపొందిస్తోంది. మరో అంశం...కొన్ని కార్పొరేట్ కంపెనీల వృద్ధిని జీడీపీలోకి తీసుకుంటోంది. వాటితో త్రైమాసిక జీడీపీలను విడుదల చేస్తోంది. వార్షిక జీడీపీ గణాంకాలను మోడీ సర్కార్ పూర్తిగా పక్కకు పెట్టింది. త్రైమాసిక జీడీపీ గణాంకాల్ని అంత క్రితం ఏడాదితో పోల్చలేమని, తద్వారా ఆర్థిక వ్యవస్థ మెరుగుపడిందా? సంక్షోభంలో ఉందా? అన్నది సరిగ్గా అంచనావేయలేమని నిపుణులు చెబుతున్నారు.
ఆర్బీఐ సర్వేలో..
సంఘటితరంగంపై సర్వే చేసిన ఆర్బీఐ, దేశంలో వినియోగ సామర్థ్యం 63శాతం పడిపోయిందని జనవరి 2021లో తేల్చింది. అంతేగాక వృద్ధి రేటు 10శాతం పడిపోయిందని తెలిపింది. ఇదిలా ఉండగా సంఘటితరంగంలో 1.3శాతం వృద్ధి నమోదుచేసిందని జీడీపీ గణాంకాల్లో కేంద్రం చూపింది. అలాగే విని యోగదారుల సెంటిమెంట్ కోవిడ్-19 ముందుస్థాయికి చేరు కోలేదని స్పష్టమైన సమాచారమున్నా, 2021-22 క్యూ1లో జీడీపీ 20.1శాతం వృద్ధి నమోదుచేయటం నమ్మశక్యం కావటం లేదని ప్రముఖ ఆర్థికవేత్త ప్రొఫెసర్ అరుణ్ కుమార్ అన్నారు.
ప్రపంచబ్యాంక్, ఆర్బీఐ గణాంకాల్లోనూ..
మోడీ సర్కార్ విడుదల చేసిన త్రైమాసిక జీడీపీ డాటాతోనే ఆర్బీఐ, ప్రపంచబ్యాంక్ జీడీపీ గణాంకాలు విడుదల చేశాయని నిపుణులు చెబుతున్నారు. నోట్లరద్దు తర్వాత (2016-17లో) కూడా ఇలాగే లోపభూయిష్టమైన మెథ డాలజీతో కేంద్రం జీడీపీ గణాంకాల్ని రూపొందించిందని గుర్తుచేస్తున్నారు. నోట్ల రద్దు నిర్ణయం కారణంగా దేశం ఆర్థికంగా ఎంతో నష్టపోయింది, అనేక పరిశ్రమలు మూతపడ్డాయి. ముఖ్యంగా అసంఘటితరంగం ధ్వంసమైంది. ఆర్థిక వ్యవస్థ తీవ్రస్థాయిలో ప్రభావితమైంది. అయినప్పటికీ 2016-17లో జీడీపీ వృద్ధి 8.3శాతంగా ఉందని కేంద్రం చూపింది. ఈ విధమైన జీడీపీ లెక్కింపుపై సర్వత్రా అనుమానాలు ఉన్నాయి. ఓ వైపు తీవ్ర ఆర్థికమాంద్యం, సంక్షోభం నెలకొంటే..దేశంలో వృద్ధి ఎలా నమోదవుతుందో ఎవ్వరికీ అర్థం కావటం లేదు. కేంద్రం ఎంచుకున్న 'మెథడాలజీ' సరైంది కాదని 2015 నుంచి చర్చసాగుతోంది. ఉదాహరణకు, కార్పొరేట్ సంబంధాలపై కేంద్రం 'ఎంసీఏ-21' సమాచారాన్ని విడుదల చేసింది. ఇందులో ఎన్నో ఊరుపేరులేని కంపెనీలున్నాయి. షెల్ కంపెనీలున్నాయి. వీటిని పరిగణనలోకి తీసుకొని కేంద్రం జీడీపీ గణిస్తోంది.