Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఢిల్లీ హైకోర్టుకు సుప్రీం ఆదేశం
న్యూఢిల్లీ : ప్రభుత్వ భద్రతా, నిఘా సంస్థలకు సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) వర్తిస్తుందా? లేక మినహాయింపు ఉందా? అనే దానిపై ముందుగా నిర్ణయం తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. సీనియారిటీ, ప్రమోషన్లకు సంబంధించిన సమాచారాన్ని ఉద్యోగికి అందించాలని ఒక డిపార్ట్మెంట్ను ఆదేశిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇటీవల ఇచ్చిన ఉత్వర్వులను సర్వోన్నత న్యాయస్థానం ఈ సందర్భంగా పక్కనపెట్టింది. చట్టంలోని సెక్షన్ 24 (1) ప్రకారం.. ఆర్టీఐ తమకు వర్తించదని ఆ ప్రభుత్వ విభాగ అభ్యంతరాన్ని పరిగణనలోకి తీసుకోకుండా హైకోర్టు ఆదేశాలు జారీచేసిందని జస్టిస్ ఎంఆర్ షా, ఎఎస్ బోపన్నలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. అసలు ఆర్టీఐ వర్తింపుపై నిర్ణయం తీసుకోకుండా ఆర్టీఐ కింద కోరిన పత్రాలను సమర్పించాలని అప్పీల్దారును ఆదేశించడం గుర్రం ముందు బండి పెట్టినట్లే ఉందని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో అసలు ముందుగా అప్పీలుదారు సంస్థ/విభాగానికి ఆర్టీఐ చట్టం వర్తింపుపై నిర్ణయం తీసుకోవాలని, ఈ మొత్తం ప్రక్రియను ఎనిమిది వారాల్లోగా పూర్తి చేయాలని ఢిల్లీ హైకోర్టును సుప్రీం ధర్మాసనం తాజాగా ఆదేశించింది. 15 రోజుల్లోగా ఆర్టిఐ కింద ఉద్యోగికి సమాచారం ఇవ్వాలని ఆదేశిస్తూ ఢిల్లీ హైకోర్టు 2018లో ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ కేంద్రం దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది.