Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : రానున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి ప్రియాంక గాంధీ వాద్రా నేతృత్వం వహించనున్నారు. ఈ విషయాన్ని యూపీ ఎన్నికల కోసం నూతనంగా ఏర్పాటు చేసిన ప్రచార కమిటీ చీఫ్ పిఎల్ పునియా వెల్లడించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ప్రియాంక గాంధీ కంటే ప్రాచుర్యం కలిగిన రాజకీయ నాయకులు లేరని పునియా ప్రశంసించారు. 2022లో నిర్వహించే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం 20 మందితో ప్రచార కమిటీని కాంగ్రెస్ శుక్రవారం ప్రకటించింది. కమిటీ చీఫ్గా ఎంపికైన పునియా మీడియాతో మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో పోటీ ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ మధ్య ఉంటుందని చెప్పారు. సమాజ్వాదీ పార్టీ, బహుజన్ సమాజ్వాదీ పార్టీలకు కాలం చెల్లిపోయిందని అన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి ప్రియాంక గాంధీ వంటి వ్యక్త్తిత్వం ఉన్న నేత అవసరమని చెప్పారు. ప్రియాంక అన్ని అంశాలపై పోరాడుతూ, విజయం సాధిస్తున్నారని తెలిపారు. లఖింపూర్ ఖేరి ఘటన తెలిసి వెంటనే తక్షణమే ఆమె బాధితుల కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వెళ్తూ సీతాపూర్లో నిర్భంధించబడినా న్యాయం కోసం నిలబడ్డారని అన్నారు. బహ్రియిచ్, సొంభద్ర, ఉన్నావో, హథ్రాస్ ఘటనల్లోనూ న్యాయం కోసం పోరాడారని చెప్పారు. 'ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజలంతా ఆమెను అభిమానిస్తున్నారు. ప్రస్తుతం ప్రియాంక కన్నా ప్రాచుర్యం ఉన్న రాజకీయవేత్త లేడు. ప్రచారానికి ప్రియాంక గాంధీ అందుబాటులో ఉండటం మా అదృష్టం' అని పునియా అన్నారు. కాంగ్రెస్ పార్టీ చాలా అరుదుగా మాత్రమే ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తుందని, ప్రకటించకపోవడం వల్ల పార్టీకి ఇబ్బందేమీ లేదని చెప్పారు.