Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆరోగ్యరంగ నిపుణుల అంచనా
న్యూఢిల్లీ: కోవిడ్-19 నుంచి కోలుకున్న తర్వాత కొందరిని దీర్ఘకాలం పాటు కరోనా లక్షణాలు వేధిస్తున్నట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. లాంగ్ కోవిడ్‌గా పిలిచే ఈ దుష్ప్రభావాలు కొందరిలో 6నెలలపైగా ఉంటున్నట్టు తెలుస్తున్నది. అయితే తీవ్ర కోవిడ్ మాదిరిగా లాంగ్ కోవిడ్ ప్రాణాంతకం కాకపోవచ్చని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. కొన్నిరోజుల తర్వాత అటువంటి బాధితులు పూర్తిగా కోలుకునే అవకాశం ఉన్నదనీ.. కేవలం మధుమేహం, కిడ్నీ వంటి సమస్యలున్న వారిపైనే తీవ్ర ప్రభావం చూపించే ప్రమాదం ఉన్నదని ఆరోగ్యరంగ నిపుణులు వెల్లడిస్తున్నారు.
తీవ్రత స్వల్పమే..?
కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత కూడా కొందరు బాధితులు మరోసారి దవాఖానాలో చేరుతున్నట్టు ఢిల్లీలోని యానివర్సిటీ కాలేజీ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ ఖాన్ అమీర్ మరూఫ్ పేర్కొన్నారు. 'రెండు లేదా అంతకంటే ఎక్కువ నెలలపాటు కోవిడ్ లక్షణాలు వేధిస్తున్నట్టయితే వాటిని పోస్ట్ కోవిడ్, పోస్ట్ అక్యూట్ కోవిడ్ సిండ్రోమ్, క్రానిక్ కోవిడ్ వంటి పేర్లతో వ్యవహరిస్తున్నాం. అయితే, వీటివల్ల తీవ్ర ప్రభావాలు కలిగే ఆస్కారం తక్కువగానే ఉంటుంది. అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కీళ్ల నొప్పులు, జుట్టు ఊడిపోవడం వంటి లక్షణాలు కనిస్తాయి' అని డాక్టర్ ఖాన్ పేర్కొన్నారు. వీటి ప్రభావాలపై మాత్రం మరింత పరిశోధన జరగాల్సిన అవసరం ఉన్నదన్నారు.
30శాతం కేసుల్లోనే..
కోవిడ్-19తో పోలిస్తే లాంగ్ కోవిడ్ అంత ప్రమాదకరమైనదే కాదని కానీ, అంతకుముందే మధుమేహం, కిడ్నీ, క్షయ వంటి ఆరోగ్య సమస్యలున్న వారిపైనే ఎక్కువ ప్రభావం చూపే ప్రమాదం ఉన్నదని శ్వాసకోస నిపుణులు డాక్టర్ శిభు విజయన్ పేర్కొన్నారు. కొవిడ్ తర్వాత టీబీ కేసుల్లో పెరుగుదల కనిపించిన విషయాన్ని గుర్తు చేశారు. కోవిడ్ లక్షణాలతో ఆస్పత్రిపాలైన వారిలో 30శాతం బాధితుల్లో అలసట, దగ్గు, ఛాతి బరువుగా మారడం, గుండె దడ, కండరాల నొప్పి వంటి (లాంగ్ కోవిడ్) లక్షణాలు ఉన్నట్టు భారత్‌లో చేపట్టిన అధ్యయనాలు వెల్లడిస్తున్నాయని డాక్టర్ విజయన్ చెప్పారు.
టీకాతో మెరుగైన ఫలితాలు..
లాంగ్ కోవిడ్ లక్షణాలు ఉన్నప్పటికీ టీకా తీసుకున్న తర్వాత అవి క్రమంగా తగ్గపోతున్నట్టు గురుగావ్‌లోని పరాస్ ఆస్పత్రికి చెందిన శ్వాసకోశ నిపుణులు డాక్టర్ అనురేష్ కుమార్ పేర్కొన్నారు. టీకా తీసుకోవడం వల్ల శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటుందని చెప్పారు. అంతేకాకుండా వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా కొవిడ్‌ను ఎదుర్కోవడంతోపాటే లాంగ్ కోవిడ్‌ను కూడా నివారించవచ్చని మరో వైద్య నిపుణుడు డాక్టర్ మారుఫ్ పేర్కొన్నారు.
ఇదిలాఉంటే, పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్, లేదా లాంగ్ కోవిడ్ అనేది వాస్తవమని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇదివరకే నిర్ధారించింది. అయితే, ఆ లక్షణాలు ఎంతకాలం ఉంటాయనే విషయాన్ని కచ్చితంగా చెప్పలేమని తెలిపింది. జబ్బు నుంచి కోలుకున్నప్పటికీ రెండు నెలలకు పైగా లక్షణాలు కొనసాగితే వాటిని లాంగ్ కొవిడ్‌గా పరిగణించవచ్చని పేర్కొంది. దీర్ఘ కాలం కొవిడ్ ప్రభావాలతో బాధపడుతున్న వారికి ప్రత్యేక కార్యక్రమాలతో మెరుగైన ఆరోగ్య వసతులు కల్పించడంతో పాటు పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్ గురించి మరింత సమాచారం తెలుసుకునేందుకు కృషి చేస్తున్నామని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ మధ్యే వెల్లడించింది.