Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నెలరోజులపాటు సమావేశాలు..
న్యూఢిల్లీ. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ 22 నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. దాదాపు నెల రోజుల పాటు జరిగే ఈ సమావేశాలు డిసెంబర్ 23తో ముగిసే అవకాశాలు ఉన్నాయి. నవంబర్ నాలుగో వారంలో పార్లమెంట్ శీతాకాల సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రభుత్వ విశ్వనీయ సమాచారం ప్రకారం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ శీతాకాల సమావేశాలను నవంబర్ 22న ప్రారంభించి, డిసెంబర్ 23న ముగించాలని సూచించింది. నవంబర్ 15న సమావేశాలు ప్రారంభించే ప్రతిపాదన కూడా ఉంది. ''శీతాకాల సమావేశాలు కనీసం ఒక నెల వ్యవధిలో ఉంటాయి. ఇది ఒక నెల కంటే ఎక్కువ కాలం ఉండాలనే సూచన కూడా ఉంది'' అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే దీనిని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వర్గ కమిటీ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా ఉభయ సభల్లో ముందుకు తీసుకురావాలనుకుంటున్న అంశాల ఎజెండాను పంపాలని కేంద్ర మంత్రిత్వ శాఖలను కోరింది. ఈ ఎజెండాలో డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీలతో కూడిన బిల్లులు, ఒక సభ ఆమోదించిన బిల్లులు, కొత్త బిల్లులు ఉంటాయి.
పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆరోగ్య మంత్రిత్వ శాఖతో కోవిడ్ -19 ప్రోటోకాల్‌కు సంబంధించి చర్చించడం ప్రారంభించింది. వర్షాకాల సెషన్లో అనుసరించే ప్రోటోకాల్‌నే కేంద్రం కొనసాగించే అవకాశం ఉంది. పూర్తిగా టీకాలు వేసిన సభ్యులు పార్లమెంటుకు హాజరు కావడానికి ఆర్టీపీసీఆర్ పరీక్ష అవసరం అనే నిబంధనను కేంద్రం రద్దు చేసింది. లోక్‌సభ, రాజ్యసభ సచివాలయాల్లో వ్యాక్సిన్ వేసుకోని సిబ్బంది వివరాలను ఆరోగ్య మంత్రిత్వ శాఖ కోరింది. ఒక సీనియర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారి ''మేం ఎంపీలపై తనిఖీ చేశాం. సభ్యులందరూ పూర్తిగా టీకాలు వేసినట్టు గుర్తించాం. వర్షాకాల సమావేశాల్లో వేసుకోనివారు కూడా ఇప్పుడు వ్యాక్సిన్ వేసుకున్నారు'' అని పేర్కొన్నారు.
కోవిడ్ షురూ అయ్యాక నాలుగోసారి..
కోవిడ్-19 ప్రారంభమైన తరువాత ఇది నాలుగో పార్లమెంట్ సమావేశాలు. మహమ్మారి తరువాత మొదటి సెషన్ సెప్టెంబర్ 2020లో జరిగింది. అనేక మంది సభ్యులు వైరస్ బారిన పడిన తరువాత, సెషన్ షెడ్యూల్‌ను కుదించారు. ప్రభుత్వం 2020లో శీతాకాల సమావేశాలను నిర్వహించకూడదని నిర్ణయించుకున్నది. బడ్జెట్ సెషన్ జనవరిలో జరిగింది. కానీ కేసులు పెరుగుతున్నందున కుదించబడింది. కోవిడ్ -19 తరువాత వర్షాకాల సెషన్ మూడవ సెషన్, అయితే పెగాసస్ స్పైవేర్, రైతు సమస్యలు సహా పలు అంశాలపై ఉభయ సభలు తుడిచిపెట్టుకుపోయాయి.