Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లఖింపూర్‌లో రైతుల మారణకాండకు నిరసనగా..: కేంద్రమంత్రి అజరు మిశ్రాను పదవినుంచి తొలగించి,అరెస్టు చేయాలి: ఎస్కేఎం
న్యూఢిల్లీ: లఖింపూర్ ఖేరీ రైతుల మారణకాండలో ప్రధాన పాత్ర పోషించిన కేంద్ర హౌం సహాయ మంత్రి అజరు మిశ్రాను పదవి నుంచి తొలగించాలనీ, ఆయనను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ నేడు (సోమవారం) దేశవ్యాప్త రైల్‌రోకో ఆందోళనకు పిలుపు ఇచ్చింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆరు గంటల పాటు రైలు దిగ్బంధం చేయాలని అన్ని రైతు సంఘాలకు ఎస్కేఎం పిలుపు ఇచ్చింది. ఈ ఆందోళన ఏ విధమైన విధ్వంసం, రైల్వే ఆస్తికి ఎలాంటి నష్టం జరగకుండా శాంతియుతంగా చేపట్టాలని కోరింది. ఉత్తరప్రదేశ్‌లో డజన్ల కొద్దీ ప్రాంతాల్లో అనేక మంది రైతు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీన్ని ఎస్కేఎం ఖండించింది. సామాన్య పౌరుల నిరసన హక్కును అణచివేయొద్దని కోరింది. ప్రధాని మోడీ వారణాసి పర్యటనలో భాగంగా అక్కడ రైతు నేతలను గృహ నిర్బంధం చేశారు. గత ఐదు రోజులుగా రైతు నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. లఖింపూర్ ఖేరీ రైతుల మారణకాండ అమరవీరుల షహీద్ కలశ్ యాత్రలు ప్రస్తుతం ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్‌తో సహా ఇతర ప్రాంతాల్లో జరుగుతున్నాయి.
రైతుల నిరసనతో గవర్నర్ పర్యటన రద్దు
రాజస్థాన్‌లోని సికార్‌లో స్థానిక రైతుల నల్ల జెండాలతో నిరసన అల్టిమేటం జారీ చేయడంతో స్థానిక బీజేపీ ఎంపీ నిర్వహిస్తున్న గవర్నర్ కార్యక్రమాన్ని రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ఎంపీ వైదిక్ ఆశ్రమంలో ''యజ్ఞం'' లో పాల్గొంటే... గట్టిగా ప్రతిఘటిస్తామని రైతులు హెచ్చరించారు. గ్రామంలోని బీజేపీ నాయకుడు ఆక్రమించిన భూమిపై ఆశ్రమాన్ని నిర్మించారని రైతులు విమర్శించారు. రైతు ఆందోళనల నేపథ్యంలో గవర్నర్ కలరాజ్ మిశ్రా కార్యక్రమంలో పాల్గొనడాన్ని రద్దు చేసుకున్నారు.
సింఘూ హత్య కేసులో మరో ముగ్గురు నిందితులు.. ఆరు రోజుల కస్టడీ
సింఘూ సరిహద్దు వద్ద ఒక వ్యవసాయ కూలీ హత్య కేసులో ముగ్గురు నిందితులు ఆరు రోజుల పాటు పోలీసుల కస్టడీకి తరలించారు. ఈ మేరకు ఆదివారం హర్యానాలోని సోనిపట్ జిల్లా కోర్టు నిహాంగ్ సంస్థకు చెందిన ముగ్గురు నిందితులను పోలీసు కస్టడీకి పంపించింది. జూనియర్ డివిజనల్ జడ్జి కిమ్మి సింగ్లా కోర్టు ముందు నిందితులు నారాయణ్ సింగ్, భగవంత్ సింగ్, గోవింద్ ప్రీత్‌లను హాజరుపరిచారు. ముగ్గురు నిందితులను 14 రోజుల కస్టడీకి పోలీసులు కోరారు. ఇతర నిందితుల గుర్తింపు కోసం మరో నిందితుడు సరబ్జిత్ సింగ్‌తో పాటు ముగ్గురు నిందితులను హర్యానా పోలీసులు పంజాబ్‌కు తీసుకువెళతారు. సరబ్జిత్ సింగ్ ఇప్పటికే ఏడు రోజుల పోలీసు కస్టడీలో ఉన్నారు. హర్యానా పోలీసులు హత్యకు సంబంధించిన సాక్ష్యాలను, రక్తం తడిసిన బట్టలు ఇంకా స్వాధీనం చేసుకోలేదనీ, దీని కోసం నిందితులను నేర స్థలానికి తీసుకెళ్లాల్సి ఉంటుందని కోర్టుకు తెలిపారు. శనివారం సాయంత్రం నారాయణ సింగ్ అమృత్‌సర్‌లో లొంగిపోయారు . గోవింద్ ప్రీత్, భగవంత్ సింగ్ అనే మరో ఇద్దరు నిహాంగ్‌లు కుండ్లిలో లొంగిపోయారు. హర్యానా పోలీసులు వారిని విచారణ కోసం తీసుకెళ్లారు. తరువాత వారిని అధికారికంగా అరెస్టు చేశారు.