Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్ ఆరోపణలు అర్థరహితం : 'ఆకలి సూచిక' సలహాదారు మిరియం వీమర్స్
- టెలిఫోన్ ఒపీనియన్ పోల్ ద్వారా ర్యాంకింగ్ ఇవ్వలేదు..
- ఆహార పంపిణీ గణాంకాల ఆధారంగా ర్యాంకింగ్ ఇచ్చామని వెల్లడి
న్యూఢిల్లీ : 'ప్రపంచ ఆకలి సూచిక'(జీహెచ్ఐ) ర్యాంకింగ్స్‌పై భారత్ చేసిన ఆరోపణల్ని జర్మనీకి చెందిన ఎన్జీఓ సంస్థ 'వెల్త్హంగర్హైఫ్'(డబ్ల్యూహెచ్హెచ్) అర్థరహితమని పేర్కొంది. ఆకలి సమస్య, పోషకాహార లోపం..రెండింటికీ తేడా ఉందని, అవి రెండూ ఒకటేనని భారత్ వాదిస్తోందని డబ్ల్యూహెచ్హెచ్ తెలిపింది. ఈ ఏడాది జీహెచ్ఐ మొత్తం 116 దేశాలకు ర్యాంకింగ్స్ విడుదల చేయగా, అందులో భారత్‌కు 101 స్థానం దక్కింది. దీనిపై మోడీ సర్కార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జీహెచ్ఐ రూపకల్పనలో ఉపయోగించిన 'మెథడాలజీ' అశాస్త్రీయంగా ఉందని ఆరోపించింది. టెలిఫోన్లో ఏవో నాలుగు ప్రశ్నలు అడిగి, అందులో ఒకదాన్ని పట్టుకొని జీహెచ్ఐ ర్యాంకింగ్స్ విడుదల చేశారని కేంద్రం తప్పుబట్టింది. నివేదికను రూపొందించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత్ ఆరోపణల్ని జీహెచ్ఐ ఖండించింది. టెలిఫోన్ ద్వారా ఒపీనియన్ పోల్ నిర్వహించి భారత్‌కు ర్యాంకింగ్ ఇవ్వలేదని జీహెచ్ఐ సలహాదారు మిరియం వీమర్స్ జాతీయ ఆంగ్ల దినపత్రికకు రాసిన ఈమెయిల్లో పేర్కొన్నారు. జీహెచ్ఐ ర్యాంకింగ్‌పై భారత్ చెత్త ఆరోపణలు చేసిందని కొట్టిపారేశారు. దేశంలో ఆకలి సమస్యను భారత్ సరిగ్గా అర్థం చేసుకోలేకపోతోందని, పోషకాహారం పొందలేనివారి సంఖ్య భారత్‌లో పెరుగుతున్న విషయం జీహెచ్ఐ నివేదిక సూచిస్తోందని అన్నారు.
''ఆహార అభద్రతపై టెలిఫోన్ ద్వారా జరిపిన ఒపీనియన్ పోల్స్‌ను జీహెచ్ఐ ర్యాంకింగ్‌లో పరిగణలోకి తీసుకోలేదు. ప్రతి దేశంలో ఆహార పంపిణీ, సమతుల్యత గణాంకాల సమాచారాన్ని పరిగణలోకి తీసుకున్నా''మని వీమర్స్ తెలిపారు. ఎత్తు, బరువు ఆధారంగా 'పోషకాహార సూచిక'ను తయారుచేసి ఉండాల్సిందని కేంద్రంలోని మహిళ, శిశుఅభివృద్ధి శాఖ జీహెచ్ఐ సూచికను తప్పుబట్టింది. దీనిపై వీమర్స్ మాట్లాడుతూ..''పోషకాహారలోపం, ఆకలి సమస్య రెండూ వేరు వేరు. దేశంలో ఆహార పంపిణీని బట్టి ఆకలి సమస్యను గణించవచ్చు. అంతేగానీ ఇది ఎత్తుకు తగిన బరువు..అనేది కాదు'' అని అన్నారు. ప్రపంచ ఆకలి సూచిక ర్యాంకింగ్స్‌ను కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ గతంలో తప్పుబట్టారు. జీహెచ్ఐ సూచికలో అనేక లోపాలున్నాయని పార్లమెంట్లో చెప్పారు.
స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల్లో ఒకటి : వీమర్స్
దేశంలో ఆకలి సమస్యను పరిష్కరించటమన్నది 'స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల్లో' ఒకటి. ఐరాస నిర్దేశించిన ఈ లక్ష్యాన్ని సాధించాల్సిన దేశాల్లో భారత్ కూడా ఒకటి. లక్ష్యం దిశగా వెళ్తున్నామా? లేదా? అన్నది తెలుసుకోవటానికి జీహెచ్ఐ ర్యాంకింగ్స్ ఉపయోగపడతాయి. ఈ ర్యాంకింగ్స్‌ను అంతర్జాతీయ నిపుణులు లెక్కలోకి తీసుకుంటారు. దేశంలో ప్రజలందరికీ సురక్షితమైన పోషకాహారం, సరిపడా ఆహారం లభిస్తుందా? లేదా? అన్నది జీహెచ్ఐ పరిగణలోకి తీసుకుంటుంది.