Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడు రెట్లు పెంచి విద్యుత్ అమ్మకం
- యూనిట్ రూ.18 వసూలు చేస్తున్న హిందుస్తాన్, అదానీ, తీస్తా స్టేజ్
- అధిక టారీఫ్‌పై కేంద్రం హెచ్చరించినా పట్టించుకోని కంపెనీలు
న్యూఢిల్లీ : విద్యుత్ సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకుంటే, అధిక టారీఫ్ వద్ద విద్యుత్‌ను అమ్మితే..చూస్తూ ఊరుకోం. తీవ్ర చర్యలు ఉంటాయి...అంటూ మోడీ సర్కార్ చేసిన హెచ్చరికలు అంతా ఉత్తవేనని తేలిపోయింది. బొగ్గు కొరతపై కేంద్రం ముందస్తు ప్రణాళిక లేకపోవటం, సమస్య తన దృష్టికి వచ్చినా చూపిన నిర్లక్ష్యం...నేడు అనేక రాష్ట్రాలకు శాపంగా మారింది. అదానీ పవర్, టాటా పవర్, ఎస్సార్ పవర్, హిందుస్తాన్ పవర్, టీస్తా స్టేజ్..వంటి ప్రయివేటు కంపెనీలు విద్యుత్ ధరల్ని మూడు రెట్లు పెంచి అమ్ముతున్నాయి. బొగ్గు కొరత కారణంగా నేడు దేశంలో విద్యుత్ ఉత్పత్తి అంతా ఒక్కసారిగా తగ్గిపోయింది. దాంతో ప్రయివేటు కంపెనీలు అధిక టారీఫ్తో ఒక యూనిట్‌కు రూ.18 వద్ద విద్యుత్‌ను అమ్ముతూ లాభాలు పోగేసుకుంటున్నాయి. ఈ పరిస్థితిని కేంద్రం అడ్డుకోలేకపోతోంది.
దేశవ్యాప్తంగా బొగ్గు కొరత ఏర్పడిందని, దాదాపు 115 విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు కొరత ఉందని కేంద్ర ప్రభుత్వానికి చాలా రోజుల క్రితమే సమాచారమందింది. ఢిల్లీ, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, జార్ఖండ్..తదితర రాష్ట్రాల సీఎంలు ప్రధాని మోడీకి లేఖలు కూడా రాశారు. సమస్యపై వెంటనే దృష్టి సారించాలని, లేదంటే విద్యుత్ కోతలు విధించాల్సి వస్తుందని వారు లేఖలో పేర్కొన్నారు. బొగ్గు కొరత, విద్యుత్ సంక్షోభంపై రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేసే వరకు, హెచ్చరించే వరకూ కేంద్రంలో కదలిక రాలేదు. లక్షా 40వేల మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం గల 115 విద్యుత్ ప్లాంట్ల వద్ద బొగ్గు నిల్వలు సరిపడా లేవన్న సంగతి కేంద్రం ముందుగా గుర్తించ లేకపోయింది. ఈ ప్లాంట్ల వద్ద బొగ్గు నిల్వలు వారం రోజులకు మాత్రమే సరిపోతాయన్న విషయం చాలా ఆలస్యంగా బయటపడింది.
విద్యుత్ సంక్షోభంపై అన్నివైపుల నుంచి ఆందోళన వ్యక్తం అయ్యాకే, మోడీ సర్కార్‌లో చలనం మొదలైందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. బొగ్గును దిగుమతి చేసుకొని విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్న టాటా పవర్, అదానీ పవర్, ఎస్సార్ ఎనర్జీ, తీస్తా స్టేజ్-2, స్టేజ్-3..తదితర ప్రయివేటు కంపెనీల ప్రతినిధులను పిలిపించి కేంద్రం చర్చించింది. అధిక ధరలకు విద్యుత్‌ను అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఆయా రాష్ట్రాలు విద్యుత్ సంస్థలతో చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాల(పీపీఏ)ను కాదని బయట పవర్ ఎక్ఛ్సేంజీల్లో అమ్మితే సహించబోమని హెచ్చరించింది. స్వరాష్ట్రంలో విద్యుత్ కోతలు విధించి, విద్యుత్‌ను బయట అమ్మితే ఊరుకునేది లేదని కేంద్ర విద్యుత్ శాఖ కార్యదర్శి అలోక్ వర్మ ప్రకటించారు. అయితే ఈ హెచ్చరికల్ని ప్రయివేటు కంపెనీలు సీరియస్‌గా తీసుకోలేదని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
గత కొంత కాలంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బొగ్గు గనుల్లో తవ్వకాలకు ఆటంకాలు ఏర్పడ్డాయని, ఇదే బొగ్గు కొరతకు దారితీసిందని కేంద్రం చెబుతోంది. దసరా తర్వాత బొగ్గు సరఫరా పెరుగుతుందని, ఆ తర్వాత రెండు మూడు రోజుల్లో పరిస్థితి సాధారణ స్థితికి వస్తుందని రాష్ట్రాలకు కేంద్రం తెలియజేసిందని సమాచారం.