Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనా ప్రభావంతో అందని వైద్యం.. పెరిగిన టీబీ మరణాలు
- రాబోయే కాలంలో మరింత దారుణ పరిస్థితులు
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది. కరోనా కారణంగా వైద్యారోగ్య పరిస్థితులు దారుణంగా మారాయి. ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన గ్లోబల్ ట్యూబర్ క్యులోసిస్ రిపోర్ట్-2021లోని పలు విషయాలు గమనిస్తే.. ''కరోనా మహమ్మారి కారణంగా టీబీ నిర్ధారణ పరిక్షలు, వైద్య సౌకర్యాలు అందని కారణంగా దశాబ్ద కాలంలో మొదటిసారి టీబీ మరణాలు పెరిగాయి. టీబీతో బాధపడుతున్న వారిలో 2020లో సగానికిపైగా సంరక్షణ ప్రాప్యతను కోల్పోయారు. ఇదివరకటి సంవత్సరాల్లో సాధించిన పురోగతిని మళ్లీ తిరోగమనం దిశగా ముందుకు సాగింది. ఈ కారణంగా టీబీ రోగుల సంఖ్య మళ్లీ పెరిగింది. ఈ ప్రభావాలు 2021, 2022లో దారుణంగా ఉండే అవకాశాలున్నాయి'' అంటూ పేర్కొంది. ఇక ప్రపంచవ్యాప్తంగా టీబీ అంశాలను పరిగణలోకి తీసుకుంటే భారత్ స్థానం పెద్దగా మారలేదు. టీబీ వ్యతిరేక పోరులో ఇంకా వెనుకబడే ఉంది. 2020లో హెచ్ఐవీ నెటగివ్-టీబీ మరణాల్లో 38 శాతం, హెచ్ఐవీ నెగటివ్-పాజిటవ్ టీబీ మరణాల్లో 34 శాతం భారత్లో నమోదయ్యాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా నమోదైన టీబీ కేసుల్లో 26 శాతం భారత్లోనే ఉన్నాయి. ప్రపంచంలో టీబీ ప్రభావం అధికంగా ఉన్న టాప్-3 దేశాల్లో భారత్ ఒకటిగా కొనసాగుతోంది. గతేడాది టీబీ కేసుల నమోదులో చాలా తుగ్గదల కనిపించింది. టాప్-3లోని ఫిలిప్పీన్స్, ఇండోనేషియాలతో పోలిస్తే.. భారత్లో అధికంగా నమోదు పడిపోయింది. 2019-20లో భారత్లో ఏకంగా 41 శాతం కేసుల గుర్తింపు తగ్గిపోయింది. 2019లో ప్రపంచవ్యాప్తంగా 70 లక్షల కేసులు నిర్ధారణ కాగా, 2020లో 58 లక్షలకు పడిపోయింది. అయితే, ఇది నిర్ధారణ కానీ క్షయ రోగుల సంఖ్య గణనీయంగా పెరగడాన్ని సూచిస్తుంది. అలాగే, కరోనా సమయంలో వారికి సరైన వైద్య సౌకర్యాలు సైతం అందడం లేదని ఈ నివేదిక పేర్కొంది. ప్రస్తుతం 28 లక్షల మంది మాత్రమే చికిత్స పొందుతున్నారనీ, అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 28శాతం తగ్గుదల ఇది. 2020లో మొత్తం 15 లక్షల టీబీ మరణాలు సంభవించగా, అంతకు ముందు ఏడాది 14 లక్షలు నమోదయ్యాయి. ఒక్కఏడాదిలోనే లక్ష మరణాలు అధికం కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇదిలావుండగా, ప్రపంచంపై కరోనా విజృంభించక ముందే టీబీలో భారత్ అధిక కేసులు కలిగిన టాప్-10 దేశాల్లో ఒకటిగా ఉంది. 2019లో భారత్లో 26.4 లక్షల కేసులు ఉన్నాయి. ఒర సంవత్సరంలో 1.2 లక్షల కేసులతో మల్టీడ్రగ్ రెసిస్టెన్స్/రిఫాంపిసిన్-రెసిస్టెంట్ టీబీ కేసులు అత్యధికంగా ఉన్నాయి.హెచ్ఐవీ-టీబీ కేటగిరిలో కేసులు 2019లో 71 వేలకు పైగా కేసులతో దక్షిణాఫ్రికా తర్వాత రెండో స్థానంలో ఉంది. అయితే, డిసెంబర్ నాటికి పరిస్థితి మెరుగుపడిందని ఇండియా టీబీ రిపోర్టు 2021 పేర్కొంది. అయితే, నిక్షరు పోర్టల్ డేటా మాత్రం తక్కువ కేసులు (2.67లక్షలు) ఉన్నాయని చెబుతోంది. ఇక 2020 ఏడాది మే-జూన్లో 2.78 లక్షలుగా ఉన్నాయి. అయితే, దేశంలో ప్రస్తుత పరిస్థితులు గమనిస్తే.. టీబీ నిర్ధారణలు తగ్గడం, ఇప్పటికే చికిత్స పొందుతున్న వారికి వైద్యం అందకపోవడం, మందులు సైతం అందుబాటులో లేకపోవడం పరిస్థితులను మరింత దిగజారుస్తున్నాయి. ప్రభుత్వం టీబీ రోగులకు సంబంధించి తీసుకుంటున్న చర్యలు, వారికి అవసరమైన మందులను కొరత లేకుండా అందుబాటులో ఉంచడం, వారికి అందించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏమిటి? ఈ విషయంలో పనిచేస్తున్న పౌర సంఘాలకు మద్దతు ఇవ్వడానికి ప్రభుత్వం తీసుకుంటున్న కనీస చర్యలు ఏంటనే ప్రశ్నలను టీబీ కార్యకర్తలు, ఎన్జీవోలు లేవనెత్తుతున్నాయి.
ముంబయిలో ప్రతి ఏడాది 5-6 వేల కేసులు నివేదించబడతాయి. ఇందులో కొద్ది మంది మాత్రమే చికిత్సను పొందుతున్నారు. యూపీలో ప్రతి రేడు కేసుల్లో ఒకరు మాత్రమే వైద్యం పొందగలుగుతున్నారు. ఈ విషయం గురించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కార్యకర్తలు లేఖలు రాసిన పెద్దగా ఫలితం లేకుండా పోయిందని పేర్కొంటున్నారు. క్షేత్రస్థాయిలో ఇటువంటి లోటును పూడ్చకుండా ప్రభుత్వం ''2025 నాటికి టీబీ రహిత భారతాన్ని నిర్మిస్తామనడం'' అపహాస్యం చేయడమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.