Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేరళ, తమిళనాడు, కర్నాటకలో భారీ నుంచి అతిభారీ వర్షాలు
- అల్పపీడన ప్రభావం : వాతావరణ శాఖ
న్యూఢిల్లీ : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో దేశమంతా విస్తారంగా వర్షాలు కురవబోతున్నాయని భారత వాతావరణ శాఖ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. రాబోయో రెండు మూడు రోజులపాటు దాదాపు 22 రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. కేరళ, తమిళనాడు, పాండిచ్చెరి, కర్నాటకలో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. ఒడిశా కేంద్రంగా ఏర్పడ్డ అల్పపీడన ద్రోణి, బంగాళాఖాతం నుంచి వీస్తున్న గాలుల కారణంగా అక్టోబర్ 20-22 మధ్య ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ అంచనావేస్తోంది. అంతేగాక ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్‌లలోనూ ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు ఉంటాయని తెలిపింది. ''ప్రస్తుతం ఆకాశంలో రెండు అల్పపీడన ద్రోణులు ఏర్పడ్డాయి. మధ్యప్రదేశ్‌కు ఈశాన్యంగా ఒకటి, పశ్చిమ బెంగాల్‌కు దగ్గరగా మరోటి విస్తరించి ఉంది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి బయల్దేరిన మేఘాల కారణంగా నేడు ఢిల్లీ, దాని చుట్టుపక్కల భారీ వర్షాలు కురిసాయి. ఈ మేఘాలు చాలా చురుగ్గా కదులుతున్నాయి'' అని భారత వాతావరణ శాఖ శాస్త్రవేత్త నరేశ్ కుమార్ చెప్పారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..''ఈ మేఘాల వల్లే ఉత్తరాఖండ్, హిమాచల్, ఉత్తర హర్యానాలో వర్షాలు పడ్డాయి. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్‌లోనూ ఆ మేఘాలు ప్రవేశించాయి. కాబట్టి అక్కడ వెంటనే వర్షాలు పడే అవకాశముందని అంచనావేస్తున్నాం. భారీ వర్షాలు..అంటే 20 సెం.మీలకన్నా ఎక్కువ ఈశాన్య రాష్ట్రాల్లో పడే అవకాశముంది''అని తెలిపారు. రెండు మూడు రోజులు వర్షాలు కురిసి..ఆ తర్వాత సాధారణ పరిస్థితులు నెలకొంటాయని ఆయన అన్నారు.