Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేరళలో వర్షాలపై సీఎం విజయన్ సమీక్ష
- 35కు చేరిన మృతులు
తిరువనంతపురం : కేరళలో వర్షాలు, వరదల బీభత్సం కొనసాగుతోంది. వర్ష సంబంధిత ఘటనల్లో మరణించిన వారి సంఖ్య సోమవారంతో 35కు చేరింది. ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఇతర సిబ్బంది సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి రెవెన్యూ, విద్యుత్ శాఖ మంత్రులతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పలు ఇతర విభాగాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. కొనసాగుతున్న సహాయక చర్యలను నిశితంగా పర్యవేక్షించాలని, అవసరమైన సమయంలో తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా అన్ని జిల్లాల్లో జరిగిన పంట నష్టంపై పూర్తి నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
డ్యామ్‌ల గేట్ల ఎత్తివేత
రాష్ట్రంలోని పలు నదుల్లో వరద నీటి ప్రవాహం కారణంగా డ్యామ్‌ల్లో నీటి మట్టం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో త్రిస్సూర్ జిల్లాలోని షోలయార్ డ్యామ్ గేట్లను తెరవగా, ఎడమలయార్ డ్యామ్ షట్టర్లను మంగళవారం తెరుస్తామని అధికారులు వెల్లడించారు. ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించే పనిలో ఉన్నారు. పుల్లకాయార్ నదిలో 15 అడుగుల మేర నీటి మట్టం పెరగడంతో ఒడ్డున రెండు కిలోమీటర్ల పరిధిలోని ఇండ్లు ధ్వంసమయ్యాయి. భారీ వర్షాల కారణంగా వరద ప్రభావం అధికంగా ఉన్న కారణంగా రాష్ట్రంలోని డ్యామ్‌ల గేట్లను తెరిచే నిర్ణయంపై నిపుణుల కమిటీకి అప్పగిస్తామని విజయన్ పేర్కొన్నారు. ప్రతి డ్యామ్‌లోని నీటి మట్టాన్ని ఆ కమిటీ అంచనా వేస్తుందని అన్నారు. ఒకవేళ నీటికి కిందికి వదిలిపెట్టాల్సిన పరిస్థితి ఉంటే, దాన్ని జిల్లా కలెక్టర్‌కు తెలియజేస్తారని.. తద్వారా కింది ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే అవకాశం ఉందని పేర్కొన్నారు.