Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లఖింపూర్ ఖేరీ రైతుల మారణకాండకు నిరసన
- నిలిచిన వందలాది రైళ్లు..
- భారీ వర్షంలోనూ రైతుల ఆందోళన
- కేంద్రమంత్రి అజరు మిశ్రాను తొలగించాల్సిందే..
- రైల్‌రోకో విజయవంతం చేసినందుకు అభినందనలు: ఏఐకేఎస్
అన్నదాత మరోసారి పట్టాలెక్కాడు. లఖింపూర్ ఖేరీలో రైతుల మారణకాండ ప్రధాన పాత్రధారి అయిన కేంద్రమంత్రి అజరుమిశ్రాను తొలగించాలని కోరుతూ ఎస్కేఎం ఇచ్చిన పిలుపుమేరకు దేశవ్యాప్తంగా సోమవారం రైల్‌రోకో కార్యక్రమాన్ని నిర్వహించారు. బీజేపీ పాలితరాష్ట్రాల్లో రైతునేతల్ని గృహనిర్బంధంలో ఉంచారు. కేసులు పెడతామని హెచ్చరికలు జారీ చేశాయి. అయినా జనం మడమతిప్పలేదు. మోడీ సర్కార్ దిగిరావాల్సిందేనంటూ రైల్వే స్టేషన్లకు చేరుకున్నారు. మహిళలు సైతం కదంతొక్కి,పట్టాలపై భారీ సంఖ్యలో బైటాయించారు. బీజేపీ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినదించారు. రైల్‌రోకో కారణంగా ముందస్తుగా పలు రాష్ట్రాల్లో రైళ్లను రద్దు చేస్తున్నట్టు రైల్వేశాఖ ప్రకటించింది. దీంతో వందలసంఖ్యలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. రైల్‌రోకో కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ఏఐకేఎస్ అభినందలు తెలిపింది. మోడీ ప్రభుత్వానికి ఇదో హెచ్చరిక అంటూ..రైతు వ్యతిరేకచట్టాల ఉపసంహరణ, కేంద్రమంత్రి అజరు మిశ్రాను తొలగించాల్సిందేనని డిమాండ్ చేసింది.
న్యూఢిల్లీ : లఖింపూర్ ఖేరీ రైతుల మారణకాండకు ప్రధాన పాత్రధారి, కేంద్ర హౌం సహాయ మంత్రి అజరు మిశ్రాపై చర్యలు తీసుకోవడంలో మోడీ సర్కార్ అనుసరిస్తున్న మొండి వైఖరిని నిరసిస్తూ సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) ఇచ్చిన దేశవ్యాప్త రైల్‌రోకో కార్యక్రమం విజయవంతమైంది. వందలాది రైల్వే స్టేషన్లలో రైల్‌రోకో ప్రభావం తీవ్రంగా కనిపించింది. పలుచోట్ల రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని చోట్ల తీవ్ర అంతరాయం ఏర్పడింది. సోమవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆరు గంటల పాటు రైల్వే ట్రాక్‌లు, ప్లాట్‌ఫాంలను రైతులు దిగ్బంధించారు. వేలాది మంది రైలు పట్టాలపై ఆందోళన చేపట్టారు. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షంలో కూడా రైతులు రైల్‌రోకో నిర్వహించారు. కేంద్ర హౌం సహాయ మంత్రి అజరు మిశ్రాను పదవి నుంచి తొలగించాలనీ, ఆయనను అరెస్టు చేయాలని రైతులు డిమాండ్ చేశారు.
రైల్‌రోకో నిరసన కారణంగా 290కి పైగా రైళ్లు ప్రభావితమయ్యాయి. 40 కి పైగా రైళ్లు రద్దు అయ్యాయి. మధ్యప్రదేశ్‌లో ఏఐకేఎస్ సహాయ కార్యదర్శి బాదల్ సరోజ్‌తో సహా నిరసన వ్యక్తం చేస్తున్న రైతులను అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్‌లో ఆదివారం అర్ధరాత్రి నుంచి ఇటావా సహా అనేక జిల్లాలలో పోలీసులు ఉక్కుపాదం మోపారు. అనేక మంది రైతు నాయకులను గృహ నిర్బంధం చేశారు. మధ్యప్రదేశ్‌లో గుణ, గ్వాలియర్, రేవా, బమానియాతో సహా ఇతర ప్రదేశాలలో నిరసనకారులను పోలీసులు అరెస్టు చేశారు. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, కర్నాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, అసోం తదితర రాష్ట్రాల్లో రైల్‌రోకో విజయవంతంగా జరిగింది.పంజాబ్‌లో రైతు నిరసనకారులు తెల్లవారు జామున 5.15 గంటల నుంచే ఫిరోజ్‌పూర్ రైల్వే డివిజన్ వద్ద నాలుగు సెక్షన్లు బ్లాక్ చేసినట్టు రైల్వే అధికార ప్రతినిధి తెలిపారు.అమృత్సర్ రైల్వే స్టేషన్ వద్ద పట్టాలపై బైటాయించారు. హర్యానాలోనూ రైతులు బహదూర్గఢ్ వద్ద రైల్వే ట్రాక్‌పై బైటాయించారు. సోనిపట్ రైల్వే స్టేషన్ వద్ద ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ను రంగంలోకి దింపారు. మరోవైపు ఉత్తరప్రదశ్ ప్రభుత్వం 144 సెక్షన్ విధించింది. ఆందోళనల్లో పాల్గొనే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘిచిన వారిపై జాతీయ భద్రతా చట్టం కింద కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. వివిధ రైల్వే స్టేషన్లలో సాయుధ పోలీసు సిబ్బందిని భారీగా మోహరించారు. 'ఒక్కో జిల్లాలో నిరసన ఒక్కోరకంగా కొనసాగింది. కేంద్రం మాత్రం ఇంతవరకు మమ్మల్ని సంప్రదించలేదు' అని అని రాకేశ్ తికాయత్ అన్నారు.
లఖింపూర్ ఖేరీ రైతుల ఊచకోతకు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి వర్గం నుంచి అజరు మిశ్రాని తొలగించాలనీ, అరెస్టు చేయాలని ఎస్కేఎం డిమాండ్ చేసింది. దర్యాప్తును ప్రభావితం చేయకుండా ఉండేందుకు ఆయనను అరెస్టు చేయాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పింది. లఖింపూర్ ఖేరీ మారణకాండలో న్యాయం కోసం తమ డిమాండ్లను నెరవేర్చకపోతే నిరసనలను మరింత తీవ్రతరం చేస్తామని ఎస్కేఎం హెచ్చరించింది.
ప్రధాని మోడీకి ఇది ఓ హెచ్చరిక..ఏఐకేఎస్
దేశవ్యాప్తంగా రైల్‌రోకోను విజయవంతం చేసినందుకు రైతులకు ఏఐకేఎస్ ధన్యవాదాలు తెలిపింది. ఈ మేరకు సోమవారం ఏఐకేఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అశోక్ ధావలే, హన్నన్ మొల్లా ప్రకటన విడుదల చేశారు. లఖింపూర్ ఖేరీలో రైతులు, జర్నలిస్టు హత్యకు కారణమైన కేంద్ర మంత్రి అజరు మిశ్రాను కాపాడే ప్రధాని మోడీకి ఒక స్పష్టమైన హెచ్చరిక ఈ రైల్‌రోకో ఇచ్చిందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో రైల్‌రోకో జరిగిందనీ, ఉత్తర భారతదేశంలో వందలాది రైళ్లను పూర్తిగా, పాక్షికంగా రద్దు చేస్తున్నట్టు ఇండియన్ రైల్వే ప్రకటించిందని తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లో పోలీసులు అనేక మంది రైతు నాయకులను నిర్బంధించారు.ఇది శాంతియుత నిరసన చేపట్టి ప్రజల రాజ్యాంగ హక్కును పూర్తిగా ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు.దేశవ్యాప్తంగా భారీ వర్షాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ మంచి స్పందన వచ్చిందని ఎస్కేఎం తెలిపింది. రైల్‌రోకోను రైతులు విజయ వంతం చేశారని తెలిపారు. ప్రధాని మోడీ హయంలో క్రూరమైన, అనాలోచితమైన, నిరంకుశ పాలనకు వ్యతిరేకం గా రైతాంగం, ప్రజల్లో కోపం నొక్కి చెప్పిందని పేర్కొన్నారు. మోడీ పాలనలో హంతకులను అరెస్టు చేయాలని ప్రజలు పోరాడటం దేశానికి సిగ్గుచేటని స్పష్టం చేశారు. రైల్‌రోకో విజయవంతం కావడంతో రైతుల సంకల్పం, విశ్వాసం మరింత పెరిగిందనీ, ఎస్కేఎం డిమాండ్లు నెరవేరే వరకు కొనసాగుతున్న పోరాటాన్ని మరింత విస్తరించడానికి, తీవ్రతరం చేయడానికి ఏఐకేఎస్ కట్టుబడి ఉందని తెలిపారు. పోరాటాన్ని పెద్దఎత్తున విజయవంతం చేసిన రైతులు, అన్ని వర్గాల ప్రజలకు ఏఐకేఎస్ హృదయపూర్వకంగా అభినందిస్తుందని పేర్కొన్నారు.
అమర రైతులకు నివాళి యాత్రలు
దేశంలోని అనేక రాష్ట్రాలలో లఖింపూర్ ఖేరీ మారణకాండలో అమరవీరులకు నివాళులర్పించే యాత్రలు జరుగుతున్నాయి. మధ్యప్రదేశ్‌లో షహీద్ కిసాన్ శ్రద్ధాంజలి పాదయాత్రను నిర్వహించారు. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానాలలో షహీద్ అస్తికల యాత్రలు కొనసాగుతున్నాయి.
17 రోజులు పూర్తిచేసుకున్న పాదయాత్ర
గాంధీ జయంతి రోజున బీహార్‌లోని చంపారన్‌లో ప్రారంభమైన లోక్‌నీతి సత్యాగ్రహం కిసాన్ జన్ జాగరణ్ పాదయాత్ర వారణాసికి చేరువలో ఉన్నది. పాదయాత్ర ఇప్పటి వరకు 17 రోజులను పూర్తి చేసింది. ఇది సోమవారం ఉదయం ఘాజీపూర్ జిల్లాలోని నైస్రా నుంచి బయలుదేరి మధ్యాహ్నం నాటికి బసుపూర్ చేరుకున్నది. నేడు (మంగళవారం) పాదయాత్ర బనారస్ జిల్లాలో ప్రవేశిస్తుంది.