Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతుల డిమాండ్లు నెరవేర్చాలి..: మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్
- యూపీలో బీజేపీ నాయకులు గ్రామాల్లో అడుగుపెట్టే పరిస్థితి లేదు..
న్యూఢిల్లీ : నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉధృతంగా సాగుతున్న రైతు ఉద్యమంపై మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రైతుల డిమాండ్‌ను నెరవేర్చాలనీ, లేదంటే ఈ మోడీ సర్కార్‌కు మూడిందేననీ, బీజేపీ మళ్లీ అధికారంలోకి రాదని ఆయన అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ నాయకులు గ్రామాల్లో అడుగుపెట్టే పరిస్థితి లేదని, ఆ స్థాయిలో వ్యతిరేకత ఉందని చెప్పారు. ''నేను మీరట్ నుంచి వచ్చాను. అక్కడ ఏ ఒక్క బీజేపీ నాయకుడు గ్రామాల్లోకి వెళ్లే పరిస్థితి లేదు. కారణం రైతు ఉద్యమం. అక్కడనే కాదు. ముజఫర్‌నగర్, బాఫ్ుపాట్...ఇలా అనేక చోట్ల రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు'' అని ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. రాజస్థాన్‌లో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరైన ఆయన విలేకర్లతో మాట్లాడుతూ రైతు ఉద్యమానికి మద్దతు పలుకుతున్నానని చెప్పారు. పశ్చిమ యూపీ ప్రాంతానికి చెందిన మాలిక్ రైతు ఉద్యమంపై మాట్లాడుతూ, ''అనేక సందర్భాల్లో రైతుల సమస్యకోసం మీరట్‌లో పోరాడాను. ప్రధానితో, హోంమంత్రితో పోట్లాడాను. పంట ఉత్పత్తులకు చట్టపరమైన కనీస మద్దతు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు. కేంద్రం ప్రభుత్వం ఇది చేస్తే సమస్య పరిష్కారమవుతుంది. ఇది కూడా పరిష్కరించరా? ఎంఎస్పీపై రైతుల డిమాండ్ నెరవేర్చకపోతే ఉద్యమం ఆగదు'' అని అన్నారు. వ్యక్తిగతంగా కలుసుకొని ప్రధాని మోడీకి తన అభిప్రాయం చెబుతానని మాలిక్ అన్నారు. కేంద్రం ఒకవేళ కోరుకుంటే మధ్యవర్తిత్వం వహించి రైతులతో చర్చిస్తానని అన్నారు. అయితే ఎంఎస్పీపై రైతుల డిమాండ్ కేంద్రం నెరవేర్చితేనే తన మధ్యవర్తిత్వం ఫలిస్తుందని చెప్పారు.
నా హయాంలో ఇలాంటి దాడులు లేవు..
జమ్మూకాశ్మీర్‌లో జరుగుతున్న వరుస ఉగ్రదాడుల నేపథ్యంలో మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఆ రాష్ట్ర గవర్నర్‌గా ఉన్న సమయంలో ఇలాంటి ఉగ్రదాడులు జరగలేదని, ఉగ్రవాదులు శ్రీనగర్‌లో అడుగుపెట్టడానికి భయపడేవారని, శ్రీనగర్‌కు 100 కి.మీ పరిధిలో ఎక్కడా వారు అడుగుపెట్ట లేకపోయారని సత్యపాల్ మాలిక్ అన్నారు. గతకొన్ని రోజులుగా జమ్మూకాశ్మీర్‌లో జరుగుతున్న ఉగ్రదాడుల్ని ఆయన ఖండించారు. ఉగ్రవాదులు అమాయక పౌరుల్ని చంపుతున్నారని, ఇది అత్యంత విచారకరమని అన్నారు. సత్యపాల్ మాలిక్ జమ్మూకాశ్మీర్‌కు ఆగస్టు 2018 నుంచి అక్టోబర్ 2019 వరకు గవర్నర్‌గా పనిచేశారు. ఆయన హాయంలో ఆర్టికల్ 370ని మోడీ సర్కార్ రద్దు చేసింది. ప్రస్తుతం ఆయన మేఘాలయ గవర్నర్‌గా ఉన్నారు.