Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లక్నో : నకిలీ పత్రాల కేసులో ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే ఇంద్ర ప్రతాప్ తివారీకి ఐదేండ్ల జైలు శిక్ష పడింది. అయోధ్య జిల్లాలోని గోసారుగంజ్ నియోజకవర్గానికి అతను ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 1990లో డిగ్రీ చదివే రోజుల్లో రెండో సంవత్సరంలో ఉత్తీర్ణత కాకపోవడంతో నకిలీ పత్రాలు సృష్టించి తదుపరి తరగతిలో ప్రవేశం పొందినందుకు ఆయనకు ఈ శిక్ష పడింది. 1992లో సదరు కళాశాల ప్రిన్సిపల్ రామ్ త్రిపాఠి అతనిపై రామ జన్మభూమి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 13 ఏళ్ల తర్వాత ఛార్జ్ షీట్ పూర్తయ్యింది. విచారణ సమయంలో ప్రిన్సిపల్ మరణించారు. నాటి కళాశాల డీన్ మహేంద్ర కుమార్ అగర్వాల్, ఇతరులు తివారీకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పారు. ఇప్పుడు స్థానిక ప్రజాప్రతినిధుల కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి పూజాసింగ్ అతనికి ఐదేండ్ల జైలు శిక్షతో పాటు రూ.8 వేల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు.