Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎయిర్ ఇండియా విక్రయ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలి
- ప్రధాని మోడీకి పది కేంద్ర కార్మిక సంఘాల లేఖ
న్యూఢిల్లీ : దేశంలో జాతీయ ఆస్తుల అమ్మకం విధానాన్ని వెనక్కి తీసుకోవాలనీ, అలాగే ఎయిర్ ఇండియా విక్రయ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని పది కేంద్ర కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు మంగళవారం ప్రధాని మోడీకి కేంద్ర కార్మిక సంఘాలు సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, హెచ్ఎంఎస్, ఏఐయూటీయూసీ, టీయూసీసీ, ఎస్ఈడబ్ల్యూఏ, ఏఐసీసీటీయూ, ఎల్పీఎఫ్, యూటీయూసీలతో పాటు రంగాలవారీ స్వతంత్ర ఫెడరేషన్లు, అసోసియేషన్లు లేఖ రాశాయి.
లేఖలో పేర్కొన్న అంశాలు
అక్టోబర్ 8న డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ (దీపం) కార్యదర్శి తుహిన్ కాంత పాండే విలేకరుల సమావేశంలో టాటా సన్స్ అనుబంధ సంస్థ తలాసే ప్రయివేట్ లిమిటెడ్ జాతీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా బిడ్ గెలుచుకుందని ప్రకటించారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం (నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ పాలనలో) 2000 ప్రారంభంలో, 2017-2018లో ముందుగా చేసిన బిడ్లు ఎయిర్ ఇండియాను వదిలించుకున్నట్టు కార్మిక సంఘాలు తెలిపాయి. ఎయిర్ ఇండియా విక్రయాన్ని కార్పొరేట్ చీఫ్‌లు, మీడియా సంతోషంగా స్వాగతించినప్పటికీ, ఎయిర్ ఇండియా ఉద్యోగులతో సహా దేశ ప్రజలు చాలా అసంతృప్తిగా ఉన్నారని కార్మిక సంఘాలు తెలిపాయి. ''ప్రభుత్వం వ్యాపారం చేయదనే తత్వంతో అన్ని పీఎస్‌యూలను విక్రయించడం ప్రారంభించారు. విక్రయించడానికి నష్టాల్లో ఉన్నాయని సాకు చూపించారు. వాజ్‌పేయి నేతృత్వంలోని మొదటి ఎన్డీఏ ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణ మంత్రిత్వ శాఖను కలిగి ఉంది. ఎయిర్ ఇండియా యాజమాన్యంలోని సెంటార్ హౌటల్ అమ్మకం చాలా అపఖ్యాతి పాలైంది'' అని పేర్కొన్నాయి.
ఎయిర్ ఇండియా నష్టాలకు ప్రభుత్వ విధానాలే కారణం..
ప్రభుత్వం విక్రయించాలని నిర్ణయం తీసుకున్న తరువాత ఎయిర్ ఇండియా నిర్వహణ లాభం రూ. రూ. 1,787 కోట్లు, వడ్డీ చెల్లింపులు (రూ. 4,419 కోట్లు), తరుగుదల (రూ.4,419. 30 కోట్లు) అధిక భారం కారణంగా దాని మొత్తం బ్యాలెన్స్ షీట్ రూ. 7,427 కోట్లు నష్టాన్ని ప్రతిబింబిస్తుంది. ఎయిర్ ఇండియా భారీ రుణ భారానికి కేంద్ర ప్రభుత్వం అనుసరించిన నాలుగు నిర్దిష్ట విధానాలే కారణమని పేర్కొన్నాయి. ''అందులో మొదటిది 2005-06లో ఎయిర్ ఇండియా, ఇండియన్ ఎయిర్‌లైన్స్ ద్వారా 111 ఎయిర్‌క్రాఫ్ట్ కొనుగోలు కోసం-ఒకే షాట్లో భారీ ఆర్డర్ ఇవ్వాలనే నిర్ణయం. దానితో ఆగకుండా ఏడాది తరువాత ప్రభుత్వం ఎయిర్ ఇండియా, ఇండియన్ ఎయిర్‌లైన్స్‌ను విలీనానికి నిర్ణయం తీసుకుంది. దేశంలో ''ఓపెన్ స్కైస్'' విధానాన్ని వరుసగా ప్రభుత్వాలు దూకుడుగా అనుసరించడం. ప్రయివేట్ కంపెనీలను ప్రసన్నం చేసుకోవడానికి ఈ రెండు కంపెనీల ప్రయోజనాలు తాకట్టు పెట్టారు'' అని వివరించాయి.
''ప్రభుత్వం దుశ్చర్యలను కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తూ ఎయిర్ ఇండియాను విక్రయించేందుకు సిద్ధమైంది. ఎయిర్ ఇండియా విక్రయంలో బిడ్లు వేయడంలో తీవ్రమై పోటీ నెలకొందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొన్నప్పటికీ, వాస్తవాలు అందుకు భిన్నంగా ఉన్నాయి. కేవలం ఏడు బిడ్లు మాత్రమే ఎయిర్ ఇండియాకు వచ్చాయి. వాటిలో ఐదు నిర్దేశించబడిన ప్రమాణాలకు అనుగుణంగా లేనందున అనర్హులుగా పేర్కొన్నారు. మిగిలిన రెండు బిడ్లలో ఒకటి స్పైస్ జెట్ చైర్మెన్, మేనేజింగ్ డైరెక్టర్ అజరు సింగ్ నేతృత్వంలోని కన్సార్షియం వేసిన బిడ్. ఈ బిడ్ విలువ రూ. 15,100 కోట్లుగా ఉంది. ప్రభుత్వం కనీస ధర రూ. 12,906 కోట్లుగా నిర్ణయించింది. కానీ దాన్ని కాదని టాటా గ్రూప్‌కు బిడ్ దక్కింది. ఇది కేవలం కొత్త యజమానికి లాభదాయక మార్గాలను అందించడం వలన మాత్రమే కాదు, ఎయిర్ ఇండియా యాజమాన్యంలో ఉన్న ఆస్తుల కారణమని పేర్కొంది. 141 విమానాలు, వీటిలో 118 ఎగిరే స్థితిలో ఉన్నాయి. అలాగే దాని ఎయిర్‌బస్‌లు, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ద్వారా బోయింగ్ 737 విమానాలు కొత్తవి ఉన్నాయి. అందువల్ల టాటా విమానయాన సంస్థను కొనుగోలు చేస్తుంది. దాని విమానాలు, బాగా శిక్షణ పొందిన వర్క్‌ఫోర్స్, అలాగే ఇండియన్ ఎయిర్‌పోర్ట్స్, 900 అంతర్జాతీయ ఎయిర్ పోర్టుల్లో 4,400 దేశీయ, 1,800 అంతర్జాతీయ స్లాట్స్ ఉన్నాయి'' అని వివరించాయి.
''ఎయిర్ ఇండి యాను టాటాకు విక్రయించడం వల్ల ఏకస్వామ్య మార్కెట్ సులభతరం అవుతుంది. ఇప్పటికే టాటా యాజమాన్యంలో ఉన్న ఎయిర్ ఏసియా, విస్తారా ఉన్నాయి. వీటికి ఎయిర్ ఇండియా తోడైందని తెలిపాయి. ఈ మూడు విమానయాన సంస్థల ఆదాయం 2020లో రూ.40,500 కోట్లు కాగా, మొత్తం విమానయాన పరిశ్రమ ఆదాయంలో రూ. 95,700 కోట్లు (42.32 శాతం) అవుతుంది. ఇండిగో 37.41 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. దీని అర్థం ఎయిర్ ఇండియా ప్రయివేటీకరణ ఫలితంగా దేశంలోని కేంద్రీకృతమయ్యే మార్కెట్లో విమానయాన పరిశ్రమ ఒకటి అవుతుంది'' అని పేర్కొన్నాయి.
''కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో 14,000 మంది శిక్షణ పొందిన, అనుభవజ్ఞులైన ఉద్యోగులపై అనిశ్చితి నెలకొంది. ఉద్యోగుల ప్రయోజనాలను ''చూసుకుంటామని'' ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, వారి భవిష్యత్తు గురించి స్పష్టత లేదు. ఇప్పటికే ఉద్యోగులు తమ యూనియన్ల ద్వారా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ జారీ చేసిన చట్టవిరుద్ధమైన ఆదేశాలకు వ్యతిరేకంగా సమ్మె నోటీసును అందించడానికి ముందుకు వచ్చారు. ప్రమాదకర పరిస్థితుల్లో చిక్కుకున్న భారతీయులను తరలించడానికి అదే ఉద్యోగులు నిస్వార్థంగా ఎయిర్ ఇండియా విమానాలను నడిపినప్పుడు ప్రశంసలు అందుకున్నారు. కోవిడ్ -19 మహమ్మారి కారణంగా లాక్డౌన్ సమయంలో వందే భారత్ అమలు కోసం అవిశ్రాంతంగా అదే ఉద్యోగులు పనిచేశారు'' అని తెలిపాయి.
2021 సెప్టెంబర్ 29న ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించుకునేలా పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు వెంటనే ఆదేశించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. ఆ ఉద్యోగులను దురుసుగా వెళ్లగొట్టే లావ్యవహరిం చవద్దని డిమాండ్ చేశాయి. ఎయిర్ ఇండియా ప్రతిపాదిత విక్రయంతో సహా జాతీయ ఆస్తుల అమ్మకం చేసే మొత్తం విధానాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశాయి.