Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశంలో మహిళా గిగ్కార్మికుల సమస్యలెన్నో..
- పట్టింపులేని ప్రభుత్వం.. లాభాలవేట ధ్యేయంగా సంస్థల తీరు
- ఓలా, ఉబర్, జోమాటో, స్విగ్గీ మహిళా డెలివరీ వర్కర్లకు ఇబ్బందులు
న్యూఢిల్లీ: దేశంలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు అన్నీఇన్నీ కావు. ఎక్కువగా వారి వేతనాల గురించిన అంశాలు చర్చకు దారితీస్తుంటాయి. అయితే, పెద్దగా చర్చకు రానీ అంశాల్లో గిగ్ కార్మికులు (కాంట్రాక్టు కార్మికులు లేదా తాత్కాలిక కార్మికులు) ఎదుర్కొంటున్న సమస్యలు ఒకటి. మరీ ముఖ్యంగా తాత్కాలిక కార్మికులుగా కొనసాగుతున్న మహిళలకు ఆయా కంపెనీలు చేసిన వాగ్దానాలు ఉత్తిమాటలుగానే మిగిలిపోయాయి. కనీస అవసరాలైన బాత్రూములు లేవు. భద్రతా లేదు. అధికారిక గుర్తింపు లేదు. ప్రోత్సాహకాలు అంతంతే. ఇలాంటి దుర్భర పరిస్థితులు ఉంటే.. అటు ప్రభుత్వమూ కానీ ఇటు ఆయా సంస్థలు కానీ దీనిపై దృష్టి సారించడం లేదు. దీంతో గిగ్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పెరుగుతూనే ఉన్నాయి. స్విగ్గీ, జోమాటో, ఓలా, ఉబర్ వంటి సంస్థల్లో కొనసాగుతున్న గిగ్ కార్మికులు గత నెలలో సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించారు. తమకు సామాజిక భద్రతను కల్పించడంతో పాటు అసంఘటిత కార్మికులుగా గుర్తించాలనీ, ఇతర సౌకర్యాలను సైతం కల్పించాలని పిటిషన్లో డిమాండ్ చేశారు. ఢిల్లీ కామన్వెల్త్ గేమ్స్ నుంచి రెగ్యులర్ కమర్షియల్ డ్రైవర్‌గా మారడం, ఓలాలో చేరడం ఓ కలలా ఉందని 45 ఏండ్ల క్యాబ్ డ్రైవర్ సీతల్ అన్నారు. 2010 నుంచి దేశంలోకి మొబైల్ యాప్ ఆధారిత క్యాబ్ ప్లాట్‌ఫామ్‌లైన ఉబర్, ఓలా సంస్థలు ప్రవేశించాయి. డ్రైవర్లకు మెరుగైన చెల్లింపు వాగ్దానాలతో మంచి గుర్తింపు సంపాదించాయి. అయితే, ముందుగా చెప్పినటువంటి ప్రోత్సాహకాలు 2010 మధ్యకాలం తర్వాత భారీగా తగ్గిపోవడం ప్రారంభించాయి. అయితే, సీతల్ వంటి డ్రైవర్లకు, యాప్ ఆధారిత కంపెనీలు మహిళల పట్ల అనుసరిస్తున్న విధానాలతో ప్రోత్సాహకాలు లేకపోవడం సమస్యగా మారింది. ''ఇందులో కొనసాగుతున్న వారిలో చాలా మంది ఒంటిరి తల్లులు, వారిది వ్యవసాయ కుటుంబ నేపథ్యం కలిగి ఉన్నారు. యాప్‌కి లాగిన్ అవ్వడం, విధులు ముగించిన తర్వాత ఏ సమయంలోనైనా ప్రారంభించవచ్చు అనే ఆలోచనతో ఆకర్షించబడ్డారు. అయితే, కంపెనీలు ఇప్పటికీ పురుషులు, స్త్రీల మధ్య సానుకూల వ్యత్యాసాన్ని ఎంచుకోలేదు''అని ఆమె అన్నారు.ఓలా, ఉబర్, జోమాటో, స్విగ్గీ, అర్బన్ కంపెనీలు భారత్‌లో వేగంగా విస్తరిస్తున్న గిగ్-ఎకానమీలో గరిష్ట సేవా వాటాలను కలిగివున్నాయి. అసోసియేటెడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండిస్టీ ఆఫ్ ఇండియా (అసోచామ్) ప్రకారం భారత్‌లో కనీసం 15 మిలియన్ల మంది గిగ్ వర్కర్లు లేదా తాత్కాలిక కార్మికులు ఉన్నారు. ఆక్స్ఫర్డ్ ఇంటర్నెట్ ఇనిస్టిట్యూట్ 2017 ఆన్లైన్ లేబర్ ఇండెక్స్ ప్రకారం ఆన్లైన్ కార్మిక సరఫరాలో భారత్ అగ్రభాగాన్ని ఆక్రమించి.. ప్రపంచ గిగ్ వర్కర్ల వాటాలో 24 శాతాన్ని కలిగి ఉంది. ప్రస్తుతం యాప్ ఆధారిత వ్యవస్థ, పేలవమైన పని పరిస్థితులు, సామాజిక భద్రతా ప్రయోజనాలు లేకపోవడం, చట్టబద్ధంగా వారికి ఉద్యోగి హౌదా కల్పించడంలో వైఫల్యాలు వంటివి గిగ్ కార్మికులకు అతిపెద్ద అడ్డంకులుగా ఏర్పడ్డాయి. ఇక మహిళలు లింగ అధారిత అసమానతలు సైతం ఎదుర్కొంటున్నారు. గత నెలలో న్యూయార్క్ సిటీ కౌన్సిల్ గిగ్ ఎకానమీకి సంబంధించి ఆరు బిల్లును ఆమోదించింది. వీటిల్లో గిగ్ కార్మికులు రెస్టారెంట్లలో బాత్రూమ్ సౌకర్యాలు పొందడం,డెలివరీ వర్కర్లు ఎంత సమయ ం అక్కడ వుండవచ్చు, కనీస వేతనాలు, ఎంత దూరం వరకు డేలివరీ ప్రయాణం చేయాలి,ప్రోత్సాహాకాలు అందించడం వంటి అంశాలు ఉన్నాయి. అయితే, భారత్ లోనూ ఇలాంటి విషయాలపై పలుమార్లు ఆయా కంపెనీలు ప్రస్తావించాయి. ఈ ఏడాది జూన్‌లో జోమాటో తన సంస్థలో మహిళా కార్మికులను 0.5 నుంచి 10 శాతానికి పెంచలనే యోచనను వెల్లడించింది. అలాగే, మహిళలకు సంబంధించిన భద్రతా, సంబంధిత వస్తువులు అందించడం, మరుగుదొడ్ల ప్రాప్యతను పెంచడం, నెలసరిలో సెలవులు, వీక్‌ఆఫ్‌లు, ప్రోత్సాహకాలు వంటి గురించి ప్రస్తావించింది. స్విగ్గీ సైతం ఇలాంటి తరహా ప్రకటననే తన బ్లాగ్‌లో పోస్టు చేసింది.