Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీజనల్‌గా ఉండే పనిని దృష్టిలో ఉంచుకొని నియమించారు : సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న పార్ట్ టైం ఉద్యోగులకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. పార్ట్ టైం ఉద్యోగుల రెగ్యులరైజేషన్ కుదరదని, అందుకు వారు అర్హులు కారని తీర్పు చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి వారిని నియమించలేదని, ఆ స్థానంలో వారిని తీసుకోలేదని స్పష్టం చేసింది. న్యాయమూర్తులు జస్టిస్ ఎం.ఆర్.షా, జస్టిస్ ఎ.ఎస్.బోపన్నాలతో కూడిన సుప్రీం ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. చండీగఢ్‌లోని పార్ట్ టైం వర్కర్లగా ఉన్న పోస్టాఫీస్ స్వీపర్ల రెగ్యులైజేషన్పై సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు చెప్పగా, దానికి మరింత వివరణ తాజాగా విడుదల చేసింది. ఇక ఉద్యోగాల రెగ్యులైజేషన్ పాలసీ అనేది రాష్ట్రాలు, అక్కడి ప్రభుత్వాలు నిర్ణయిస్తాయని, పార్ట్ టైం సిబ్బందిని శాశ్వత ఉద్యోగులుగా పరిగణించాలని, లేదంటే వారికోసం ప్రభుత్వ ఖాళీలు సృష్టించాలని హైకోర్టులు ఆదేశించలేవని సుప్రీం పేర్కొంది. పార్ట్ ఉద్యోగుల్ని రెగ్యులరైజ్ చేయాలని పంజాబ్, హర్యానా హైకోర్టులు తీర్పులు వెలువరించగా, దీనిని సవాల్ చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు, రెగ్యులైజేషన్ కుదరదని, శాశ్వతంగా కొనసాగించడానికి వీల్లేదని ఇటీవల తీర్పు వెలువరించింది. దీనిపై అత్యున్నత న్యాయస్థానం మరింత స్పష్టతనిచ్చింది. జస్టిస్ ఎం.ఆర్.షా మాట్లాడుతూ..''ఉద్యోగ ఖాళీల్ని భర్తీ చేయడానికి వీరిని(పార్ట్ టైం సిబ్బంది)ని నియమించుకోలేదు. ప్రతిఏడాది వీరి కొనసాగింపుతో శాశ్వత ఉద్యోగ హోదా లభించినట్టు కాదు'' అని చెప్పారు.