Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: ఎల్గర్ పరిషత్ కేసులో నిందితుడైన ప్రొఫెసర్ ఆనంద్ తెల్తుంబ్డే కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై స్పందనలు దాఖలు చేయాలంటూ బాంబే హైకోర్టు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)ను ఆదేశించింది. గత ఒకటిన్నర సంవత్సరాలుగా జైలులో ఉన్న తెల్తుంబ్డే (71) గత నెలలో హైకోర్టును ఆశ్రయించారు, జూలైలో తనకు బెయిల్ నిరాకరించిన ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేశారు. దీనిపై జస్టిస్ నితిన్ జమ్దార్, జస్టిస్ ఎస్వీ.కొత్వాల్లతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. రెండు వారాల్లోగా ఆయన విజ్ఞప్తిపై సమాధానం దాఖలు చేయాలని ఎన్ఐఏను ఆదేశించింది. సీనియర్ న్యాయవాది మిహిర్ దేశారు ద్వారా దాఖలు చేసిన తన పిటిషన్లో.. తెల్తుంబ్డే తనపై మోపిన అన్ని అభియోగాలను ఖండించారు. అలాగే, ఆయనకు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టును కోరారు. ఈ ఏడాది జూలై 12న ఎన్ఐఏ స్పెషల్ కోర్టు తెెల్తుంబ్డే బెయిల్ పిటిషన్ ను తిరస్కరించింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) కింద అతనిపై ప్రాథమిక కేసు నమోదైందని తన ఉత్తర్వుల్లో పేర్కొంది. 2017 డిసెంబర్ 31న పూణేలో జరిగిన ఎల్గర్ పరిషత్ సమావేశంలో ఉద్రేకపూరిత ప్రసం గాలు చేశారనీ, దీని కారణంగానే మరుసటి రోజు భీమా కోరేగావ్లో హింస చెలరేగిందని డజనుకుపైగా కార్య కర్తలపై కేసు నమోదైంది. వారిలో తెల్తుంబ్డే ఒకరు. 2020ఏప్రిల్లో ఆయనను ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది.