Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐఆర్ఎస్డీసీను రద్దు చేస్తున్నామని కేంద్రం ప్రకటన
న్యూఢిల్లీ : భారతీయ రైల్వేలో అత్యంత కీలక విభాగమైన 'ఇండియన్ రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్'(ఐఆర్ఎస్డీసీ)ని రద్దు చేస్తున్నామని కేంద్రం తాజాగా ప్రకటించింది. రైల్వే స్టేషన్ల అభివృద్ధి కోసం 9ఏండ్ల క్రితం ప్రత్యేక కార్పొరేషన్‌గా దీనిని ఏర్పాటుచేశారు. భారతీయ రైల్వేలో జాయింట్ వెంచర్‌గా ఐఆర్ఎస్డీసీ కొనసాగుతోంది. అయితే ఇకముందు దీని అవసరం లేదని, ముందస్తుగా దీనిగురించి ఎలాంటి సమాచారం వెల్లడించకుండా మోడీ సర్కార్ హఠాత్తుగా కార్పొరేషన్‌ను ఎత్తేసింది. ఇక నుంచి స్టేషన్ అభివృద్ధి ప్రాజెక్టులన్నీ ఆయా జోనల్ పరధిలోకి వస్తాయని తాజా ఉత్తర్వుల్లో రైల్వే శాఖ వెల్లడించింది. అంటే కార్పొరేషన్ ఏర్పాటుకు పూర్వం కొనసాగిన పద్ధతే మళ్లీ తీసుకొచ్చారని తెలుస్తోంది. కార్పొరేషన్‌కు సంబంధించి ప్రాజెక్టులు, కీలక పత్రాలు, ఒప్పందాలన్నీ ఆయా జోన్లకు బదిలీ అవుతాయని తాజా ఉత్తర్వులో కేంద్ర రైల్వే శాఖ మంత్రి తెలిపారు.జాతీయ నగదీకరణ విధానం(ఎన్ఎంపీ)లో భాగంగా భారతీయ రైల్వేలో పెద్దఎత్తున ప్రయివేటీకరణకు మోడీ సర్కార్ బాటలు వేసిన సంగతి తెలిసిందే. వందల కోట్లు ఆదాయాన్ని సమకూర్చే రైల్వే లైన్లను, స్టేషన్లను ప్రయివేటుకు అప్పజెప్పడానికి కార్యాచరణను కేంద్రం వేగవంతం చేసింది. అందులో భాగంగానే 'ఐఆర్ఎస్డీసీ' రద్దు చేశారని వార్తలు వెలువడుతున్నాయి. ప్రధాన ఆర్థిక సలహాదారు సంజీవ్ సన్యాల్ సూచనల మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని, ఈ సూచనను రైల్వే ఉన్నతాధికారులు వ్యతిరేకించారని సమాచారం. కార్పొరేషన్లో వివిధ విభాగాల్లో, హోదాల్లో పనిచేసే ఉద్యోగులు, అధికారులు గతకొన్ని రోజులుగా ఆందోళన చెందుతున్నారని తెలిసింది. కారణం కార్పొరేషన్ రద్దుతో వీరికి ఎక్కడ ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. ఒక అనిశ్చిత వాతావరణంలో కూరుకుపోయామని ఐఆర్ఎస్డీసీ ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు.