Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కనీసం వేతనానికి డిమాండ్
చెన్నై: కరోనా మహమ్మారి నేపథ్యంలో ఇండ్లల్లో పనిచేసే అనేక మంది గృహ కార్మికులు ఉపాధిని కోల్పోయారు. ఇప్పటికీ పనిదొరకని వారు లక్షల్లో ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 18 లక్షల మంది గృహ కార్మికులు ఉన్నారు. ఇటీవల వీరి కోసం ప్రభుత్వం తీసుకువచ్చిన సంక్షేమ బోర్డు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో గందరగోళం ఏర్పడటం.. ఆందోళనలకు దారితీసింది. ప్రభుత్వం తీసుకువచ్చిన పలు అంశాలపై వ్యతిరేకత వస్తోంది. ప్రస్తుత పరిస్థితులను పరిగణలోకి తీసుకుని కనీస వేతనాన్ని గంటకు రూ.37 నుంచి రూ.80కి పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. కరోనా మొదటివేవ్ నుంచి లాక్‌డౌన్‌తో పాటు కరోనా సెకండ్‌వేవ్ పరిస్థితుల కారణంగా దాదాపు 80 శాతం గృహ కార్మికులు తమ ఉపాధిని కోల్పోయారని సమాచారం. మహిళా భాగస్వామ్యం అధికంగా ఉన్న గృహ కార్మికులు అసంఘటిత రంగం కిందకు వస్తారు. నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ (ఎన్ఎస్ఎస్వో) గణాంకాల ప్రకారం 39 లక్షల మంది గృహ కార్మికులు ఉన్నారనీ, అందులో 29 లక్షల మంది మహిళలు ఉన్నారు. ''పదేపదే డిమాండ్లు, నిరసనలు చేస్తున్నప్పటికీ గృహ కార్మికుల కష్టాలను ప్రభుత్వాలు పట్టించుకోలేదు'' అని తమిళనాడు గృహ కార్మికుల సంఘం రాష్ట్ర కోశాధికారి పుష్ప అన్నారు. కరోనా కారణంగా తాము ఉపాధి కోల్పోయినప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమకు ఎలాంటి సాయం అందించలేదని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం 2020లో తమిళనాడు అసంఘటిత కార్మికుల సంక్షేమ బోర్డులో నమోదు చేసుకున్న గృహ కార్మికులకు రూ.2,000 సాయం ప్రకటించింది. మే 2021లో రేషన్‌కార్డులు ఉన్నవారికి నిత్యావసరాల కిట్‌తో పాటు రూ.4వేల నగదును అందించింది. అయితే, దీర్ఘకాలిక ఉపాధి, వేతన నష్టాన్ని పరిగణలోకి తీసుకుంటే ప్రకటించిన ఉపశమనం స్వల్పమని చెప్పాలి. రాష్ట్రంలో అసంఘటిత కార్మికుల కోసం ఉన్న 18 సంక్షేమ బోర్డులలో తమిళనాడు గృహ కార్మికుల సంక్షేమ బోర్డు ఒకటి. అయితే, కార్మికుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తిగా ఆన్‌లైన్‌కు మార్చడతో సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే చాలా మందికి ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ గురించి తెలియదు. అలాగే, ప్రభుత్వం చెబుతున్నట్టుగా రిజిస్టర్ చేసుకోవడానికి అనువైన మొబైల్ ఫోన్లు ఉన్నవారు చాలా తక్కువ అని పుష్ఫ చెప్పారు. కార్మిక సంఘాల ద్వారా రిజిస్ట్రేషన్‌కు అనుమతించాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే, రాష్ట్ర ప్రభుత్వం పింఛనును రూ.1,000 నుంచి రూ.3,000కు పెంంచాలనీ, అర్హత వయస్సును ప్రస్తుత 60 ఏండ్ల నుంచి 50 ఏండ్లకు తగ్గించాలని యూనియన్ డిమాండ్ చేసింది.