Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లఖింపూరీ ఖేరీ ఘటన దర్యాప్తు పై సుప్రీం కోర్టు
- చివరి నిమిషంలో నివేదిక సమర్పణపై అసహనం
- ఎక్కువ మంది సాక్షుల్ని ఎందుకు విచారించలేదు..? : సీజేఐ జస్టిస్ ఎన్వి రమణ
న్యూఢిల్లీ : లఖింపూర్ ఖేరీ కేసు దర్యాప్తు విషయంలో.. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలపై అత్యున్నత న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. గత విచారణ సమయంలో నివేదిక సమర్పించాలని కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ బుధవారం ఉదయం వరకూ ఇవ్వక పోవడంపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. విచారణ నత్తనడకన సాగుతున్నదనే ముద్ర తొలగించుకోవాలని సూచించింది. ఎక్కువ మంది సాక్షుల్ని ఎందుకు విచారించలేదనీ, మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలాలు సేకరించడం ఆలస్యమెందుకవుతోందని ప్రశ్నించింది.
ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరిలో జరిగిన హింసా కాండపై ఇద్దరు న్యాయవాదులు శివకుమార్ త్రిపాఠి, సిఎస్ పాండా సీబీఐ విచారణ చేపట్టాలంటూ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణకు రాసిన లేఖపై సుప్రీం కోర్టు విచారణ చేపట్టిన విషయం విదితమే. సీజేఐ జస్టిస్ ఎన్వి రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లిలతో కూడిన ధర్మాసనం బుధవారం కేసు విచారణ కొనసాగించింది. తొలుత యూపీ ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే వాదనలు వినిపిస్తూ ఈ ఘటనపై సీల్డ్ కవర్లో నివేదిక సమర్పించినట్టు కోర్టుకు తెలిపారు. దీనిపై స్పందించిన సీజేఐ జస్టిస్ ఎన్వి రమణ.. చివరి నిమిషంలో నివేదిక ఇవ్వడం వల్ల ఏం చేయగలమని అసంతృప్తి వ్యక్తం చేశారు. ''సీల్డ్ కవర్ నివేదిక అవసరం లేదు. మేం నివేదిక విచారణకు ముందు అందుకున్నాం. మంగళవారం రాత్రి ఒంటిగంట వరకు ఏదైనా నివేదిక దాఖలు అవుతుందేమోనని వేచి చూశాం. కానీ మాకు ఏమీ అందలేదు. మీరు చివరి నిమిషంలో సమర్పిస్తే.. మేమెప్పుడు దాన్ని పరిశీలించాలి? కనీసం ఒకరోజు ముందైనా సమర్పించాలి కదా!'' అని సీజేఐ ఎన్వి రమణ అన్నారు. జస్టిస్ సూర్య కాంత్ జోక్యం చేసుకొని నివేదికను సీల్డ్ కవర్లో దాఖలు చేయాలని కోర్టు ఎప్పుడూ అడగలేదని అన్నారు. ''ఇది సున్నితమైన విషయం చూద్దాం. ఇది రహస్యమేమీ కాదు'' అని ధర్మాసనం పేర్కొంది. అయితే నివేదికను ప్రస్తుతానికి అనుమతించాలంటూ పిటిషనర్ న్యాయవాది శివ కుమార్ త్రిపాఠి చేసిన అభ్యర్థనను ధర్మాసనం తిరస్కరించింది. హరీష్ సాల్వే నిందితుల పరిస్థితిపై ధర్మాసనానికి వివరించారు. ''నిందితుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మృదువుగా వ్యవహరిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు ప్రమేయం ఉన్నవారు అరెస్టయి.. జైలులో ఉన్నారు. ఇప్పటి వరకు జైలులో10 మంది నిందితులు ఉన్నారు. రెండు నేరాలు జరిగాయి. ఒకటి రైతులపై వాహనాలు నడపడం, మరొకటి ఒక వ్యక్తిని చంపారు'' అని వివరించారు. 44 మంది సాక్షుల్ని విచారించామని చెప్పినప్పటికీ, సీఆర్పీసీ సెక్షన్ 164 ప్రకారం కేవలం నలుగురు వాంగ్మూలాలే ఎందుకు నమోదు చేశారని సీజేఐ ప్రశ్నించారు. తదుపరి వారి వాంగ్మూలాల సేకరణ కొనసాగుతోందనీ, కోర్టులు సెలవులో ఉన్నాయని సాల్వే తెలిపారు. జస్టిస్ హిమా కోహ్లీ జోక్యం చేసుకొని ''దసరా సెలవుల కోసం క్రిమినల్ కోర్టులు మూతపడ్డాయా?'' అని సందేహం వ్యక్తం చేశారు. పది మంది అరెస్టు మినహా పోలీసు, జ్యుడీషియల్ కస్టడీలో ఎంతమంది ఉన్నారని సీజేఐ ప్రశ్నించగా నలుగురు పోలీసు కస్టడీలో ఉన్నారనిసాల్వే తెలిపారు. ''మిగిలిన ఆరుగురి సంగతేంటి? మీరు కస్టడీ కోరలేదు కాబట్టి, వారిని జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. ఈ కేసులో పరిస్థితి ఏమిటి?'' అని సీజేఐ అన్నారు. ఘటనకు సంబంధించి మరికొన్ని వీడియోలు ఉన్నాయని సాల్వే తెలపగా ... దీన్ని ముగింపులేని కథలా చేయొద్దని సీజేఐ వ్యాఖ్యానించారు.నేర ఘటన తిరిగి దర్యాప్తు (క్క్రెం సీన్ రికనస్ట్రక్ట్) జరుగుతోందని యుపి ప్రభుత్వ అదనపు అడ్వొకేట్జనరల్ గరీమా ప్రషాద్ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. సిఆర్పిసి సెక్షన్ 164 ప్రకారం వాంగ్మూలాలు రికార్డు చేయడమనేది మేజిస్ట్రేట్ ముందు చేస్తారని, ఇది విలువైన సాక్ష్యంగా పరిగణిస్తారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. విచారణ నత్తనడకన సాగుతోందని భావిస్తున్నామని, ఆ ముద్ర తొలగించుకోవాలని జస్టిస్ హిమ కోహ్లి వ్యాఖ్యానించారు. వాంగ్మూలాలు సిఆర్పిసి సెక్షన్ 164 ప్రకారం నమోదు చేయాలని సిజెఐ జస్టిస్ ఎన్వి రమణ తెలిపారు. సాక్షుల వాంగ్మూలాలను రికార్డ్ చేయడానికి సమయం కావాలని హరీష్ సాల్వే చేసిన అభ్యర్థన మేరకు ధర్మాసనం తదుపరి విచారణను అక్టోబర్ 26 (మంగళవారం) నాటికి వాయిదా వేసింది.